హాకీ స్టార్లు రవీందర్‌, కౌశిక్‌ ఇకలేరు

ABN , First Publish Date - 2021-05-09T09:24:06+05:30 IST

కరోనా వైరస్‌ ఇద్దరు హాకీ దిగ్గజాలను బలి తీసుకుంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన భారత జట్టు సభ్యులు ఎంకే కౌశిక్‌ (66), రవీందర్‌ పాల్‌ సింగ్‌ (60) కొవిడ్‌తో చికిత్స పొందుతూ

హాకీ స్టార్లు రవీందర్‌, కౌశిక్‌ ఇకలేరు

కరోనాతో పోరాడుతూ మృతి


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఇద్దరు హాకీ దిగ్గజాలను బలి తీసుకుంది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించిన భారత జట్టు సభ్యులు ఎంకే కౌశిక్‌ (66), రవీందర్‌ పాల్‌ సింగ్‌ (60) కొవిడ్‌తో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. టీమిండియాకు చీఫ్‌ కోచ్‌గా కూడా వ్యవహరించిన కౌశిక్‌ గతనెల 17న కొవిడ్‌ పాజిటివ్‌గా తేలాడు. దాంతో అతడిని ఇక్కడి ఓ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం కౌశిక్‌ను వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే రాత్రి అతడు మరణించినట్టు కౌశిక్‌ కుమారుడు ఇషాన్‌ వెల్లడించాడు.


భారత సీనియర్‌ పురుషులు, మహిళల జట్లకు కౌశిక్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అతడి కోచింగ్‌లో పురుషుల జట్టు 1998 బ్యాంకాక్‌ ఏషియాడ్‌లో స్వర్ణ పతకం నెగ్గడం విశేషం. అలాగే మహిళల జట్టు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్య పతకం అందుకుంది. 1998లో అర్జున, 2002లో ద్రోణాచార్య పురస్కారాలు కౌశిక్‌ను వరించాయి. 


నెగెటివ్‌ వచ్చినా..

రవీందర్‌పాల్‌ సింగ్‌కు గతనెల 24న కరోనా సోకగా లఖ్‌నవ్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. వైర్‌స నుంచి కోలుకొని నెగెటివ్‌ రావడంతో గురువారం అతడిని నాన్‌ కొవిడ్‌ వార్డుకు తరలించారు.  కానీ శుక్రవారం హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. శనివారం ఉదయం రవీందర్‌పాల్‌ తుదిశ్వాస విడిచాడు. 1980తోపాటు 1984 లాస్‌ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న రవీందర్‌ అవివాహితుడు. సెంటర్‌ హాఫ్‌ ఆటగాడైన రవీందర్‌ 1979 జూనియర్‌ వరల్డ్‌ కప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ (1980, 1983), 1982 సీనియర్‌ ప్రపంచ కప్‌, 1982 ఆసియా కప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కౌశిక్‌, రవీందర్‌పాల్‌ సింగ్‌ మృతిపట్ల క్రీడల మంత్రి కిరణ్‌ రిజుజు, హాకీ ఇండియా సంతాపం ప్రకటించాయి. భారత హాకీకి వారిద్దరు చేసిన సేవలు ఎనలేనివని రిజుజు, హాకీ ఇండియా చీఫ్‌ గ్యానేంద్రో నింగోబమ్‌ కీర్తించారు.

Updated Date - 2021-05-09T09:24:06+05:30 IST