9న పారాలింపిక్స్ విజేతలను కలవనున్న మోదీ
ABN , First Publish Date - 2021-09-04T02:46:07+05:30 IST
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 9న టోక్యో పారాలింపిక్స్ విజేతలను కలవనున్నారు.

న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 9న టోక్యో పారాలింపిక్స్ విజేతలను కలవనున్నారు. పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు ఇప్పటికే 13 పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ‘పారా’ గేమ్స్‌లో భారత్‌కు ఇన్ని పతకాలు రావడం ఇదే తొలిసారి. మొత్తం 54 మంది పారా అథ్లెట్లు 9 వేర్వేరు విభాగాల్లో పోటీపడుతున్నారు.
తాజాగా, నేడు (శుక్రవారం) హర్విందర్ సింగ్ ఆర్చరీలో భారత్‌కు కాంస్య పతకం అందించి పతకాల సంఖ్యను 13కు చేర్చాడు. అంతేకాదు, నేడు భారత్‌కు ఇది మూడో పతకం. భారత్ క్రీడాకారులు ఇప్పటి వరకు 2 స్వర్ణ పతకాలు, 6 రజతం, 5 కాంస్య పతకాలు సాధించారు. పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం 37వ స్థానంలో ఉంది.
టోక్యో పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణ పతకం అందించిన సుమిత్ అంటిల్ నేడు ఢిల్లీ చేరుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా అతడికి స్వాగతం లభించింది. అతడి ఫొటోలు తీసేందుకు మీడియా ఎగబడింది. సుమిత్ మద్దతుదారులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు.