ఐపీఎల్‌కు బ్రేక్
ABN , First Publish Date - 2021-05-05T09:13:00+05:30 IST
దేశవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా ధాటికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వెనక్కి తగ్గింది. ఒక్కొక్కరుగా ఆటగాళ్లు ఈ మహమ్మారి బారిన పడుతుండడంతో ఈ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు మంగళవారం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రకటించాడు.

పెరిగిన కరోనా కేసులు
నిరవధిక వాయిదా
సాహా, మిశ్రాకు కూడా పాజిటివ్
ఊహించిందే జరిగింది.. ఒక్కసారిగా చుట్టుముట్టిన కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌ను సగంలోనే నిలిపివేసింది. కోల్‌కతా, చెన్నైలోనే కాకుండా ఈ వైరస్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ జట్లకూ పాకడంతో బోర్డు అప్రమత్తమైంది. ఇక మున్ముందు ఈ లీగ్‌ను ఎలా షెడ్యూల్ చేస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా ధాటికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వెనక్కి తగ్గింది. ఒక్కొక్కరుగా ఆటగాళ్లు ఈ మహమ్మారి బారిన పడుతుండడంతో ఈ లీగ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు మంగళవారం బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రకటించాడు. 14 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇలా మధ్యంతరంగా ముగియడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 9న ఆరంభమైన తాజా సీజన్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరిగాయి. సోమవారం కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, చెన్నై బౌలింగ్ కోచ్ ఎల్. బాలాజీ పాజిటివ్‌గా తేలగా.. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు కూడా ఈ వైరస్ సోకింది. బయో బబుల్‌ను ఛేదించుకుంటూ వైరస్ ఈ ఇద్దరికీ సోకడంతో ఐపీఎల్ పాలకమండలి, బీసీసీఐ అత్యవసరంగా సమావేశమైంది. ఈ భేటీలో లీగ్‌ను వాయిదా వేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
నాటకీయ పరిస్థితుల్లో..: సోమవారం జరగాల్సిన కేకేఆర్-బెంగళూరు మ్యాచ్ వాయిదా పడినట్టుగానే మంగళవారం ఉదయం కూడా మరో మ్యాచ్ వాయిదా వార్తలు వినిపించాయి. చెన్నై బౌలింగ్ కోచ్ ఎల్.బాలాజీ పాజిటివ్‌గా తేలడంతో ఆ జట్టు సభ్యులంతా నిబంధనల ప్రకారం ఆరు రోజుల ఐసోలేషన్‌కు వెళతారని సీఎ్‌సకే యాజమాన్యం ఐపీఎల్ నిర్వాహకులకు తెలిపింది. దీంతో బుధవారం ఆ జట్టు రాజస్థాన్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను కూడా వాయిదా వే శారు. ఆ తర్వాత ఢిల్లీలో బస చేస్తున్న రైజర్స్ జట్టులో సాహాకు, అహ్మదాబాద్‌లో ఉన్న ఢిల్లీ స్పిన్నర్ మిశ్రాకు పాజిటివ్ అని తేలడంతో బీసీసీఐ ఇక ఉపేక్షించలేదు. ఎందుకంటే మంగళవారమే రైజర్స్ జట్టు ముంబైతో ఆడాల్సి ఉంది. సాహా కారణంగా ఇది ఎలాగూ సాధ్యపడదు. దీంతో ప్రస్తుతానికి నిరవధిక వాయిదా ఒక్కటే శ్రేయస్కరమని భావించింది. అంతకుముందు మిగిలిన మ్యాచ్‌లన్నీ ముంబైలోనే జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా బోర్డు చేసినట్టు సమాచారం. కానీ కేసులు పెరగడంతో చేసేదేమీ లేకపోయింది.
జీపీఎస్ ట్రాకింగ్ వైఫల్యంవల్లేనా?:
పకడ్బందీగా బయో బబుల్‌ను అమలు చేస్తున్నామని బీసీసీఐ ఎంత ఘనంగా చెప్పుకొన్నా క్షేత్ర స్థాయిలో అదెంత గాలి బుడగో తేలిపోయింది. వరుసగా కరోనా కేసులు వెలుగు చూడడంతో ఇప్పుడంతా ఇందులో ఉన్న లోపాల గురించి చర్చించుకుంటున్నారు. ఆటగాళ్ల జీపీఎస్ ట్రాకింగ్ బ్యాండ్లు పనిచేస్తున్నాయా? వారి కదలికలను గుర్తించలేదా? హోటళ్లలో బయో సెక్యూర్ సరిగా లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. బబుల్‌లో ఉండే ప్రతీ క్రికెటర్‌కు ఇంతకుముందే బీసీసీఐ ప్రత్యేక జీపీఎస్ బ్యాండ్లను ఇచ్చింది. అయితే ఇవి వారు ఓ నగరం నుంచి మరో నగరానికి వెళ్లినప్పుడు సరిగ్గా రికార్డు చేయలేదట. చెన్నైకి చెందిన ఎఫ్ఓబీ అనే సంస్థకు చెందిన బ్యాండ్లను బీసీసీఐ అందించింది.
అయితే ఇవేమాత్రం క్వాలిటీగా లేవని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. బ్యాటరీ చాలా వీక్‌గా ఉండేవని, బ్లూటూత్, జీపీఎస్ ద్వారా తమ కదలికలను ఏమాత్రం గుర్తించేవి కావని చెప్పాయి. యూఏఈలో లీగ్ జరిగినప్పుడు బయో బబుల్ వ్యవహారమంతా ఇంగ్లండ్ సంస్థ చూసుకుంది. అప్పుడంతా క్రమ పద్ధతిలో జరగడంతో ఒక్క కేసు కూడా వెలుగు చూడలేదు. కానీ ఈసారి అంతా బీసీసీఐ పర్యవేక్షణలోనే జరిగింది.
మా దారెటు?: ఐపీఎల్ వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. ఈ కరోనా కాలంలో ఎప్పుడు.. ఎలా స్వదేశానికి వెళతామో తెలీని అయోమయంలో ఉన్నారు. భారత్‌లో కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇంగ్లండ్, ఆస్ర్టేలియాకు విమాన ప్రయాణాలను నిషేధించారు. అయితే ఇంగ్లండ్ క్రికెటర్లు అక్కడికి వెళ్లాలంటే నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి. అక్కడికెళ్లాక 10 రోజుల హోటల్ క్వారంటైన్లో ఉండాల్సిందే. కానీ వీరంతా యూఏఈ ద్వారా వెళ్లాల్సి ఉండడంతో ఆ దేశానికి భారత్ నుంచి విమానాల నిషేధం అమల్లో ఉంది. అయితే ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆలోచిస్తోంది. ఇక 40 మంది వరకున్న ఆసీస్ క్రికెటర్లు, వ్యాఖ్యాతలు, కోచ్‌ల పరిస్థితి దారుణంగా తయారైంది.
మే 15 వరకు భారత్ నుంచి ఎవరూ ఆసీ్సలోకి అడుగుపెట్టే వీల్లేకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘మా ఇబ్బంది గురించి ఫ్రాంచైజీతో మాట్లాడాం. బీసీసీఐ సూచనల కోసం వేచి చూడాలని చెప్పారు. నాతో పాటు ఇతర ఆసీస్ ఆటగాళ్లంతా ఇంటికెలా వెళ్లాలో తెలీక ఆందోళనలో ఉన్నాం’ అని ఓ ఆసీస్ ఆటగాడు తెలిపాడు. ప్రస్తుతం చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు స్లేటర్లాగా మాల్దీవ్స్ బాట పట్టాలనుకుంటున్నారు. వీరిలో స్మిత్, కమిన్స్, మ్యాక్స్‌వెల్, పాంటింగ్, కటిచ్ ఉన్నారు. విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చడం బీసీసీఐ బాధ్యతంటూ తమ అధికారిక ప్రకటనలో తెలిపినా.. అది ఎలా అనే విషయంలో స్పష్టత లేదు. దక్షిణాఫ్రికా, విండీస్ ఆటగాళ్లకు ఇక్కడి నుంచి ప్రయాణాలపై నిషేధం లేకున్నా వారు దుబాయ్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి ప్రస్తుతానికి ప్రయాణాలపై బ్యాన్ ఉంది.
రాజీ ప్రసక్తే లేదు
కొవిడ్ రెండో వేవ్ తీవ్రతను సునిశితంగా పరిశీలిస్తున్నామని బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా చెప్పాడు. ‘ఆటగాళ్లు, గ్రౌండ్స్‌మెన్, మ్యాచ్ అధికారులు, బీసీసీఐ ఉద్యోగులతో పాటు ఐపీఎల్లో భాగమైన ఇతరత్రా సిబ్బందిలో ఏ ఒక్కరి భద్రత విషయంలో కూడా రాజీపడే ప్రసక్తే లేదు. లీగ్‌తో ముడిపడి ఉన్న అందరి బాధ్యత మాదే’ అని జైషా స్పష్టం చేశాడు.
బీసీసీఐకి డబ్బుపైనే ఆసక్తి
ఐపీఎల్-14 మళ్లీ జరుగుతుందని తాను అనుకోవడం లేదని మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నాడు. బీసీసీఐకి డబ్బు మీద తప్ప ఆటగాళ్ల భద్రత మీద ఆలోచన లేదని అన్నాడు. అసలు లీగ్‌ను మొత్తానికి రద్దు చేసినా నష్టమేమీలేదని అభిప్రాయపడ్డాడు. బయోబబుల్‌ను కట్టుదిట్టమైన భద్రతా వలయంలో నిర్వహిస్తే కేకేఆర్, సీఎస్కే, ఎస్ఆర్హెచ్, డీసీ క్రికెటర్లు, సహాయ సిబ్బందికి ఎందుకు కొవిడ్ సోకిందని ఆజాద్ బీసీసీఐని నిలదీశాడు.

క్షేమంగా పంపిస్తాం
విదేశీ క్రికెటర్లను వారి స్వస్థలాలకు క్షేమంగా పంపించాల్సిన బాధ్యత తమపై ఉందని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ చెప్పాడు. ‘ఇందుకోసం అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటిని పరిశీలిస్తున్నాం. సాధ్యమైనంత వేగంగా ఒక దారిని కనుగొంటాం’ అని పటేల్ తెలిపాడు. ’