గంగూలీది కష్టపడే తత్వం కాదు: గ్రెగ్ ఛాపెల్
ABN , First Publish Date - 2021-05-20T22:27:42+05:30 IST
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ ఛాపెల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురించి ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ ఛాపెల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గంగూలీది కష్టపడే తత్వం కాదని గతంలో టీమిండియాకు కోచ్‌గా పనిచేసిన ఛాపెల్ తాజాగా వ్యాఖ్యానించాడు. 2005- 2007 మధ్య కాలంలో గ్రెగ్ చాపెల్ భారత క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో గంగూలీ-ఛాపెల్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.
`టీమిండియా కోచ్‌గా రమ్మని గంగూలీయే నన్ను అడిగాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచంలోని పటిష్టమైన జట్టుతో పనిచేయాలని నాకూ ఉండేది. గంగూలీ వల్లే నాకు ఆ అవకాశం దక్కిందని కచ్చితంగా చెప్పగలను. అయితే ఆ రెండేళ్ల పాటు ఎటు చూసినా కఠిన సవాళ్లే. అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు సౌరవ్ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతుండేది. నిజానికి గంగూలీది కఠినంగా శ్రమించే తత్వం కాదు. అయితే, కెప్టెన్‌గా మాత్రం తానే ఉండాలనుకునేవాడు. అలా అయితేనే పరిస్థితులన్నీ తన అదుపులోనే ఉంటాయని అనుకునేవాడ`ని ఛాపెల్ వ్యాఖ్యానించాడు.