-
-
Home » Open Heart » Cinema Celebrities » sarathkumar open heart with rk interview-NGTS-Open Heart
-
జయలలిత సంప్రదాయానికి స్టాలిన్ అడ్డుకట్ట వేశారు
ABN , First Publish Date - 2021-11-15T08:36:48+05:30 IST
స్టాలిన్ జయలలిత సంప్రదాయానికి అడ్డుకట్ట వేశారు.

ఆర్కే: జయలలితో విభేదాలెందుకు వచ్చాయి?
శరత్: కళైంగర్ కుటుంబంలో ఏదో ఫంక్షన్ జరుగుతోంది. రాధిక ఏఐఎడిఎంకె సభ్యురాలే కానప్పటికీ, ఆ ఫంక్షన్‌కు వెళ్లడం అవసరమా అని రాధికతో అన్నాను. ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు గడిపి వస్తాను అన్నారామె. అన్నట్టే ఐదు నిమిషాల్లో తిరిగొచ్చేసింది. పార్టీకి ఇది నచ్చలేదు. వివరించే అవకాశం నాకు దొరకలేదు. అలా పార్టీ నుంచి బయటకొచ్చేశాను.
ఆర్కే: మీరెప్పుడైనా జయలలిత కాళ్ల మీద పడ్డారా?
శరత్: లేదు. నిజానికి ప్రజలే ఆమె కాళ్ల మీద పడేవారు. ఆ ధోరణిని ఆమెప్పుడూ ప్రోత్సహించలేదు. అలా పడే వాళ్లను కాదన లేకపోయిందామె.
ఆర్కే: అలా పడేవాళ్లని ఆమెకు ఆపే వీలుంది కదా?
శరత్: నేను ఇద్దరు నాయకులతో సన్నిహితంగా మెలిగాను. ఆవిడ కాళ్ల మీద పడకపోతే సమస్య వస్తుందని ఎవరో అని ఉంటారు. ఆవిడ గత పరాభవానికి బదులుగా అలా తృప్తి పడుతూ ఉండి ఉండవచ్చు. అది మనుషుల మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అయితే స్టాలిన్ ఈ సంప్రదాయానికి అడ్డుకట్ట వేశారు.
ఆర్కే: రాజకీయాలను మీరు పూర్తిగా వదిలేసినట్టేనా?
శరత్: లేదు. చిన్న బ్రేక్ తీసుకున్నానంతే! పదేళ్ల రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. జయలలిత గారితో ఎప్పుడేం మాట్లాడినా, పక్కనున్న వాళ్లతో ఇబ్బంది. దాంతో అపార్థాలు, దూరం పెరగడాలు జరిగాయి. ఆవిడ అస్వస్థతతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆస్పత్రికి తిరుగుతూ ఉండేవాడిని. ఇంత ప్రయాణం చేసినా, పార్టీలో వాళ్లు నన్ను గుర్తించకుండా, దూరం పెట్టేశారు. అలా నేను కమల్‌హాసన్‌ను కలిశాను.
ఆర్కే: కమల్‌హాసన్‌ది ట్రాజెడీ అయిపోయిందిగా?
శరత్: రియల్ హీరో అంటే ప్రజలతో ఉండాలి. ఆ విషయాన్ని కమల్ ఎన్నికల తర్వాత గ్రహించారు.
ఆర్కే: నచ్చితే మళ్లీ డిఎంకెలో చేరతారా?
శరత్: డిఎంకె నాకు రాజకీయ జీవితాన్నిచ్చింది. అయితే నా పార్టీకి నేను పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. ఒక కాలు వృత్తిలో, మరో కాలు రాజకీయాల్లో ఉంచడం సరికాదు.
ఆర్కే: స్టాలిన్ తమిళనాడు రాజకీయ సంస్కృతిని మార్చేశారు కదా!
శరత్: ఆయనది రాజకీయ కుటుంబం. తండ్రి గొప్ప రాజకీయ నాయకుడు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. స్టాలిన్ రాజకీయ పాఠాలు నేర్చుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు.
ఆర్కే: శశికళకూ మీకూ పడదా?
శరత్: ఆవిడకు నేనంటే ఇష్టమో, అయిష్టమో నాకు తెలియదు. అయితే పార్టీ సెకండరీ లీడర్‌షిప్‌లో పొరపాటు జరిగిందని మాత్రం చెప్పగలను.
ఆర్కే: వ్యక్తిగత జీవితానికొస్తే.... మొదటి భార్యతో మీకు విభేదాలెందుకు?
శరత్: ఏమో తెలియదు. పెళ్లి తర్వాత విభేదాలొచ్చాయి.
ఆర్కే: రాధికతో చాలా కాలం కలిసి ఉన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు కదా?
శరత్: మేం మంచి స్నేహితులం. అలా స్నేహితులుగా ఉన్న మేం పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొచ్చాం.