ప్రపంచ నంబర్ వన్ బౌలర్ తబ్రైజ్ షంషీతో రాజస్థాన్ రాయల్స్ ఒప్పందం

ABN , First Publish Date - 2021-08-26T02:29:52+05:30 IST

టీ20 ప్రపంచ నంబర్ వన్ బౌలర్ తబ్రైజ్ షంషీ దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్‌ పార్ట్-2లో రాజస్థాన్ రాయల్స్‌కు

ప్రపంచ నంబర్ వన్ బౌలర్ తబ్రైజ్ షంషీతో రాజస్థాన్ రాయల్స్ ఒప్పందం

జైపూర్:  టీ20 ప్రపంచ నంబర్ వన్ బౌలర్ తబ్రైజ్ షంషీ దుబాయ్‌లో జరగనున్న ఐపీఎల్‌ పార్ట్-2లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడనున్నాడు. ఈ మేరకు రాజస్థాన్ ఫ్రాంచైజీ అతడితో ఒప్పందం చేసుకుంది. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆసీస్ పేసర్ ఆండ్రూ టై స్థానంలో అతడిని జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ స్థానంలో ఇప్పటికే న్యూజిలాండ్ బ్యాట్స్ ‌మన్ గ్లెన్ ఫిలిప్స్‌ను జట్టులోకి తీసుకున్న రాజస్థాన్.. తాగా సౌతాఫ్రికన్ స్పిన్నర్ షంషీతో ఒప్పందం కుదుర్చుకుంది. 


ఇండియాలో కరోనా రెండో దశ కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఐపీఎల్.. వచ్చే నెల 19 నుంచి యూఏఈలో ప్రారంభం కానుంది. అదే నెల 21 దుబాయ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. బెన్‌స్టోక్స్, జోఫ్రా అర్చర్ వంటి ఆటగాళ్లు లేకున్నా తొలి అర్ధభాగంలో రాజస్థాన్ బాగానే రాణించింది. ఏడు మ్యాచుల్లో మూడు విజయాలతో ఐదో స్థానంలో నిలిచింది. 


31 ఏళ్ల షంషీ దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో ‘ది టైటాన్స్’కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2017లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. లెఫ్టార్మ్ లెగ్‌స్పిన్నర్ అయిన షంషీ 39 టీ20లలో 45 వికెట్లు తీసుకున్నాడు. 27 వన్డేల్లో 32 వికెట్లు పడగొట్టాడు. 

Updated Date - 2021-08-26T02:29:52+05:30 IST