క్వార్టర్స్‌లో యువ భారత్‌

ABN , First Publish Date - 2021-11-28T08:40:27+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది.

క్వార్టర్స్‌లో యువ భారత్‌

చివరి లీగ్‌ మ్యాచ్‌లో పోలెండ్‌పై ఘన విజయం

హాకీ జూనియర్‌ వరల్డ్‌ కప్‌

భువనేశ్వర్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ జూనియర్‌ వరల్డ్‌ కప్‌ హాకీ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయింది.   చావోరేవో తేల్చుకోవాల్సిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ సత్తాచాటింది. శనివారం జరిగిన తమ గ్రూప్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో యువ భారత్‌ 8-2తో పోలెండ్‌పై ఘన విజయం సాధించింది. మరోసారి అద్భుత ప్రదర్శనతో వైస్‌ కెప్టెన్‌ సంజయ్‌ రెండు గోల్స్‌ (4, 58ని.) కొట్టి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. ఫార్వర్డ్‌లు అరైజీత్‌ సింగ్‌ (8, 60 ని.), సుదీప్‌ (24, 40 ని.) చెరో రెండు గోల్స్‌ కొట్టారు. ఉత్తమ్‌ (34 ని), తివారీ (38 ని) చెరో గోల్‌ సాధించారు. పోలెండ్‌ తరపున రుత్వోస్కీ (50), రాబర్ట్‌ (54 ని.) చెరో గోల్‌ చేశారు. ఈ విజయంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, ఒక దానిలో ఓడిన టీమిండియా మొత్తం 6 పాయింట్లతో గ్రూప్‌ ‘బి’లో రెండో స్థానంలో నిలిచింది. బుధవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌ బెల్జియంతో తలపడనుంది. పూల్‌ ‘బి’లో ఫ్రాన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ 3-1తో ఈజి్‌ప్టపై, ఫ్రాన్స్‌ 11-1తో కెనడాపై, మలేసియా 4-3తో సౌతాఫ్రికాపై,  బెల్జియం 3-0తో చిలీపై గెలుపొందాయి. 

Updated Date - 2021-11-28T08:40:27+05:30 IST