ఒలింపిక్స్ రద్దు చేస్తే జపాన్ తట్టుకోగలదా?
ABN , First Publish Date - 2021-05-21T05:45:24+05:30 IST
కరోనా మహమ్మారి జపాన్‌ను అతలాకుతలం చేస్తోంది. కొవిడ్ నాలుగో దశ విజృంభణ కారణంగా పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు విధించడం..

దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ
ప్రజల నుంచి పెరుగుతున్న వ్యతిరేకత
అయినా క్రీడల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు
టోక్యో: కరోనా మహమ్మారి జపాన్‌ను అతలాకుతలం చేస్తోంది. కొవిడ్ నాలుగో దశ విజృంభణ కారణంగా పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులు విధించడం.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. కడచిన త్రైమాసికంలో జపాన్ స్థూల దేశీయో త్పతి (జీడీపీ) 1.3 శాతం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. టోక్యో ప్రజలు కూడా ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని కోరుతున్నా.. ప్రభుత్వం మాత్రం మెగా ఈవెంట్ నిర్వహణకే మొగ్గు చూపుతోంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆర్థిక వ్యవస్థకు ఊపు తీసుకురావాలంటే విశ్వక్రీడల్లాంటి ఈవెంట్ నిర్వహిస్తే భారీగా ఆదాయం సమకూరుతుందని, ప్రజల దృష్టిని మరల్చడానికి కూడా సహకరిస్తుందని జపాన్ రాజకీయ నాయకులు భావిస్తున్నారట. 2020లో జీడీపీ 4 శాతం పతనమైంది. కానీ, మెగా ఈవెంట్ వాయిదా పడినా.. ఆ ఏడాది ఆఖరి క్వార్టర్స్‌లో సానుకూల ఫలితాలను కనబరిచింది.
ఒలింపిక్స్‌కూ, జీడీపీకి లింకేంటి?
విశ్వక్రీడలు తరహా భారీ ఈవెంట్ జరిగితే.. ఇతర దేశాల నుంచి అభిమానులు, అథ్లెట్లు వస్తారు. దీంతో పర్యాటకం, వ్యాపార రంగానికి ఊతం లభిస్తుంది. వైరస్ కారణంగా ఒడిదుడుకులకు లోనవుతున్న ఆర్థిక వ్యవస్థను నిలబెడుతుంది. అయితే, అభిమానులు రాకుండా తలుపులు మూసిన స్టేడియాల్లో నిర్వహిస్తే మాత్రం భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన విశ్వ క్రీడల చరిత్రలో టోక్యో ఒలింపిక్స్ అత్యంత ఖరీదైన ఈవెంట్‌గా భావిస్తున్నారు. దాదాపు రూ. 18.28 లక్షల కోట్లు అంచనా వ్యయంగా లెక్కలేస్తున్నారు.
మళ్లీ వాయిదానో రద్దో జరిగితే జపాన్ తట్టుకోలేదు. ఇప్పటికే ఏడాదిపాటు వాయిదా వేయడంతో సంవత్సరం మొత్తం స్టేడియాల నిర్వహణ భారం గుదిబండగా మారింది. బయోసెక్యూర్ బబుల్ కోసం వేలాది మంది ఆటగాళ్లు రెండు నెలల ముందుగా రావడం, వారికి పరీక్షలు, సౌకర్యాలతో అంచనా వ్యయం మరింతగా పెరుగనుంది. 2019లో ఒలింపిక్స్ కోసం జపాన్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, కరోనా విజృంభణతో అంతా తలకిందులైంది. తాజాగా నిర్వహించిన ఓ ఆన్‌లైన్ సర్వేలో 80 శాతం మంది జపాన్ వాసులు మెగా ఈవెంట్ రద్దు? లేదా వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని కోరుతున్నారు. వేలాది మంది ఇతర దేశాల నుంచి వస్తే కొవిడ్ మరింతగా వ్యాపిస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రద్దు చేస్తే భారీ నష్టం
ఒకవైపు ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంటే.. మరోవైపు కొవిడ్ కేసులు కొండలా పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది జపాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జపాన్ ప్రధాని యోషిహైడ్ సుగా ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. అయితే, సాధ్యమైనంతగా నష్టాలను తగ్గించుకుంటూ.. మెగా ఈవెంట్ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవేళ ఒలింపిక్స్ రద్దయితే ఐవోసీ కూడా భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో ఎట్టిపరిస్థితుల్లోనూ ఒలింపిక్స్‌ను నిర్వహించాలని జపాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.