జడేజా, విహారి మళ్లీ జట్టులోకి

ABN , First Publish Date - 2021-05-08T09:38:31+05:30 IST

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌..

జడేజా, విహారి మళ్లీ జట్టులోకి

హార్దిక్‌, భువనేశ్వర్‌, కుల్దీ్‌పకు నో చాన్స్‌

డబ్ల్యూటీసీ ఫైనల్‌, ఇంగ్లండ్‌తో సిరీ్‌సకు టీమిండియా 


న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. చేతన్‌ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలెక్షన్‌ కమిటీ 20 మందితో కూడిన బృందాన్ని శుక్రవారం ఎంపిక చేసింది. జూన్‌ 18-22 మధ్య సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్య ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ జరుగుతుంది. భారత జట్టు ఈనెల మూడో వారంలో ఇంగ్లండ్‌ వెళ్లి క్వారంటైన్‌లో ఉండనుంది. కాగా, సెలెక్టర్లు జట్టు ఎంపికలో సంచలనాలకు చోటివ్వలేదు. ఆసీస్‌ పర్యటనలో ఆడిన భారత జట్టునే ఈసారీ పరిగణనలోకి తీసుకున్నారు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీ్‌సలో మూడు మ్యాచ్‌ల్లో 27 వికెట్లు తీసిన స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. గాయం కారణంగా జడేజా ఆ సిరీ్‌సకు దూరం కావడంతో అతడి స్థానంలో వచ్చిన అక్షర్‌ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.


ఇక బుమ్రా, ఇషాంత్‌, షమి, సిరాజ్‌, ఉమేశ్‌, శార్దూల్‌ రూపంలో జట్టుకు ఆరుగురు పేసర్లు అందుబాటులో ఉండబోతున్నారు. యార్కర్‌ స్పెషలిస్ట్‌ నటరాజన్‌ గాయం కారణంగా జట్టుకు ఎంపికవలేదు. అలాగే గాయాల కారణంగానే ఆసీస్‌ టూర్‌ మధ్యలో స్వదేశానికి వచ్చిన జడేజా, విహారి ఇంగ్లండ్‌తో సిరీ్‌సకు కూడా దూరమయ్యారు. అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు టీమిండియాలో చేరారు. 


ఆ ముగ్గురిపై వేటు!

పేసర్‌ భువనేశ్వర్‌, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాతో పాటు చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌పై వేటు పడింది. బౌలర్‌గా కాకుండా పాండ్యా కేవలం బ్యాట్స్‌మన్‌గానే సేవలందిస్తున్నాడు. కనీసం టీ20 మ్యాచ్‌లోనూ అతడు నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. అటు బ్యాట్స్‌మన్‌గానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో టెస్టు జట్టులో అతడిని పక్కకు తప్పించారు. ఇక కుల్దీ్‌పను పక్కనబెట్టడం ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. బౌలింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. గత రెండేళ్లలో అతడాడింది ఒక టెస్టు మాత్రమే. జట్టులోకి వచ్చిన అక్షర్‌ లాంటి స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తుండడంతో ఇక కుల్దీ్‌పకు జాతీయ జట్టులో తలుపులు మూసుకుపోయినట్టుగానే భావించవచ్చు. అయితే పేసర్‌ భువనేశ్వర్‌ను టెస్టు జట్టు నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించింది. అలాగే యువ ఓపెనర్‌ పృథ్వీ షాకు చోటు దక్కుతుందని ఆశించినా సెలెక్టర్లు పట్టించుకోలేదు.


ఇదీ భారత జట్టు

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రహానె (వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పుజార, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, ఆర్‌.అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమేశ్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, వృద్ధిమాన్‌ సాహా.


స్టాండ్‌బై ఆటగాళ్లు: 

అభిమన్యు ఈశ్వరన్‌, ప్రసిద్ధ్‌ క్రిష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జన్‌ నాగ్‌వస్వల్ల.


నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లు

జట్టుతో పాటు నలుగురు స్టాండ్‌బై ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు. దేశవాళీల్లో మెరుగ్గా రాణించిన ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌, పేసర్లు ప్రసిద్ధ్‌ కృష్ణ, అవేశ్‌ ఖాన్‌, అర్జన్‌ నాగ్‌వస్వల్ల వీరిలో ఉన్నారు. వీరంతా జట్టుతో పాటు ఇంగ్లండ్‌ వెళతారు. సిరీస్‌ మధ్యలో ఎవరికైనా గాయమైతే జట్టులో చేరే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అవేశ్‌ ఇటీవలి ఐపీఎల్‌లో విశేషంగా రాణించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీ్‌సలో ప్రసిద్ధ్‌ కృష్ణ ఇప్పటికే సత్తా చాటుకున్నాడు.


రాహుల్‌, సాహా ఫిట్‌గా ఉంటేనే..

అపెండిసైటిస్‌ నుంచి కోలుకుంటున్న కేఎల్‌ రాహుల్‌తో పాటు కరోనా పాజిటివ్‌గా తేలిన వృద్ధిమాన్‌ సాహా కూడా భారత జట్టు 20 మంది జాబితాలో ఉన్నారు. ప్రస్తుతానికి జట్టుకు ఎంపిక చేసినా ఇంగ్లండ్‌కు వెళ్లాలంటే వీరిద్దరికీ ఫిట్‌నెస్‌ కీలకం కానుంది. ఫిట్‌నెస్‌ టెస్టులో పాస్‌ అయితేనే వీరిద్దరూ జట్టుతో చేరే అవకాశం ఉంది.

Updated Date - 2021-05-08T09:38:31+05:30 IST