డ్రా..అద్భుత..!

ABN , First Publish Date - 2021-01-12T09:07:44+05:30 IST

డ్రా..అద్భుత..!

డ్రా..అద్భుత..!

విహారి, అశ్విన్‌ అదరహో 

పంత్‌ ఎదురుదాడి

ఆసీ్‌సతో మూడో టెస్టు డ్రా

టీమిండియాపై ప్రశంసల జల్లు


సిడ్నీ: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఓటమి ఖాయమేనా.. లేక అద్భుతం జరిగి మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తారా? అనే ఉత్కంఠకు భారత క్రికెట్‌ జట్టు అద్వితీయ ప్రదర్శనతో తెర దించింది. ఒకటిన్నర సెషనట్లపాటు గాయంతో విహారి (161 బంతుల్లో 4 ఫోర్లతో 23 నాటౌట్‌) అండగా, అశ్విన్‌ (128 బంతుల్లో 7 ఫోర్లతో 39 నాటౌట్‌) క్రీజులో చూపిన అసమాన పోరాటం జట్టును కాపాడింది. అలాగే రిషభ్‌ పంత్‌ (118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97), పుజార (205 బంతుల్లో 12 ఫోర్లతో 77) నాలుగో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యాన్ని తక్కువగా చూపలేం... ఫలితంగా భారత్‌ ఓటమి నుంచి గట్టెక్కి ఈ టెస్టును డ్రాగా ముగించింది. 407 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్‌ మ్యాచ్‌ ముగిసేసరికి 131 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. హాజెల్‌వుడ్‌, లియాన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా స్మిత్‌ నిలిచాడు. నాలుగు టెస్టుల సిరీ్‌సలో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరి టెస్ట్‌ ఈనెల 15న బ్రిస్బేన్‌లో జరుగుతుంది. 


పంత్‌ ఫటాఫట్‌: 98/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఛేదనను ఆరంభించిన భారత్‌ నాలుగు పరుగుల తర్వాత కెప్టెన్‌ రహానె (4) వికెట్‌ను కోల్పోయింది. ఇంకేముంది.. ఇక వికెట్ల జాతరే అనుకున్నారంతా. కానీ జట్టు పక్కా వ్యూహంతో ఐదో నెంబర్‌లో విహారిని కాదని పంత్‌ను పంపింది. దీంతో అతను ఎస్‌సీజీలో విధ్వంసమే సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో గాయంతో విఫలమైనా.. ఈసారి ఎదురుదాడే లక్ష్యంగా కనిపించాడు. దీనికి తోడు 5, 56 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కీపర్‌ పెయిన్‌ క్యాచ్‌లను వదిలేయడం కలిసివచ్చింది. ఆరంభంలో 35 బంతులను ఓపిగ్గా ఎదుర్కొన్న తర్వాత చుక్కలు చూపించాడు. ముఖ్యంగా అత్యుత్తమ స్పిన్నర్‌ లియాన్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి మరీ బౌండరీలతో హోరెత్తించాడు. టీ20 ధమాకాను గుర్తుచేస్తూ 64 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అతడి దూకుడుకు తొలి సెషన్‌లో 104 రన్స్‌ వచ్చాయి. కానీ టీ బ్రేక్‌ తర్వాత భారత్‌కు ఝలక్‌ తగిలింది. ఆసీ్‌సకు ఓవైపు ఓటమి భయం వెంటాడుతుండగా.. 80వ ఓవర్‌లో పంత్‌ త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. లియాన్‌ వేసిన బంతిని భారీషాట్‌ ఆడాలని చూసి గల్లీలో క్యాచ్‌ ఇచ్చాడు. ఇక 83వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగిన పుజారను హాజెల్‌వుడ్‌ బౌల్డ్‌ చేశాడు. 


ఓటమి భయాన్ని అధిగమిస్తూ..: క్రీజులో అద్భుతంగా కుదురుకున్న పంత్‌, పుజార పెవిలియన్‌కు చేరగానే ఆసీస్‌ దాదాపుగా విజయానందంలో మునిగింది. అటు భారత్‌కు ఓటమి ఖాయంగానే కనిపించింది. విహారి ఫామ్‌లో లేకపోవడం.. అశ్విన్‌ బ్యాటింగ్‌పై సందేహాలకు తోడు టెయిలెండర్ల బలహీనత కారణంగా ఎవరికీ ఆశలు లేకుండా పోయాయి. 280/5 స్కోరుతో టీ బ్రేక్‌కు వెళ్లిన సమయంలో భారత్‌ ఇంకా 127 పరుగులు చేయాల్సిఉంది. దీంతో చివరి సెషన్‌లో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది. రెండో సెషన్‌లోనే విహారికి కాలి పిక్క కండరాలు పట్టేయడంతో క్రీజులో పరిగెత్తలేని పరిస్థితి నెలకొంది. అయినా తను బ్యాటింగ్‌ కొనసాగించగా అటు అశ్విన్‌ కూడా ఎక్కడలేని ఓపికను ప్రదర్శించాడు. ఈ సెషన్‌లో 35 ఓవర్ల వీరి పోరాట ఫలితంగానే భారత్‌ గట్టెక్కింది. పదునైన బంతులను ఎదుర్కొనేందుకు తమ శరీరాలను అడ్డుపెట్టి వికెట్‌ పడకుండా చూశారు. 101 ఓవర్‌లో అశ్విన్‌ క్యాచ్‌ను సబ్‌స్టిట్యూట్‌ అబాట్‌ వదిలేశాడు. లియాన్‌ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ చుట్టూ కీపర్‌ సహా ఆరుగురు ఫీల్డర్లను మోహరించి ఒత్తిడి పెంచారు. అయినా ఏమాత్రం జంకకుండా తమ పని కానిచ్చారు. చివరకు మరో ఓవర్‌ మిగిలి ఉండగా ఆసీస్‌ కెప్టెన్‌ పెయిన్‌ డ్రాకు అంగీకరించాడు.


అసమాన పోరాటం

‘నాలుగో ఇన్నింగ్స్‌లో భారత్‌ 200 పరుగులలోపే కుప్పకూలుతుంది’.. ఆదివారం మ్యాచ్‌ ముగిశాక ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ పాంటింగ్‌ చేసిన వ్యాఖ్య ఇది. దీన్ని సీరియ స్‌గా తీసుకున్నారో.. ఏమో కానీ అతడికే కాకుండా యావత్‌ క్రికెట్‌ ప్రపంచమే అచ్చెరు వొందేలా మూడో టెస్టు చివరిరోజు టీమిండియా ప్రదర్శన సాగింది. జనవరి 11, 2021 తమ టెస్టు చరిత్రలో గుర్తుండిపోయే రోజు. ఐదు రోజుల మ్యాచ్‌లో గ్రేటెస్ట్‌ డ్రాగా చెప్పుకొనే అర్హత సాధించింది. నిజానికిది మెల్‌బోర్న్‌ విజయానికన్నా ఎక్కువే. రెగ్యులర్‌ కెప్టెన్‌ కోహ్లీ, పేసర్లు ఇషాంత్‌, షమి, ఉమేశ్‌ ఈ మ్యాచ్‌కు ముందే అందుబాటులో లేరు. తీరా మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ జడేజా గాయపడ్డాడు. అంతకంటే ముందే కీపర్‌ పంత్‌ మోచేతికి దెబ్బ తాకి కీపింగ్‌ చేయలేదు. విహారి తొడ కండరాలు పట్టేసి కాళ్లు సరిగా కదపలేకపోయాడు. ఇన్ని పరిమితుల మధ్య నాలుగో ఇన్నింగ్స్‌లో 131 ఓవర్లు క్రీజులో నిలిచి ఓటమి నుంచి గట్టెక్కడమంటే మామూలు విషయమా... వాస్తవానికి ఏ క్రికెట్‌ అభిమాని కూడా భారత్‌ పోరాటం ఈ స్థాయిలో ఉంటుందని ఊహించలేదు. ఎస్‌సీజీలో సోమవారం ఆవిష్కృతమైన ఈ దృశ్యం అత్యంత అరుదుగానే సంభవిస్తుంటుంది. రికార్డుల్లో ఇది డ్రాగా ఉంటుందేమో కానీ విజయానికి ఏమాత్రం తక్కువ కాదు. ఓరకంగా ఆస్ట్రేలియాకు తీరని పరాభవమే. చివరి రోజు ఆటలో భారత్‌ కోల్పోయింది 3 వికెట్లే. 97 ఓవర్లపాటు ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్‌ దళానికి పంత్‌, పుజార, విహారి, అశ్విన్‌ ఎదురొడ్డి నిలవడం చరిత్రలో గుర్తుండిపోతుంది. పైగా ఈ నలుగురూ 100+ బంతుల చొప్పున ఎదుర్కోవడం వీరి అంకిత భావానికి నిదర్శనం.    మ్యాచ్‌ ఆరంభమైన పదో బంతికే మెల్‌బోర్న్‌ హీరో రహానె నిష్క్రమించడంతోనే దేశంలో చాలా టీవీ సెట్లు ఆఫ్‌ అయ్యుం డొచ్చు. ఘనత వహించిన ఆసీస్‌ కామెంటేటర్లు కూడా లంచ్‌ సమయానికే మ్యాచ్‌ ముగుస్తుందని సెలవిచ్చారు. కానీ పంత్‌ ముందుగానే రావడంతో ఆసీ్‌సకు తొలి ఝలక్‌ తగిలింది. ఈ స్ట్రోక్‌ ప్లేయర్‌ ఎదురుదాడికి ఆసీస్‌ బౌలర్ల లైన్‌ అండ్‌ లెంగ్త్‌ గల్లంతైంది. అటు పుజార పెట్టని గోడలా నిలిచాడు. అయితే వీరు అవుటయ్యాక భారత్‌ దృక్పథం మారి డ్రా కోసమే ఆడింది. అయినా ఏదో మూల అనుమానమున్నా వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అశ్విన్‌-విహారి జోడీ జట్టును తలెత్తుకునేలా చేసింది. ముఖ్యంగా టెస్టుల్లో తనకు చోటుపై విమర్శలు వినిపి స్తున్న నేపథ్యంలో విహారి.. విపరీతమైన నొప్పిని భరిస్తూ జట్టును కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఆడాడు. చివరకు సాధించాడు. అశ్విన్‌ కూడా తన కెరీర్‌లోనే అత్యధికంగా 128బంతులు ఎదుర్కొన్నాడు. అంతులేని ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతున్న భారత జట్టు ఇదే ఊపులో బ్రిస్బేన్‌లోనూ కంగారెత్తించి సిరీస్‌ను వశం చేసుకోవాలి. -  (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


తెలుగోడి తెగువ!

మూడో టెస్ట్‌ను భారత జట్టు డ్రా చేసుకున్నా..ప్రత్యర్థి ఆస్ట్రేలియా నిప్పులు చెరిగే బౌలింగ్‌, బ్యాట్స్‌మెన్‌ చుట్టూ ఫీల్డర్లను మోహరించి ఒత్తిడి చేసిన తీరు, అనూహ్యంగా స్పందించిన పిచ్‌, ఎక్కడ గాయపడతామోననేలా శరీరంపైకి దూసుకొచ్చిన బంతులు, ఇవన్నీగాక ఆసీస్‌ స్లెడ్జింగ్‌..ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులకు ఎదురొడ్డి టీమిండియా మూడో టెస్ట్‌ను డ్రా చేసుకున్న తీరు అద్భుతం. విశ్లేషకుల మాటల్లో అయితే ఇది విజయంతో సమానం. అలాంటి మూడో టెస్ట్‌లో తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి పోరాడిన తీరు ఎంత చెప్పినా తక్కువే! తొలి టెస్ట్‌లో (16, 8) దారుణ వైఫల్యంతో రెండో టెస్ట్‌కు విహారికి జట్టులో చోటు కష్టమేననే వార్తలు బలంగా వచ్చాయి. కానీ జట్టు యాజమాన్యం అతడిపై నమ్మకముంచింది. మెల్‌బోర్న్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రమే అవకాశం రాగా..కేవలం 21 పరుగులతో విహారి నిరాశపరిచాడు. రెండోటెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన దరిమిలా..అదే జట్టును కొనసాగించే సంప్రదాయంతోపాటు జట్టు గాయాల జాబితా పెరిగిపోవడంతో సిడ్నీ టెస్ట్‌లో హనుమ స్థానం పదిలమైంది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో విహారి (4) పేలవ ప్రదర్శన కొనసాగింది. లేని పరుగు కోసం యత్నించి రనౌట్‌ కావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈనేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత ఒత్తిడిలో అతడు క్రీజులోకి వచ్చాడు. జట్టును ఓటమి నుంచి కాపాడడం, తన చోటు పదిలం చేసుకోవడం..ఈ లక్ష్యాల నేపథ్యంలో హనుమ అసలు సిసలు టెస్ట్‌ బ్యాటింగ్‌ చేశాడు. మధ్యలో తొడ కండరం పట్టేసినా నొప్పిని దిగమింగాడు. స్లెడ్జింగ్‌తో ‘కంగారు’ పెట్టినా తొణకలేదు. మరింత పట్టుదలగా పోరాడాడు. అత్యంత సహనంతో పుజారను తలపిస్తూ బ్యాటింగ్‌ కొనసాగించిన విహారి అటు విమర్శకులు, ఇటు అభిమానుల మన్ననలు అందుకున్నాడు.


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 338; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 244; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 312/6 డిక్లేర్‌;

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) స్టార్క్‌ (బి) కమిన్స్‌ 52; గిల్‌ (సి) పెయిన్‌ (బి) హాజెల్‌వుడ్‌ 31; పుజార (బి) హాజెల్‌వుడ్‌ 71; రహానె (సి) వేడ్‌ (బి) 4; పంత్‌ (సి) కమిన్స్‌ (బి) లియాన్‌ 97; విహారి (నాటౌట్‌) 23; అశ్విన్‌ (నాటౌట్‌) 39; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 131 ఓవర్లలో 334/5. వికెట్ల పతనం: 1-71, 2-92, 3-102, 4-250, 5-272. బౌలింగ్‌: స్టార్క్‌ 22-6-66-0; హాజెల్‌వుడ్‌ 26-12-39-2; కమిన్స్‌ 26-6-72-1; లియాన్‌ 46-17-114-2; గ్రీన్‌ 7-0-31-0; లబుషేన్‌ 4-2-9-0.

Updated Date - 2021-01-12T09:07:44+05:30 IST