టార్గెట్‌.. ఫైనల్‌ బెర్త్‌

ABN , First Publish Date - 2021-02-05T09:10:51+05:30 IST

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏడాదికాలం తర్వాత భారత్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ సందడి కనిపించబోతోంది. ..

టార్గెట్‌..  ఫైనల్‌ బెర్త్‌

ఉదయం 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

 నేటి నుంచి భారత్ ‌X ఇంగ్లండ్‌ తొలి మ్యాచ్‌

టెస్టు చాంపియన్‌షి్‌పపై గురి జూ పూర్తి స్థాయి జట్టుతో కోహ్లీ సేన


పేసర్‌ బుమ్రా ఇప్పటిదాకా 17 టెస్టులు విదేశాల్లోనే ఆడాడు. స్వదేశంలో అతడికిదే తొలి టెస్టు.

 భారత జట్టు స్వదేశంలో చివరి టెస్టును 2019, నవంబరులో(బంగ్లాదేశ్‌తో) ఆడింది.

ఇంగ్లండ్‌ తరఫున వంద టెస్టులు ఆడనున్న రెండో పిన్నవయస్కుడు (30 ఏళ్లు) జో రూట్‌. 


ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏడాదికాలం తర్వాత భారత్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ సందడి కనిపించబోతోంది. కరోనా దెబ్బకు గతేడాది జనవరి నుంచి ఇక్కడ టీమిండియా ఆడిందే లేదు. పూర్తి స్థాయి ఆటగాళ్లు లేకపోయినా ఆసీ్‌సను చిత్తు చేసిన భారత జట్టుపై ఇప్పుడు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడబోతోంది. అయితే ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అయిన విరాట్‌ కోహ్లీ, జో రూట్‌ ఆధ్వర్యంలోని ఈ రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు ముగింపు ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే!


చెన్నై: ఓ వైపు ఆస్ట్రేలియాపై గెలిచిన ఉత్సాహంలో టీమిండియా.. మరోవైపు శ్రీలంకను క్లీన్‌స్వీ్‌ప చేసిన జోరులో ఇంగ్లండ్‌. ఇలా విజయాల జోష్‌లో ఉన్న ఇరుజట్ల మధ్య  స్థానిక చిదంబరం స్టేడియంలో శుక్రవారం తొలి టెస్టు మొదలవనుంది. అలాగే నాలుగు టెస్టుల ఈ సిరీస్‌ను దక్కించుకోవడంతో పాటు ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో చోటు చేజిక్కించుకోవడం కూడా రెండు జట్ల లక్ష్యంగా కనిపిస్తోంది. దీని కోసం భారత్‌ కనీసం 2-0 లేక 2-1తో నైనా ఈ సిరీస్‌ గెలవాలి. స్వదేశంలో 2012 నుంచి ఒక్క టెస్టు సిరీస్‌ను కోల్పోని కోహ్లీసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇక్కడ చివరి (2016) పర్యటనలో ఇంగ్లండ్‌ 0-4తో సిరీ్‌సను ఓడింది. అయితే ఇరువురి మధ్య జరిగిన ఆఖరి 5 టెస్టుల్లో 4-1తో రూట్‌సేనదే పైచేయి.


సాహా కాదు.. పంత్‌:

కోహ్లీ, ఇషాంత్‌, అశ్విన్‌, బుమ్రా, పాండ్యా ఇలా కీలక ఆటగాళ్లంతా జట్టులో చేరడంతో ఇప్పుడు తుది పదకొండు మందిని ఎంపిక చేయడం టీమిండియాకు సవాల్‌గా మారింది. ఇంతకుముందు చెపాక్‌ పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తుందనే వార్తలు వినిపించినా అది వాస్తవంగా కనిపించడం లేదు. స్పిన్నర్లే కీలకం కానుండడంతో జట్టులో ముగ్గురికి చోటు దక్కొచ్చు. అశ్విన్‌కు జతగా రెండో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను తీసుకోవచ్చు. వ్యూహాత్మకంగా లెఫ్టామ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ వైపు మొగ్గు చూపితే అతడి అరంగేట్రం ఖాయమే. అదే జరిగితే గాబా హీరో వాషింగ్టన్‌ సుందర్‌ బెంచ్‌కే పరిమితం కావాలి. ఇక వికెట్‌ కీపర్‌గా పంత్‌ ఆడతాడని కెప్టెన్‌ కోహ్లీ చెప్పడంతో సాహాతో పోటీ లేదని స్పష్టమైంది. ఇక పూర్తి ఫిట్‌నె స్‌తో ఉండడంతో పేసర్‌ ఇషాంత్‌, బుమ్రాతో కలిసి తుది జట్టులో ఉండనున్నాడు. అదే జరిగితే సిరాజ్‌ వేచి ఉండాల్సిందే. ఓపెనర్‌ గిల్‌ తొలిసారిగా స్వదేశంలోనూ బ్యాటింగ్‌ సత్తా చూపాలనుకుంటున్నాడు. పుజార, కోహ్లీ, రహానెతో మిడిలార్డర్‌ పటిష్టంగా ఉంది.


జాక్‌ క్రాలే దూరం:

ఓపెనర్‌ జాక్‌ క్రాలే గాయంతో తొలి రెండు టెస్టులకు దూరమవడం ఇంగ్లండ్‌కు గట్టి దెబ్బే. దీంతో రోరీ బర్న్స్‌, డామ్‌ సిబ్లే ఓపెనింగ్‌ చేయనున్నారు. మిడిలార్డర్‌లో జో రూట్‌, బట్లర్‌, స్టోక్స్‌ భారత్‌కు సవాల్‌ విసరనున్నారు. ఇక పిచ్‌కు తగ్గట్టుగా ఇంగ్లండ్‌ కూడా మొయిన్‌ అలీ, డామ్‌ బెస్‌, జాక్‌ లీచ్‌లతో స్పిన్‌ విభాగాన్ని పటిష్టం చేయనుంది. రొటేషన్‌లో భాగంగా అండర్సన్‌, బ్రాడ్‌లలో ఒకరికే చోటు దక్కుతుంది. విశ్రాంతి తర్వాత జట్టులోకి వచ్చిన ఆర్చర్‌ రెండో పేసర్‌గా ఆడే చాన్సుంది. 


జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌, గిల్‌, పుజార, కోహ్లీ, రహానె, పంత్‌, అక్షర్‌, అశ్విన్‌, ఇషాంత్‌, కుల్దీప్‌, బుమ్రా.

ఇంగ్లండ్‌: బర్న్ప్‌, సిబ్లే, లారెన్స్‌, రూట్‌, స్టోక్స్‌, పోప్‌, బట్లర్‌, అలీ, ఆర్చర్‌, లీచ్‌, బ్రాడ్‌/అండర్సన్‌.


పిచ్‌ 

చిదంబరం పిచ్‌పై స్పిన్నర్లకు పండగే. గతేడాది జనవరిలో ఇక్కడ జరిగిన రంజీ మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగియగా స్పిన్నర్లు 25 వికెట్లు పడగొట్టారు. ఈ వేదికపై చివరి టెస్టు 2016లో జరగ్గా ఇంగ్లండ్‌పై జడేజా ఏడు వికెట్లు తీశాడు.

Updated Date - 2021-02-05T09:10:51+05:30 IST