బ్యాడ్మింటన్‌లో పతక ఆశలు
ABN , First Publish Date - 2021-09-03T08:16:33+05:30 IST
పారాలింపిక్స్‌లో వరుసగా రెండోరోజూ భారత్ పతకాలు లేకుండా ముగించింది.

సెమీస్‌లో ప్రమోద్, కృష్ణ
కనోయింగ్‌లో ప్రాచీ యాదవ్
పారాలింపిక్స్
టోక్యో: పారాలింపిక్స్‌లో వరుసగా రెండోరోజూ భారత్ పతకాలు లేకుండా ముగించింది. అయితే బ్యాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్ ప్రమోద్ భగత్ (ఎస్‌ఎల్-3), కృష్ణ నాగర్ (ఎస్‌హెచ్-6) తమ విభాగాలలో సెమీ్‌సకు చేరడం ద్వారా పతకాలపై ఆశలు రేపారు. కనోయింగ్‌లో ప్రాచీ యాదవ్ కూడా సెమీ్‌సలోకి అడుగుపెట్టింది. తైక్వాండోలో అరుణా తన్వర్ గాయంతో రెపిచేజ్ రౌండ్‌నుంచి వైదొలగింది.
అదరగొడుతున్న ప్రమోద్:
బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నెం.1 ప్రమోద్ భగత్ సింగిల్స్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సెమీస్ స్థానం ఖాయం చేసుకున్నాడు. గ్రూప్ ‘ఎ’ ఎస్‌ఎల్-3లో గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో భగత్ 21-12, 21-19 స్కోరుతో వరుస గేముల్లో ఒలెక్సాండర్ చిర్కోవ్ (ఉక్రెయిన్)ను చిత్తు చేశాడు. సెమీ్‌సలో విజయం సాధిస్తే కాంస్య పతకం ఖరారవుతుంది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సహచరుడు, ప్రపంచ నెం.3 మనోజ్ సర్కార్‌పై ప్రమోద్ గెలుపొందిన సంగతి తెలిసిందే. సింగిల్స్ గ్రూప్ ‘బి’ ఎస్‌హెచ్-6 విభాగంలో రెండోసీడ్ కృష్ణ నాగర్ 22-20, 21-10 స్కోరుతో తరేసో డిడిన్ (మలేసియా)ని ఓడించి ముందంజ వేశాడు. సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ ఎస్‌ఎల్-4 విభాగంలో సుహా స్ 21-9, 21-3 స్కోరుతో జాన్ నిక్లాస్ (జర్మనీ)పై, గ్రూప్ ‘బి’లో తరుణ్ 21-17, 21-13 స్కోరుతో సిరిపాంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’ రెండో మ్యాచ్‌లో పాలక్ కోహ్లీ 21-12, 21-18 స్కోరుతో బగ్లర్ జెహ్రా (టర్కీ)ని చిత్తుచేసింది. ఇక..19 ఏళ్ల కోహ్లీ/పారుల్ పర్మార్ గ్రూప్ ‘బి’ మహిళల డబుల్స్ ఎస్‌ఎల్-3ఎ్‌సయూఎస్-5 విభాగం పోరులో చైనా జోడీ హెఫాంగ్/హ్యూహ్యూ చేతిలో ఓడారు. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘డి’ ఎస్‌ఎల్-3 మ్యాచ్‌లో పర్మార్ 8-21, 2-21 స్కోరుతో చెంగ్ హెఫాంగ్ (చైనా) చేతిలో చిత్తయింది.
కనోయింగ్ సెమీ్‌సలో ప్రాచీ యాదవ్:
కనోయింగ్ మహిళల వీఏఏ సింగిల్స్ 200 మీ. స్ర్పింట్ విభాగంలో భారత్‌కు చెందిన ప్రాచీ యాదవ్ సెమీఫైనల్లో ప్రవేశించింది. యాదవ్ నిమిషం 11.098 సె.లో రేస్‌ను పూర్తి చేసింది.
అయ్యో..అరుణ:
తైక్వాండో 49 కిలోల కే-44 విభాగంలో అరుణా తన్వర్ గాయంతో రెపిచేజ్ రౌండ్‌నుంచి వైదొలగింది. క్వార్టర్‌ఫైనల్లో నాలుగో సీడ్ ఎస్పినోజా కరంజా (పెరూ) చేతిలో ఓడినా..తన్వర్‌కు రెపిచేజ్ అవకాశం లభించింది. అయితే తొలి రౌండ్ పోరులో కుడి పాదానికి తీవ్ర గాయం కావడంతో రేపిచేజ్ బౌట్‌నుంచి అరుణ వైదొలగింది.
