‘అర్జును’లు వీరే..

ABN , First Publish Date - 2021-10-28T09:13:20+05:30 IST

టోక్యోలో ప్రదర్శనకు పట్టం కట్టడంతో ఈసారి అర్జున అవార్డీల సంఖ్య కూడా పెరిగింది. గతేడాది 27 మంది ఎంపికవగా..ఈసారి 35 మంది క్రీడాకారులు ...

‘అర్జును’లు వీరే..

టోక్యోలో ప్రదర్శనకు పట్టం కట్టడంతో ఈసారి అర్జున అవార్డీల సంఖ్య కూడా పెరిగింది. గతేడాది 27 మంది ఎంపికవగా..ఈసారి 35 మంది క్రీడాకారులు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధవన్‌, పారా టీటీ క్రీడాకారిణి భవినా పటేల్‌, పారా షట్లర్‌ సుహాస్‌ యతిరాజ్‌, హైజంపర్‌ నిషద్‌ కుమార్‌, మహిళల హాకీ జట్టు క్రీడాకారిణులు వందనా కటారియా, మోనిక, ఫెన్సర్‌ భవాని దేవి, బాక్సర్లు సిమ్రన్‌జిత్‌ కౌర్‌, రెజ్లర్‌ దీపక్‌ పూనియా, పిస్టల్‌ షూటర్‌ అభిషేక్‌ వర్మ, కబడ్డీ ఆటగాడు సందీప్‌ నర్వాల్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి అంకితా రైనా అర్జునకు ఎంపికైన వారిలో ఉన్నారు. ఇక.. టోక్యోలో కాంస్యంతో సుదీర్ఘ  విరామం తర్వాత భారత్‌కు ఒలింపిక్‌ పతకాన్ని అందించిన పురుషుల హాకీ జట్టు సభ్యులందరికీ అవార్డు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. గతంలో అర్జునకు ఎంపికవని జట్టులోని సభ్యులంతా ఈసారి పురస్కారాన్ని అందుకుంటారు. అథ్లెటిక్స్‌ కోచ్‌లు రాధాకృష్ణ నాయర్‌, టీపీ ఓసెఫ్‌, హాకీ కోచ్‌ సందీప్‌ సాంగ్వాన్‌ ద్రోణాచార్య అవార్డులకు ఎంపికయ్యారు. ఖేల్‌రత్నకు ఎంపికైనవారికి  25 లక్షలు, అర్జున అవార్డు గ్రహీతలు 15 లక్షల చొప్పున నగదు పురస్కారాలను కూడా అందజేస్తారు. ఎంపిక కమిటీ పంపిన ఈ జాబితాకు క్రీడాశాఖ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. ఆ వెంటనే పురస్కారాల ప్రదానం ఎప్పుడన్నది ప్రకటిస్తారు. 

Updated Date - 2021-10-28T09:13:20+05:30 IST