విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగులు.. చేజారిన కోహ్లీ స్థానం!

ABN , First Publish Date - 2021-01-14T00:14:17+05:30 IST

ఏటా విడుదలయ్యే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగులు తాజాగా విడుదలయ్యాయి. వీటిలో టాప్ టెన్‌లో మన భారత జట్టు సభ్యులు ముగ్గురు స్థానం సంపాదించారు.

విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగులు.. చేజారిన కోహ్లీ స్థానం!

న్యూఢిల్లీ: ఏటా విడుదలయ్యే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగులు తాజాగా విడుదలయ్యాయి. వీటిలో టాప్ టెన్‌లో మన భారత జట్టు సభ్యులు ముగ్గురు స్థానం సంపాదించారు. భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టు తర్వాత విడుదలైన ఈ ర్యాంకింగుల్లో కింగ్ కోహ్లీ స్థానాన్ని ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ లాగేసుకున్నాడు. మొన్నటి వరకూ మూడో స్థానంలో ఉన్న స్మిత్.. కోహ్లీని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి ఎగబాకాడు. కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. అయితే తొలి టెస్టు తర్వాత భార్య అనుష్కశర్మ డెలివరీ కోసం పేరెంటల్ లీవ్ తీసుకున్న కోహ్లీ.. ఆ తర్వాతి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ల ర్యాంకింగుల్లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మన నయావాల్ ఛతేశ్వర్ పుజారా ఎనిమిదో స్థానంలో నిలవగా, తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.


బౌలర్ల ర్యాంకింగుల్లో టాప్ టెన్‌లో భారత్ నుంచి కేవలం ఇద్దరికే స్థానం దక్కింది. ఆసీస్ టూర్లో అద్భుతంగా రాణిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ 9వ స్థానంలో, పేస్ తురుపు ముక్క జస్ప్రీత్ బుమ్రా 10వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ తొలి స్థానంలో ఉన్నాడు.


ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం మనకు కొంత ఆశావహ ఫలితాలు వచ్చాయి. ఆసీస్ టూర్‌లో సత్తా చాటిన రవీంద్ర జడేజా ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. అశ్విన్ కూడా ఈ జాబితాలో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.

Updated Date - 2021-01-14T00:14:17+05:30 IST