కన్నుల పండువగా..

ABN , First Publish Date - 2021-08-25T06:16:00+05:30 IST

అచంచల ఆత్మవిశ్వాసానికి.. ఉక్కు సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పారాలింపిక్స్‌ ఆరంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ‘మాకూ రెక్కలున్నాయ్‌’ అనే ఇతివృత్తంతో 16వ పారాలింపిక్స్‌ మంగళవారం ఆరంభమయ్యాయి...

కన్నుల పండువగా..

  • మొదలైన టోక్యో పారాలింపిక్స్‌ 


టోక్యో: అచంచల ఆత్మవిశ్వాసానికి.. ఉక్కు సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పారాలింపిక్స్‌ ఆరంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ‘మాకూ రెక్కలున్నాయ్‌’ అనే ఇతివృత్తంతో 16వ పారాలింపిక్స్‌ మంగళవారం ఆరంభమయ్యాయి. అవరోధాలు ఎదురైనా.. విధిని ఎదిరించి.. వినువీధిలో విజయ కేతనాలు ఎగురవేయవచ్చనే సందేశాన్నిచ్చింది. దాదాపుగా ఖాళీగా ఉన్న స్టేడియంలో జపాన్‌ చక్రవర్తి నరుహిటో క్రీడలు ఆరంభమైనట్టు ప్రకటించారు. ఆ తర్వాత జపాన్‌ పతాకాన్ని వేదికపైకి తీసువచ్చి ఎగరేయడంతో సంబరాలకు తెర లేచింది. విపత్కర పరిస్థితుల్లో ఈ క్రీడలను నిర్వహించడం అసాధ్యమని భావించినా.. ఎంతో మంది కృషితో సుసాధ్యమైందని అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు ఆండ్రూ పార్సన్స్‌ అన్నాడు. కరోనా మహమ్మారి కారణంగా యావత్‌ ప్రపంచం విపత్కరపరిస్థితులు ఎదుర్కొంటున్నా.. ధైర్యంగా ముందుకు సాగిపోతున్న పారా అథెట్లకు ఈ సందర్భంగా జోహార్లు అర్పించారు. 57 ఏళ్ల తర్వాత పారాలింపిక్స్‌ ఈవెంట్‌కు టోక్యో మరోసారి ఆతిథ్యం ఇస్తోంది. ఈ మెగా ఈవెంట్‌కు రెండోసారి వేదికైన ఏకైక నగరంగా టోక్యో రికార్డులకెక్కింది. 


ఆకట్టుకున్న ‘లిటిల్‌ వన్‌ వింగ్డ్‌ ప్లేన్‌’: ‘పారా ఎయిర్‌పోర్ట్‌’గా వ్యవహరించిన వేదికపై భిన్నత్వం, సంఘటిత తత్వానికి మరోరూపుగా నిలిచే పారాలింపిక్స్‌ ప్రారంభం.. పిల్లగాలిలా మొదలై ప్రచండమైన సుడిగాలిగా మారి ఎదురులేకుండా సాగిపోయే వీడియోతో మొదలైంది. ఎయిర్‌పోర్టులోని క్రూ సభ్యులు.. కౌంట్‌ డౌన్‌ చేస్తుండగా.. ఆకాశంలో మిరుమిట్లుగొలిపే బాణసంచా కాంతుల మధ్య క్రీడల ఆరంభ సందడి మొదలైంది. టోక్యో-2020లోని 22 ఈవెంట్ల గురించి వివరించిన తర్వాత.. ఓ కాంతి రేఖ ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేగా మారింది. అనంతరం పారాలింపిక్‌ చిహ్నం ఎజిటో్‌సను కళాకారులు ఆవిష్కరించారు. ఆ తర్వాత నరుహిటో, పార్సన్స్‌ను వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు. వివిధ దేశాల అథ్లెట్ల బృందాలు మార్చ్‌పాస్ట్‌ నిర్వహించాయి. ఆ తర్వాత ‘లిటి ల్‌ వన్‌ వింగ్డ్‌ ప్లేన్‌ (ఒంటి రెక్క విమానం)’ రూపకాన్ని 13 ఏళ్ల దివ్యాంగురాలు యు వాగో ప్రధాన పాత్రగా ప్రదర్శించింది. ఒక రెక్కతో ఎగురలేననుకునే చిన్న విమానం.. మిగతా వారి స్ఫూర్తితో.. కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ వినువీధిలో ఎలా ఎగిరిందనేది లేజర్‌ లైట్లతో ఆవిష్కరిస్తూ ‘మాకూ రెక్కలున్నాయి’ అని చెప్పడం ఎంతో ఆకట్టుకుంది. జపాన్‌ సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తూ సాగిన నృత్యాలు, పోల్‌ డ్యాన్స్‌ వరల్డ్‌ చాంపియన్‌ ఎరి కమిమోనో విన్యాసాలు, వివిధ కళాకారుల ఆటపాటలు అలరించాయి. చివరగా దివ్యాంగులు స్టేడియంలోని భారీ జ్యోతిని వెలిగించడంతో.. బాణసంచా వెలుగుల్లో ఆరంభవేడుక ముగిసింది. 12 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో అత్యధికంగా 4403 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. వీరిలో 2550 మంది పురుషులు, 1853 మంది మహిళలు ఉన్నారు. 2016లో జరిగిన రియో గేమ్స్‌లో 4328 మంది బరిలోకి దిగారు. 



ముందుగా శరణార్థుల బృందం..

మార్చ్‌పా్‌స్టలో శరణార్థుల బృందం ముందుగా వచ్చింది. ఆ దేశ ఆటగాళ్లెవరూ లేకుండా అఫ్ఘానిస్థాన్‌ పతాకాన్ని తీసుకువస్తున్నప్పుడు మీడియా, అక్కడ ఉన్న సిబ్బంది కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. అఫ్ఘాన్‌కు ప్రాతినిథ్యం వహించాల్సిన ఇద్దరు అథ్లెట్లు జకియా ఖుడాడాడి, హొస్సేని రసోలిలు.. దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా హాజరుకాలేక పోయారు. 





భారత పతాకధారిగా టెక్ చంద్

క్వారంటైన్‌లో మరియప్పన్‌

పారాలింపిక్స్‌ ఆరంభ వేడుకల్లో షాట్‌ పుటర్‌ టెక్‌ చంద్‌ భారత పతాకధారిగా వ్యవహరించాడు. తొలుత హైజంపర్‌ మరియప్పన్‌ తంగవేలును పతాకధారిగా ప్రకటించారు. అయితే, టోక్యో వెళ్లే విమానంలో కొవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తితో మరియప్పన్‌, డిస్కస్‌ త్రోయర్‌ వినోద్‌ కుమార్‌, మరో నలుగురు భారత పారా అథ్లెట్లు సన్నిహితంగా మెలిగారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ ప్రకారం వీరందరినీ క్వారంటైన్‌కు తరలించారు. దీంతో ఆఖరి నిమిషంలో టెక్‌ చంద్‌ను ఫ్లాగ్‌ బేరర్‌గా ఎంపిక చేశారు. మార్చ్‌ పాస్ట్‌లో చంద్‌తోపాటు పవర్‌లిఫ్టర్లు జైదీప్‌, సకినా ఖాతూన్‌, చెఫ్‌ డి మిషన్‌ గుర్‌శరణ్‌ సింగ్‌, కోచ్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయితే, ఐసోలేషన్‌లో ఉన్న మరియప్పన్‌తోపాటు మిగతా ఐదుగురికి కూడా కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చిందని గుర్‌శరణ్‌ సింగ్‌ చెప్పాడు. ఆరు రోజుల తర్వాత కూడా వారికి నెగెటివ్‌గా వస్తే ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు ఎటువంటి ఇబ్బందులూ ఉండబోవని తెలిపాడు. రియో పారాలింపిక్స్‌లో మరియప్పన్‌ స్వర్ణం పతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా పారాలింపిక్స్‌లో 54 మంది సభ్యుల భారీ బృందాన్ని భారత్‌ పంపింది. 


Updated Date - 2021-08-25T06:16:00+05:30 IST