Copa America: విజయాన్ని అర్జెంటీనా కొవిడ్ బాధితులకు అంకితమిచ్చిన మెస్సీ

ABN , First Publish Date - 2021-07-13T02:38:16+05:30 IST

బ్రెజిల్‌తో హోరాహోరీగా సాగిన కోపా అమెరికా కప్ ఫైనల్‌లో విజయం సాధించి కప్‌ను ముద్దాడిన అర్జెంటీనా

Copa America: విజయాన్ని అర్జెంటీనా కొవిడ్ బాధితులకు అంకితమిచ్చిన మెస్సీ

రియో డి జెనీరో: బ్రెజిల్‌తో హోరాహోరీగా సాగిన కోపా అమెరికా కప్ ఫైనల్‌లో విజయం సాధించి కప్‌ను ముద్దాడిన అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ విజయాన్ని మెస్సీ అర్జెంటీనాలోని కొవిడ్ బాధితులకు, తన కుటుంబానికి, ఇటీవల కన్నుమూసిన దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు డీగో మారడోనాకు అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. మెస్సీ కెరియర్‌లో ఇది తొలి అంతర్జాతీయ టైటిల్. మారకానా స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి అయిన బ్రెజిల్‌తో జరిగిన ఫైనల్ పోరులో 1-0తో విజయం సాధించిన అర్జెంటీనా కప్పును ఎగరేసుకుపోయింది.  


‘‘నేను మరింత ముందుకు సాగేందుకు అవసరమైన బలాన్ని ఇచ్చిన నా కుటుంబానికి, నన్ను అమితంగా ప్రేమించే నా స్నేహితులు, మాపై నమ్మకం ఉంచిన వారికి, కరోనా వైరస్ కారణంగా కష్టాలు ఎదుర్కొన్న దేశంలోని 45 మిలియన్ల మందికి, ముఖ్యంగా మహమ్మారి బారినపడిన వారికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నాను’’ అని మెస్సీ పేర్కొన్నాడు. మరీ ముఖ్యంగా డీగో  మారడోనాకు అంకితమిస్తున్నట్టు తెలిపాడు. ఏ లోకంలో ఉన్నా అతడి ఆశీస్సులు మాత్రం తమతోనే ఉంటాయని పేర్కొన్నాడు. సంబరాలు చేసుకునే క్రమంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని మెస్సీ సూచించాడు. 

Updated Date - 2021-07-13T02:38:16+05:30 IST