కరోనాను జయించిన గంగూలీ.. ఇంటికి చేరుకున్న బీసీసీఐ బాస్

ABN , First Publish Date - 2021-12-31T21:34:11+05:30 IST

కరోనాతో ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దాదాకు

కరోనాను జయించిన గంగూలీ.. ఇంటికి చేరుకున్న బీసీసీఐ బాస్

కోల్‌కతా: కరోనాతో ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దాదాకు నిర్వహించిన ఒమిక్రాన్ పరీక్షలో నెగటివ్ అని తేలడంతో డిశ్చార్జ్ చేసినట్టు కోల్‌కతాలోని ఉడ్‌ల్యాండ్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని, కొంతకాలంపాటు ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొన్నాయి. 


స్వల్ప లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన గంగూలీలోకి సోమవారం రాత్రి ‘మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టెయిల్ థెరపీ’ చికిత్స అందించారు. కాగా, గంగూలీ ఆసుపత్రి పాలు కావడం ఈ ఏడాది ఇది మూడోసారి. వ్యాయామం చేస్తున్న సమయంలో స్వల్పంగా హార్ట్ ఎటాక్ రావడంతో గతంలో ఒకసారి ఆసుపత్రిలో చేరాడు. యాంజియోప్లాస్టీ తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు.


ఆ తర్వాత 20 రోజులకే అదే కారణంతో ఆసుపత్రిలో చేరడంతో సెకండ్ రౌండ్ యాంజియోప్లాస్టీ చేశారు. ఈ సందర్భంగా గంగూలీకి స్టంట్లు అమర్చారు. మార్చి నుంచి పూర్తిస్థాయిలో విధులకు హాజరవుతున్నాడు. వ్యాక్సినేషన్ కూడా పూర్తయింది. కాగా, ఈ ఏడాది మొదట్లో గంగూలీ సోదరుడు స్నేహాశీష్ గంగూలీ గూంగూలీ కూడా కరోనా బారినపడ్డాడు. 

Updated Date - 2021-12-31T21:34:11+05:30 IST