25 లక్షల మార్క్‌ను దాటిన కరోనా మరణాలు.. యూఎస్‌లోనే 20 శాతం

ABN , First Publish Date - 2021-02-26T15:14:03+05:30 IST

మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది.

25 లక్షల మార్క్‌ను దాటిన కరోనా మరణాలు.. యూఎస్‌లోనే 20 శాతం

వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. తాజాగా కరోనా మరణాలు 25 లక్షల మార్కును దాటింది. 2019 డిసెంబర్‌లో ఉనికిని చాటిన ఈ మహమ్మారి ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా 25 లక్షల మందిని పొట్టబెట్టుకుంది. జాన్స్ హాప్కిన్స్​ యూనివర్శిటీ సమాచారం ప్రకారం గురువారం మధ్యాహ్నం వరకు ప్రపంచవ్యాప్తంగా 25,01,626 మంది ఈ వైరస్ ధాటికి మృతి చెందారు. అలాగే 112,618,488 మందికి కోవిడ్ ప్రబలింది. అందులో అమెరికాలోనే 20 శాతం మరణాలు నమోదైనట్లు యూనివర్శిటీ తెలిపింది. యూఎస్​లో ఇప్పటివరకు 5లక్షలకు పైగా మంది కరోనాకు బలయ్యారు.


కరోనా కేసుల్లో కూడా అమెరికానే అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూఎస్ ఇప్పటివరకు 2,83,48,259 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఇవి 25 శాతం. ఇక మరణాల్లో సగానికి పైగా కేవలం ఐదు దేశాల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. యూఎస్ (5,06,232), బ్రెజిల్ (2,49,957), మెక్సికో (1,82,815), భారత్ (1,56,705), బ్రిటన్ (1,22,070) ఈ ఐదు దేశాల్లోనే సగానికి పైగా మరణాలు సంభవించాయి. కాగా, 2020 సెప్టెంబర్​ 28 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 10 లక్షలు ఉండగా 2021 జనవరి 15 నాటికి రెట్టింపు కావడం గమనార్హం. 

Updated Date - 2021-02-26T15:14:03+05:30 IST