ఆడు మామా.. ఆడు: విహారిని తెలుగులో ఉత్సాహపరిచిన అశ్విన్
ABN , First Publish Date - 2021-01-13T00:52:04+05:30 IST
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు భారత్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు భారత్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ అసమాన పోరాట ప్రతిభ కనబరిచింది. రిషభ్ పంత్ (97), చతేశ్వర్ పుజారా (77) జట్టును విజయం దిశగా నడిపించారు. అయితే, వారిద్దరూ పెవిలియన్ చేరిన తర్వాత భారత్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు.
కానీ, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తెలుగు క్రికెటర్ హనమ విహారి గుర్తుండిపోయే ఇన్సింగ్స్ ఆడారు. ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రత్యర్థులు విసిరే నిప్పులు చెరిగే బంతులను సమర్థంగా ఎదుర్కొంటూ, పరుగుల కోసం ఆశపడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆసీస్‌కు విసుగుపుట్టించారు. చివరికి మ్యాచ్‌ను డ్రా చేశారు. 128 బంతులు ఎదుర్కొన్న అశ్విన్ 7 ఫోర్లతో 39 పరుగులు (నాటౌట్), విహారి 161 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు.
తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన విహారిని అశ్విన్ క్షణక్షణం ఉత్సాహ పరిచాడు. వెన్నుతడుతూ ప్రోత్సహించాడు. అంతేకాదు.. ‘ఆడు మామా.. ఆడు’ అంటూ తెలుగులో, ‘పటు పటు బాల్ ఆడనుమ్’ అని తమిళంలో ప్రోత్సహించడం స్టంప్స్ మైక్‌లో రికార్డయింది.