ఆసీస్ జోరు..
ABN , First Publish Date - 2021-10-29T08:46:32+05:30 IST
ఫామ్ కోసం తంటాలు పడుతున్న డేవిడ్ వార్నర్ (42 బంతుల్లో 10 ఫోర్లతో 65) అర్ధ శతకంతో విరుచుకుపడడంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా గెలుపు జోరు కొనసాగిస్తోంది.
ఫామ్‌లోకొచ్చిన వార్నర్
7 వికెట్లతో కంగారూల గెలుపు
లంక చిత్తు
వార్నర్.. సూపర్ బ్యాటింగ్‌తో టచ్‌లోకి రావడంతో.. ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఫించ్ కూడా ధాటిగా ఆడడంతో.. శ్రీలంకపై కంగారూలు అలవోక విజయం సాధించారు. వార్నర్ దెబ్బకు లంక ఏ దశలోనూ మ్యాచ్‌లోకి రాలేదు.
దుబాయ్: ఫామ్ కోసం తంటాలు పడుతున్న డేవిడ్ వార్నర్ (42 బంతుల్లో 10 ఫోర్లతో 65) అర్ధ శతకంతో విరుచుకుపడడంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా గెలుపు జోరు కొనసాగిస్తోంది. గ్రూప్-1లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 154/6 స్కోరు చేసింది. కుశాల్ పెరీరా (35), చరిత్ అసలంక (35), భనుక రాజపక్స (33 నాటౌట్) తలో చేయి వేశారు. జంపా, స్టార్క్, కమిన్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మోస్తరు లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 17 ఓవర్లలో 155/3 పరుగులు చేసి నెగ్గింది. ఫించ్ (23 బంతుల్లో 37) రాణించాడు. హసరంగ (2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. జంపా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఓపెనింగ్ అదుర్స్..
ఛేదనలో ఓపెనర్ వార్నర్ ఆటే హైలైట్. మరో ఓపెనర్ ఫించ్‌తో కలసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించిన వార్నర్.. స్మిత్ (28 నాటౌట్)తో కలసి మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యంతో ఆసీస్ గెలుపునకు బాటలు వేశాడు. తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదిన ఫించ్.. గట్టి హెచ్చరికలు పంపాడు. లాహిరు కుమార వేసిన నాలుగో ఓవర్‌లో ఫించ్ 4,6 బాదగా.. వార్నర్ రెండు బౌండ్రీలతో రెచ్చిపోవడంతో ఏకంగా 20 పరుగులు లభించాయి. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. అయితే, లెగ్‌స్పిన్నర్ హసరంగ ఎంట్రీతో సీన్ మారింది. ఎదురుదాడి చేస్తున్న ఫించ్‌ను బౌల్డ్ చేసిన హసరంగ.. తర్వాతి ఓవర్‌లో భారీ హిట్టర్ మ్యాక్స్‌వెల్ (5)ను పెవిలియన్‌కు చేర్చాడు. వార్నర్ మాత్రం అదే జోరు కొనసాగించగా.. స్మిత్ అతడికి స్ట్రయికింగ్ ఇస్తూ స్కోరును నడిపించాడు. 12వ ఓవర్‌లో తీక్షణ బౌలింగ్‌లో సింగిల్‌తో వార్నర్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దంచికొడుతున్న వార్నర్‌ను షనక వెనక్కిపంపాడు. కానీ, స్మిత్, స్టొయినిస్ (7 బంతుల్లో 16 నాటౌట్) మరో 18 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను గెలిపించారు.
అసలంక ధనాధన్..:
టాపార్డర్‌లో పెరీరా, అసలంక అదరగొట్టగా.. ఆఖర్లో రాజపక్స ధనాధన్ బ్యాటింగ్‌తో లంక పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక స్వల్ప స్కోరుకే ఓపెనర్ నిస్సంక (7) వికెట్ కోల్పోయింది. అయితే, ఇన్‌ఫామ్ బ్యాటర్ అసలంక క్రీజులోకి రావడంతోనే స్కోరు బోర్డు ఊపందుకుంది. ఎదుర్కొన్న తొలి మూడు బంతులను బౌండ్రీకి తరలించిన అసలంక.. ఆ తర్వాతి ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో 6,4తో చెలరేగి పోయాడు. మరో ఓపెనర్ పెరీరా కూడా వీలుచిక్కినప్పుడల్లా షాట్లు ఆడడంతో.. పవర్‌ప్లే ముగిసే సరికి శ్రీలంక 53/1తో భారీ స్కోరుపై కన్నేసింది. అయితే, డేంజరస్ అసలంకను జంపా అవుట్ చేయడంతో.. లంక బ్యాటింగ్ తడబడింది. పెరీరాతో కలసి అసలంక రెండో వికెట్‌కు 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ దశలో పట్టుబిగించిన ఆసీస్ బౌలర్లు 8 పరుగుల తేడాతో పెరీరా, ఫెర్నాండో (4), హసరంగ (4)ను అవుట్ చేసి ఒక్కసారిగా ఒత్తిడి పెంచారు. తన బౌలింగ్‌లో సిక్స్ బాదిన పెరీరాను స్టార్క్.. సూపర్ యార్కర్‌తో బౌల్డ్ చేశాడు. కానీ, కెప్టెన్ షనక (12) సహకారంతో రాజపక్స ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. స్టొయినిస్ వేసిన 17వ ఓవర్‌లో భనుక రెండు ఫోర్లు, సిక్స్‌తో మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో షనకను కమిన్స్ పెవిలియన్ చేర్చినా.. రాజపక్స జట్టు స్కోరును 150 పరుగుల మార్క్ దాటించాడు.
స్కోరుబోర్డు
శ్రీలంక:
నిస్సంక (సి) వార్నర్ (బి) కమిన్స్ 7, కుశాల్ పెరీరా (బి) స్టార్క్ 35, అసలంక (సి) స్మిత్ (బి) జంపా 35, ఫెర్నాండో (సి) స్మిత్ (బి) జంపా 4, రాజపక్స (నాటౌట్) 33, హసరంగ (సి) వేడ్ (బి) స్టార్క్ 4, షనక (సి) వేడ్ (బి) కమిన్స్ 12, కరుణరత్నె (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 20 ఓవర్లలో 154/6. వికెట్ల పతనం: 1-15, 2-78, 3-86, 4-90, 5-94, 6-134; బౌలింగ్: స్టార్క్ 4-0-27-2, హేజెల్‌వుడ్ 4-0-26-0, కమిన్స్ 4-0-34-2, మ్యాక్స్‌వెల్ 1-0-16-0, స్టొయినిస్ 3-0-35-0, జంపా 4-0-12-2.
ఆస్ట్రేలియా:
వార్నర్ (సి) రాజపక్స (బి) షనక 65, ఫించ్ (బి) డిసిల్వా 37, మ్యాక్స్‌వెల్ (సి) ఫెర్నాండో (బి) డిసిల్వా 5, స్మిత్ (నాటౌట్) 28, స్టొయినిస్ (నాటౌట్) 16; ఎక్స్‌టాలు: 4; మొత్తం: 17 ఓవర్లలో 155/3. వికెట్ల పతనం: 1-70, 2-80, 3-130; బౌలింగ్: కరుణరత్నె 2-0-19-0, తీక్షణ 4-0-27-0, చమీర 3-0-33-0, లాహిరు కుమార 3-0-48-0, హసరంగ 4-0-22-2, షనక 1-0-6-1.
