‘ఆఖర్లో’ పొరపాటు.. టైటాన్స్‌కు షాక్‌

ABN , First Publish Date - 2021-12-26T09:20:49+05:30 IST

ప్రొ కబడ్డీ లీగ్‌ తాజా సీజన్‌లో మరో మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్‌కు చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌ను టై చేసుకున్న ఆ జట్టు.. శనివారం హోరాహోరీగా సాగిన రెండో పోరులో 33-34 స్కోరుతో పుణెరి

‘ఆఖర్లో’ పొరపాటు.. టైటాన్స్‌కు షాక్‌

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ తాజా సీజన్‌లో మరో మ్యాచ్‌లోనూ తెలుగు టైటాన్స్‌కు చుక్కెదురైంది. తొలి మ్యాచ్‌ను టై చేసుకున్న ఆ జట్టు.. శనివారం హోరాహోరీగా సాగిన రెండో పోరులో 33-34 స్కోరుతో పుణెరి పల్టన్‌ చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆరంభం నుంచి నువ్వానేనా అనేలా సాగిన మ్యాచ్‌లో ప్రథమార్థం ముగిసే సరికి టైటాన్స్‌ 20-14తో ముందంజలో నిలిచింది.  ద్వితీయార్థంలో క్రమంగా పుంజుకున్న పుణె నాలుగు పాయింట్ల ఆధిక్యం ప్రదర్శించినా.. కొద్దిసేపటికే టైటాన్స్‌ 25-25తో సమం చేసింది. ఈ దశనుంచి రెండు జట్లు పట్టువిడవకుండా పోరాడడంతో స్కోర్లు సమమవుతూ రాగా 33-33వద్ద దేశాయ్‌ని టాకిల్‌ చేసిన పుణె ఒక పాయింట్‌ ఆధిక్యం సాధించింది. ఇక డు ఆర్‌ డై రైడ్‌కి వెళ్లిన రాకేశ్‌ గౌడ టచ్‌ పాయింట్‌కోసం కాకుండా బోనస్‌ పాయింట్‌కు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో..తెలుగు టైటాన్స్‌కు షాక్‌ తప్పలేదు. ఇతర మ్యాచ్‌ల్లో జైపూర్‌ 40-38తో హరియాణాపై, యూపీ 36-35తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందాయి.

Updated Date - 2021-12-26T09:20:49+05:30 IST