ఒలింపిక్స్‌ ఆశలకు కరోనా కాటు!

ABN , First Publish Date - 2021-05-02T09:42:22+05:30 IST

దేశంలో విజృంభిస్తున్న కరోనా రెండో దశ.. ఒలింపిక్స్‌ బెర్త్‌లు ఆశిస్తున్న భారత అథ్లెట్లకు ఆశనిపాతమైంది. మరో మూడు నెలల్లో టోక్యో ఒలింపిక్స్‌ జరగనుండగా.. ఆఖరు సమయంలో కొన్ని క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా విశ్వక్రీడలకు అర్హత సాధించాలని కొందరు అథ్లెట్లు భావిస్తున్నారు. కానీ,

ఒలింపిక్స్‌ ఆశలకు కరోనా కాటు!

(ఆంధ్రజ్యోత్రి క్రీడా విభాగం)


న్యూఢిల్లీ: దేశంలో విజృంభిస్తున్న కరోనా రెండో దశ.. ఒలింపిక్స్‌ బెర్త్‌లు ఆశిస్తున్న భారత అథ్లెట్లకు ఆశనిపాతమైంది. మరో మూడు నెలల్లో టోక్యో ఒలింపిక్స్‌ జరగనుండగా.. ఆఖరు సమయంలో కొన్ని క్వాలిఫయింగ్‌ టోర్నీల ద్వారా విశ్వక్రీడలకు అర్హత సాధించాలని కొందరు అథ్లెట్లు భావిస్తున్నారు. కానీ, కరోనా ఉధృతం కొనసాగుతుండడంతో చాలా దేశాలు భారత దేశ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నాయి. దీంతో దేశ ఆటగాళ్లు వేరే దేశంలో ఆడే చాన్సులు కోల్పోతున్నారు. తాజా పరిణామాలు మన అథ్లెట్లను డోలాయమానంలో పడేస్తున్నాయి.


సైనా, శ్రీకాంత్‌ ఆశలు నెరవేరేనా?

మలేసియా బ్యాడ్మింటన్‌ ఓపెన్‌కు వెళ్లడానికి అనుమతి లభిస్తుందా? లేదా? అని ఏస్‌ షట్లర్లు సైనా, కిడాంబి శ్రీకాంత్‌ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. భారత ప్రయాణాలపై మలేసియా తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈనెల 25 నుంచి మలేసియా ఓపెన్‌ జరగనుంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఇదే చివరి ప్రధాన టోర్నీ. అయితే, భారత షట్లర్లు ఆ టోర్నీలో పాల్గొనేలా చూస్తామని జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బాయ్‌) రెండ్రోజుల క్రితం ప్రకటించింది. షట్లర్లు శ్రీలంక మీదుగా మలేసియా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. అయితే, అక్కడి నుంచి వెళ్లినా నిబంధనల ప్రకారం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అందుకే వీలైనంత త్వరగా బాయ్‌ తమను అక్కడికి పంపిస్తే.. టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం దొరుకుతుందని లేదంటే ఒలింపిక్‌ ఆశలు గల్లంతైనట్టేనని షట్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


హాకీ: లండన్‌లో బ్రిటన్‌తో జరగాల్సిన భారత పురుషుల హాకీ జట్టు ప్రొ లీగ్‌ ఈవెంట్‌ వాయిదా పడింది. వచ్చేనెల 15 నుంచి స్పెయిన్‌, ఆ తర్వాత జర్మనీతో జరగాల్సిన టోర్నీలు కూడా అనిశ్చితిలో పడ్డాయి. 


అథ్లెటిక్స్‌ రిలే: పోలెండ్‌లో జరగనున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ రిలేలో మన జట్టు బరిలోకి దిగడం లేదంటూ జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య ట్వీట్‌ చేసింది. ఎంత ప్రయత్నించినా ఏ విమానయాన సంస్థ కూడా భారత అథ్లెట్లను తీసుకెళ్లేందుకు అంగీకరించలేదని తెలిపింది.


రల్డ్‌కప్‌లో మహిళల రికర్వ్‌ జట్టు పాల్గొనేనా?

ఇటీవల వరల్డ్‌కప్‌లో పాల్గొన్న భారత ఆర్చరీ మహిళల రికర్వ్‌ జట్టు ఇప్పుడు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో పోటీపడడం సందేహంగా మారింది. జూన్‌ 21 నుంచి 27 వరకు పారిస్‌ వేదికగా వరల్డ్‌కప్‌ స్టేజ్‌-3 పోటీలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ వేటలోనున్న దీపికా కుమారి, కోమలిక, అంకితతో కూడిన రికర్వ్‌ బృందానికి ఇదే చివరి అర్హత టోర్నీ. ఇప్పటికే పురుషుల రికర్వ్‌ జట్టుతో పాటు వ్యక్తిగత విభాగాల్లో భారత్‌కు ఒలింపిక్‌ కోటా ఖరారయ్యాయి. దీంతో మహిళల జట్టుకు మాత్రం ఆ టోర్నీ చాలా కీలకం. కానీ, భారత్‌ నుంచి ప్రయాణాలపై నిషేధం ఉండడంతో మన జట్టు పారిస్‌ టోర్నీలో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది. అయితే, టోర్నీకి దాదాపు రెండు నెలల గడువు ఉండడంతో అప్పటికల్లా పరిస్థితులన్నీ సద్దుమణగొచ్చని భారత ఆర్చరీ సమాఖ్య భావిస్తోంది. ఒకవేళ పరిస్థితులు వేరుగా ఉంటే మాత్రం మన ఆర్చర్ల ఒలింపిక్‌ ఆశలు అంతేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 


Updated Date - 2021-05-02T09:42:22+05:30 IST