298 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్.. ఇక బౌలర్లపైనే భారం
ABN , First Publish Date - 2021-08-17T00:03:58+05:30 IST
ఇంగ్లండ్‌తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌ను 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్ ఆధిక్యం
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌ను 298/8 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్‌కు 271 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 181/6తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వెంటవెంటనే రిషభ్ పంత్ (22), ఇషాంత్ శర్మ (16) వికెట్లను కోల్పోయింది. దీంతో 200 పరుగుల లోపే కోహ్లీ సేన ఇన్నింగ్స్ ముగుస్తుందని భావించారు. అయితే, పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా కలిసి ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. బంతులను జాగ్రత్తగా ఎదుర్కొంటూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇద్దరూ కలిసి 120 బంతుల్లో 89 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక షమీ ఇన్నింగ్స్ అయితే అద్భుతం. 70 బంతులు ఎదుర్కొన్న షమీ 6 ఫోర్లు, సిక్సర్‌తో 56 పరుగులు చేశాడు. 64 బంతులు ఎదుర్కొన్న బుమ్రా 3 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి ఇంగ్లిష్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. వడివడిగా పరుగులు పిండుకుంటూ భారత ఆధిక్యాన్ని 271 పరుగులకు చేర్చి ఇంగ్లండ్‌కు సవాలు విసిరారు.
భారత బ్యాట్స్‌మన్లలో చతేశ్వర్ పుజారా (45), అజింక్య రహానే (61) పరుగులు చేశారు. ఆ తర్వాత షమీ, బుమ్రా ఇన్నింగ్సే ఈ మ్యాచ్‌కు హైలెట్. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ 3 వికెట్లు తీసుకోగా, రాబిన్సన్, మొయీన్ అలీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. శామ్ కరన్‌కు ఓ వికెట్ దక్కింది.