డబ్ల్యూటీసీ ఫైనల్.. నాలుగో రోజు ఆట రద్దు

ABN , First Publish Date - 2021-06-22T01:48:36+05:30 IST

అనుకున్నదే అయింది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్ మ్యాచ్ నాలుగో

డబ్ల్యూటీసీ ఫైనల్.. నాలుగో రోజు ఆట రద్దు

సౌతాంప్టన్: అనుకున్నదే అయింది. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట రద్దు అయింది. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం పడుతుండడం, రెండు సెషన్ల పాటు ఎదురు చూసినా వాతావరణంలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌కు తొలి రోజు నుంచే వానగండం ఎదురైంది. మొదటి రోజు టాస్ పడకుండానే మ్యాచ్ రద్దు అయింది. రెండో రోజు, మూడో రోజు వరుణుడు కొంత తెరిపినివ్వడంతో పూర్తిగా కాకున్నా కొన్ని ఓవర్లపాటు మ్యాచ్ జరిగింది. ఫలితంగా భారత జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. టీమిండియా తన తొలి ఇన్సింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ అయింది. 


అనంతరం నిన్న తొలి ఇన్సింగ్స్ ప్రారంభించిన కివీస్ ఆట నిలిచిపోయే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 12, రాస్ టేలర్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్లు లాథమ్, డెవాన్ కాన్వేలు నిలకడగా ఆడారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిలకడగా ఆడుతూ భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించిన తర్వాత తొలుత లాథమ్ (30) అవుటయ్యాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ బౌలింగులో పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ భారత్ కంటే 116 పరుగులు వెనకబడి ఉంది. 


నేటి ఆట పూర్తిగా రద్దు కావడంతో రిజర్వు డేతో కలుపుకుని మిగిలింది రెండు రోజులే. ఈ రెండు రోజుల్లో మ్యాచ్ ఫలితం తేలడం దాదాపు అసాధ్యం. దీంతో డ్రాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక, మిగిలిన రెండు రోజుల ఆట కూడా జరగాలా? వద్దా? అనేది నిర్ణయించేది వరుణడే. ఒక వేళ మ్యాచ్ కనుక డ్రా అయితే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేతలుగా భారత్-కవీస్ జట్లు ట్రోఫీని పంచుకుంటాయి.

Updated Date - 2021-06-22T01:48:36+05:30 IST