ఆర్చర్ల తడబాటు

ABN , First Publish Date - 2021-07-24T07:05:27+05:30 IST

ఎన్నో ఆశలతో టోక్యోలో అడుగుపెట్టిన భారత ఆర్చర్లు తొలిరోజే తడబడ్డారు. అర్హత రౌండ్లలో మెరుగైన స్థానాలను దక్కించుకోవడంలో విఫలమయ్యారు.

ఆర్చర్ల తడబాటు

ర్యాంకింగ్‌ రౌండ్లలో దీపికకు తొమ్మిదో స్థానం


టోక్యో: ఎన్నో ఆశలతో టోక్యోలో అడుగుపెట్టిన భారత ఆర్చర్లు తొలిరోజే తడబడ్డారు. అర్హత రౌండ్లలో మెరుగైన స్థానాలను దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా పతకరౌండ్ల కంటే ముందే కొరియా లాంటి దీటైన ప్రత్యర్థిని ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకున్నారు. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత స్టార్‌, ప్రపంచ నెంబర్‌వన్‌ దీపికా కుమారి 663 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. కొరియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్‌ అన్‌ సాన్‌ ఒలింపిక్‌ రికార్డు స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. 20 ఏళ్ల అన్‌ సాన్‌ ఏకంగా 680 పాయింట్లు స్కోరు చేసి  ఈ క్రీడల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది.


కొరియాకే చెందిన జాంగ్‌ మిన్‌హి (677), కాంగ్‌ చే వాంగ్‌ (675) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ర్యాంకింగ్‌ రౌండ్లో వచ్చిన స్థానాలను బట్టి ఆర్చర్లకు ప్రధాన రౌండ్లలో సీడింగ్స్‌ కేటాయిస్తారు. ఈ లెక్కన దీపికకు క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ అన్‌ సాన్‌ ఎదురు పడే అవకాశముంది. పురుషుల వ్యక్తిగత విభాగం అర్హత రౌండ్లలో దీపిక భర్త, స్టార్‌ ఆర్చర్‌ అతాను దాసు 653 పాయింట్లతో 35వ స్థానానికి పరిమితమవగా, తరుణ్‌దీప్‌ రాయ్‌ (652)  37వ స్థానంలో నిలిచాడు. ఈ ఇద్దరికంటే కాస్త మెరుగైన ప్రదర్శనతో మరో ఆర్చర్‌ ప్రవీణ్‌ జాదవ్‌ 656 పాయింట్లతో 31వ స్థానాన్ని దక్కించుకున్నాడు. దీపిక, ప్రవీణ్‌ పాయింట్లు కలిపితే మిక్స్‌డ్‌ విభాగంలో భారత్‌కు తొమ్మిదో స్థానం లభించింది. ఇక పురుషుల్లో ముగ్గురు ఆర్చర్ల పాయింట్ల ఆధారంగా టీమ్‌ ఈవెంట్లో భారత్‌కు తొమ్మిదో స్థానం దక్కింది. దీంతో ఈ సీడింగ్స్‌తో భారత జట్లు ప్రధాన రౌండ్లలో పోటీపడనున్నాయి. 

Updated Date - 2021-07-24T07:05:27+05:30 IST