మన సహచరులను కాపాడుకుందాం.. ముందుకు రండి: పంత్
ABN , First Publish Date - 2021-05-09T00:14:53+05:30 IST
ప్రస్తుతం దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది.

ప్రస్తుతం దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజుకు 4 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. హాస్పిటల్స్‌లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, మందుల కొరత వేధిస్తున్నాయి. ఈ అపద సమయంలో సామాన్యులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ కూడా తన వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. ఆ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశాడు.
ప్రస్తుతం దేశం కరోనా రెండో దశతో అల్లాడిపోతోందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్ బాధితులకు అండగా ఉండాలని పేర్కొన్నాడు. ఒక భారతీయుడిగా సహచరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, అందరం చేతనైనంత సహాయం చేద్దామని పిలుపునిచ్చాడు. తన వంతుగా హేమకుంత ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్స్, మందులు అందించడానికి ప్రయత్నిస్తున్నానన్నాడు. అందరూ తలో చేయీ వేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని, తోటి వారికి సహాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని సూచించాడు.