ఇక డ్రోన్లతో మ్యాచ్‌ల చిత్రీకరణ.. బీసీసీఐకి కేంద్రం అనుమతి

ABN , First Publish Date - 2021-02-09T03:02:55+05:30 IST

ఇండియన్ క్రికెట్ సీజన్ 2021లో మ్యాచ్‌ల లైవ్ ఏరియల్ సినిమాటోగ్రఫీకి డ్రోన్లు ఉపయోగించుకునేందుకు

ఇక డ్రోన్లతో మ్యాచ్‌ల చిత్రీకరణ.. బీసీసీఐకి కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెట్ సీజన్ 2021లో మ్యాచ్‌ల లైవ్ ఏరియల్ సినిమాటోగ్రఫీకి డ్రోన్లు ఉపయోగించుకునేందుకు బీసీసీకి కేంద్రం కొన్ని షరతులతో కూడిన మినహాయింపులు ఇచ్చింది. మ్యాచ్‌ల లైవ్ చిత్రీకరణకు రిమోట్‌లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ (ఆర్‌పీఏఎస్) ఉపయోగానికి బీసీసీఐ.. కేంద్రం అనుమతి కోరింది. పరిశీలించిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ (ఎంఓ‌సీఏ), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతి మంజూరు చేశాయి. 


ఈ సందర్భంగా ఎంఓసీఏ జాయింట్ సెక్రటరీ అంబెర్ దూబే మాట్లాడుతూ..  డ్రోన్ ఎకోసిస్టం దేశంలో క్రమంగా పుంజుకుంటోందని పేర్కొన్నారు. వ్యవసాయం, మైనింగ్, హెల్త్‌కేర్, విపత్తు నిర్వహణ నుంచి క్రీడలు, వినోదానికి డ్రోన్ సిస్టం విస్తరిస్తోందన్నారు. దేశంలో వాణిజ్య వినియోగానికి డ్రోన్లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే బీసీసీఐకి ఈ అనుమతి మంజూరు చేసినట్టు వివరించారు.


డ్రోన్ల వినియోగానికి సంబంధించిన నిబంధనలు గురించి న్యాయమంత్రిత్వశాఖతో చర్చిస్తున్నామని, ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని అంబెర్ దూబే తెలిపారు. మార్చి నాటికి అనుమతులు వస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు. మ్యాచ్‌లలో డ్రోన్ల వినియోగానికి సంబంధించిన షరతులతో కూడిన మినహాయింపులు, అనుమతులు మంజూరు చేసినప్పటి నుంచి ఈ ఏడాది డిసెంబరు 31 వరకు చెల్లుబాటు అవుతాయని వివరించారు. అయితే, నియమనిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే అనుమతులు చెల్లుబాటులో ఉంటాయని, ఉల్లంఘనలు జరిగితే మాత్రం ఆ క్షణమే రద్దు అవుతాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-02-09T03:02:55+05:30 IST