గబ్బాలో ఆస్ట్రేలియా.. సెంచూరియన్‌లో సౌతాఫ్రికా.. : భారత్ చేతిలో చిత్తు
ABN , First Publish Date - 2021-12-31T00:14:30+05:30 IST
విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత టెస్టు జట్టు విదేశాల్లో చరిత్రను తిరగ రాయడాన్ని అలవాటుగా చేసుకుంది. 11 నెలల..

సెంచూరియన్: విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత టెస్టు జట్టు విదేశాల్లో చరిత్రను తిరగ రాయడాన్ని అలవాటుగా చేసుకుంది. 11 నెలల క్రితం ప్రతిష్ఠాత్మక గబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాను కంగు తినిపించిన భారత జట్టు.. తాజాగా, సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికాపై 113 పరుగులతో విజయం సాధించింది.
ఈ విజయంతో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాలో భారత్ ఇప్పటి వరకు 22 టెస్టులు ఆడగా ఇది నాలుగో విజయం మాత్రమే. అంతేకాదు, 2006-07లో రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో గెలిచి 1-0 ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత ఆ సిరీస్‌లో వెనకబడి 1-2తో సిరీస్‌ను చేజార్చుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు సఫారీ గడ్డపై తొలి టెస్టులో విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శించింది.
అతేకాదు, సెంచూరియన్‌లో విజయం సాధించిన తొలి ఇండియన్ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2018లో సౌతాఫ్రికాలో పర్యటించిన భారత జట్టు సెంచూరియన్ టెస్టులో పరాజయం పాలైంది. ధోనీ సారథ్యంలోని జట్టు కూడా సెంచూరియన్‌లో ఆడినా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ సిరీస్ డ్రా అయింది. కాగా సెంచూరియన్‌లో విజయం సాధించిన మూడో పర్యాటక జట్టుగా కూడా భారత్ రికార్డులకెక్కింది. అంతకుముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో విజయం సాధించాయి.
సెంచూరియన్‌లో 28 టెస్టులు ఆడిన సౌతాఫ్రికా 21 టెస్టుల్లో విజయం సాధించి మూడింటిలో ఓడింది. ఇక, సెంచూరియన్‌లో ఇంగ్లండ్ జట్టు 2000వ సంవత్సరంలో, ఆస్ట్రేలియా 2014లో విజయం విజయం సాధించగా, తాజాగా భారత జట్టు జయకేతనం ఎగురవేసింది.