బ్రేకప్ చెప్పిన ప్రియుడు.. ఆ మాజీ ప్రేయసి రివేంజ్ తీర్చుకున్న తీరు చూసి అతడికి మైండ్‌బ్లాంక్..!

ABN , First Publish Date - 2021-07-13T02:41:15+05:30 IST

నను కాదని మరొక అమ్మాయి వెనక తిరుగుతున్న మాజీ ప్రియుడికి ఓ యువతి చుక్కలు చూపించాలనుకుంది. అందుకోసం పెద్ద స్కెచ్చే వేసింది. తీరా అదికాస్తా బెడిసికొట్టడంతో.. ప్రస్తుతం ఆ యువతి జైలు ఊచలు

బ్రేకప్ చెప్పిన ప్రియుడు.. ఆ మాజీ ప్రేయసి రివేంజ్ తీర్చుకున్న తీరు చూసి అతడికి మైండ్‌బ్లాంక్..!

బీజింగ్: తనను కాదని మరొక అమ్మాయి వెనక తిరుగుతున్న మాజీ ప్రియుడికి ఓ యువతి చుక్కలు చూపించాలనుకుంది. అందుకోసం పెద్ద స్కెచ్చే వేసింది. తీరా అదికాస్తా బెడిసికొట్టడంతో.. ప్రస్తుతం ఆ యువతి జైలు ఊచలు లెక్క పెడుతున్న ఘటన చైనాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..


తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి, యువకుడు ఇద్దరూ కొంతకాలం క్రితం ప్రేమలో పడ్డారు. ప్రేమలో ఉన్నంత కాలం ఒకరి మాట మరొకరికి తేనె కంటే తీయగానే అనిపించాయి. నా బంగారం కదు.. బుజ్జి కదు అంటూ ఒకరినొకరు ముద్దుగా పిలుచుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో.. కానీ వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో ఇంతకాలం తీయగా వినిపించిన మాటలే.. కర్ణకఠోరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇబ్బందులు పడుతూ కలిసి ఉండటం కంటే.. విడిపోవడం మేలని ఇద్దరూ భావించారు. తమ ప్రేమ ప్రయాణాన్ని బ్రేకప్‌తో ఎండ్ చేశారు. ఈ క్రమంలోనే సదరు యువకుడు మరో అమ్మాయికి దగ్గరయ్యాడు. అది చూసి.. అతని మాజీ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఎలాగైన తన మాజీ ప్రియుడికి ఏదో ఒక సమస్యలో ఇరికించి చుక్కలు చూపించాలనుకుంది. అతను ఇబ్బంది పడుతుంటే సంతోషించాలని భావించింది. ఇందుకోసం అతని కారును అతడికే తెలియకుండా అద్దెకు తీసుకుంది. రెండు రోజుల్లో రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. సుమారు 50సార్లు సిగ్నల్స్‌ను జంప్ చేసింది. భారీ ఫైన్‌లతో మాజీ ప్రియుడి జేబులు గుళ్లవడం ఖాయమని తెగ సంబంరపడింది. 


అయితే ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. ఒకే కారుపై రెండు రోజుల్లోనే 50సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులు అందటంపట్ల ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి, యువతి ప్లాన్‌ను బయటపెట్టారు. అంతేకాకుండా ఆమెపై కేసు నమోదు చేసి, జైలు తరలించారు. దీంతో ప్రస్తుతం ఆమె జైల్లో ఊచలు లెక్కిస్తోంది. కాగా.. మాజీ ప్రేయసి ప్లాన్ గురించి తెలిసి ఆ యువకుడి నివ్వేరపోయాడు. 


Updated Date - 2021-07-13T02:41:15+05:30 IST