బోణీ అదిరె..
ABN , First Publish Date - 2021-03-24T06:56:25+05:30 IST
టెస్టు, టీ20 సిరీస్‌లా కాకుండా ఈసారి భారత్ విజయంతో బోణీ చేసింది. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండ్ షోతో చెలరేగి న భారత్ 66 పరుగుల తేడాతో నెగ్గింది...

- తొలి వన్డేలో భారత్ ఘన విజయం
- ధవన్ సెంచరీ మిస్
- అరంగేట్రంలో సత్తాచాటిన ప్రసిద్ధ్, క్రునాల్
318 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ స్కోరు ఓ దశలో 14 ఓవర్లలోనే 135 పరుగులు.. ఓపెనర్లు బెయిర్‌స్టో, రాయ్ క్రీజులో ఉన్నంత సేపు భారత్ విజయం గురించి మర్చిపోవాల్సి వచ్చింది. కానీ కొత్త పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ ఈ జోడీని విడదీయడంతో పాటు నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోగా.. అటు శార్దూల్ మిగతావారి పనిపట్టాడు. అంతకుముందు ధవన్ 98 రన్స్‌తో ఫామ్ చాటుకున్నాడు. కోహ్లీ, రాహుల్, క్రునాల్ ధనాధన్ ఇన్నింగ్స్ కనబరిచారు.
పుణె: టెస్టు, టీ20 సిరీస్‌లా కాకుండా ఈసారి భారత్ విజయంతో బోణీ చేసింది. మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆల్‌రౌండ్ షోతో చెలరేగి న భారత్ 66 పరుగుల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వన్డేల సిరీ్‌సలో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 317 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (98), రాహుల్ (62 నాటౌట్), క్రునాల్ పాండ్యా (58 నాటౌట్), కోహ్లీ (56) అర్ధసెంచరీలు సాధించగా.. స్టోక్స్ మూడు, వుడ్ రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. బెయిర్‌స్టో (94), జేసన్ రాయ్ (46) రాణించారు. అరంగేట్ర పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణ (4/54), శార్దూల్ (3/37) ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ధవన్ నిలిచాడు. రెండో వన్డే శుక్రవారం జరుగుతుంది.
బెయిర్‌స్టో, రాయ్ ఉన్నంత సేపే..: ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మెరుపు వేగంతో ఆరంభమైంది. ఓపెనర్లు బెయిర్‌స్టో, రాయ్ ఎదురుదాడికి ఆరంభంలో భారత బౌలర్లు ధారాళంగా రన్స్ సమర్పించుకున్నారు. భువనేశ్వర్ అద్భుతంగా కట్టడి చేసినా, కొత్త పేసర్ ప్రసిద్ధ్ క్రిష్ణను మాత్రం ఆడుకున్నారు. ప్రసిద్ధ్ మూడో ఓవర్లో బెయిర్‌స్టో 6,0,6,4,4తో బెంబేలెత్తించి 22 రన్స్ రాబట్టాడు. ఇక తొమ్మిదో ఓవర్లో క్రునాల్‌ను రాయ్ 4,4,6తో వణికించాడు. దీంతో 12 ఓవర్లలో స్కోరు వంద దాటింది. ఆ తర్వాత పుంజుకున్న ప్రసిద్ధ్ వరుస ఓవర్లలో రాయ్, స్టోక్స్ (1)ను అవుట్ చేయడంతో ఇంగ్లండ్ పతనం మొదలైంది. అటు బెయిర్‌స్టో ఆరు పరుగుల దూరంలో శతకాన్ని కోల్పోయి శార్దూల్ చేతిలో అవుటయ్యాడు. అలాగే 25వ ఓవర్లోనూ మోర్గాన్ (22), బట్లర్ (2) వికెట్లను ప్రసిద్ధ్ తీయడంతో భారత్ గెలుపు ఖాయమైంది. అయితే అప్పటికి చేయాల్సిన రన్‌రేట్ 6 లోపే ఉండి ఓవర్లు కూడా తగినన్ని ఉండడంతో ఇంగ్లండ్‌కూ చాన్స్ కనిపించింది. కానీ మొయిన్ అలీ (30) నిష్క్రమణతో ఆ జట్టు ఆశలు వదులుకుంది.
ధవన్, కోహ్లీ దంచగా..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ధవన్ సత్తా చాటాడు. మరో ఓపెనర్ రోహిత్ (28)తో కలిసి తొలి వికెట్‌కు 64 పరుగులు.. ఆ తర్వాత కోహ్లీతో రెండో వికెట్‌కు 105 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంగ్లండ్ బౌలర్లను ధవన్-కోహ్లీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 28వ ఓవర్లో ధవన్ క్యాచ్‌ను అలీ మిస్ చేశాడు. మరుసటి ఓవర్లో అతను 6,4 బాదాడు. కానీ పేసర్ వుడ్ తన వరుస ఓవర్లలో కోహ్లీ, శ్రేయాస్ (6)ను అవుట్ చేయడంతో భారత్ జోరు తగ్గింది. కాసేపటికే ధవన్, హార్దిక్ (1)ను స్టోక్స్ అవుట్ చేయడంతో మధ్య ఓవర్లలో భారత్ తడబడింది.
రాహుల్, క్రునాల్ హవా: 41 ఓవర్లలో భారత్ స్కోరు 206/5. ఈ దశలో భారత్ 280 రన్స్ అయినా చేస్తుందా అనిపించింది. కానీ రాహుల్-క్రునాల్ జోడీ ఆరో వికెట్‌కు అజేయంగా 57 బంతుల్లోనే 112 పరుగులు జత చేశారు. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడిన క్రునాల్ వచ్చీ రావడంతోనే మూడు ఫోర్లు బాదాడు. అటు రాహుల్ కూడా బ్యాట్ ఝుళిపిస్తూ ఫామ్‌లోకి వచ్చాడు. 48వ ఓవర్లో క్రునాల్ 4,6.. రాహుల్ మరో సిక్స్‌తో 21 పరుగులు వచ్చాయి. ఇదే జోరుతో క్రునాల్ 26 బంతుల్లో.. రాహుల్ 39 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేశారు.
రోహిత్, శ్రేయా్‌సకు గాయాలు
భారత బ్యాటింగ్ సమయంలో వుడ్ వేసిన బంతి రోహిత్ మోచేతికి బలంగా తాకడంతో గాయపడ్డాడు. అప్పటికి బ్యాటింగ్ కొనసాగించినా ఆ తర్వాత ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఇక శ్రేయాస్ 8వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడడంతో మైదానం వీడాడు.
1
అరంగేట్ర వన్డేలోనే అత్యంత వేగం (26 బంతుల్లో)గా అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్ క్రునాల్ పాండ్యా. ఈ క్రమంలో జాన్ మోరిస్ (కివీస్, 35 బంతుల్లో)ను అధిగమించాడు.
అరంగేట్ర వన్డేలోనే అత్యధిక వికెట్లు (4) తీసిన భారత బౌలర్‌గా ప్రసిద్ధ్ క్రిష్ణ
2
సచిన్ తర్వాత సొంత గడ్డపై పది వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా కోహ్లీ.
స్కోరుబోర్డు
భారత్: రోహిత్ (సి) బట్లర్ (బి) స్టోక్స్ 28; ధవన్ (సి) మోర్గాన్ (బి) స్టోక్స్ 98; కోహ్లీ (సి) అలీ (బి) వుడ్ 56; శ్రేయాస్ (సి-సబ్) లివింగ్‌స్టోన్ (బి) వుడ్ 6; రాహుల్ (నాటౌట్) 62; హార్దిక్ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్ 1; క్రునాల్ (నాటౌట్) 58; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 50 ఓవర్లలో 317/5. వికెట్ల పతనం: 1-64, 2-169, 3-187, 4-197, 5-205. బౌలింగ్: వుడ్ 10-1-75-2; సామ్ కర్రాన్ 10-1-48-0; టామ్ కర్రాన్ 10-0-63-0; స్టోక్స్ 8-1-34-3; రషీద్ 9-0-66-0; మొయిన్ అలీ 3-0-28-0.
ఇంగ్లండ్: రాయ్ (సి-సబ్) సూర్య (బి) ప్రసిద్ధ్ 46; బెయిర్‌స్టో (సి) కుల్దీప్ (బి) శార్దూల్ 94; స్టోక్స్ (సి-సబ్) గిల్ (బి) ప్రసిద్ధ్ 1; మోర్గాన్ (సి) రాహుల్ (బి) శార్దూల్ 22; బట్లర్ (ఎల్బీ) శార్దూల్ 2; బిల్లింగ్స్ (సి) కోహ్లీ (బి) ప్రసిద్ధ్ 18; మొయిన్ అలీ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 30; సామ్ కర్రాన్ (సి-సబ్) గిల్ (బి) క్రునాల్ 12; టామ్ కర్రాన్ (సి) భువనేశ్వర్ (బి) ప్రసిద్ధ్ 11; రషీద్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 0; వుడ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 42.1 ఓవర్లలో 251 ఆలౌట్. వికెట్ల పతనం: 1-135, 2-137, 3-169, 4-175, 5-176, 6-217, 7-237, 8-239, 9-241, 10-251. బౌలింగ్: భువనేశ్వర్ 9-0-30-2; ప్రసిద్ధ్ క్రిష్ణ 8.1-1-54-4; శార్దూల్ 6-0-37-3; క్రునాల్ 10-0-59-1; కుల్దీప్ 9-0-68-0.