అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. అన్నంత పనీ చేయబోతున్నారా..?

ABN , First Publish Date - 2021-05-05T11:01:45+05:30 IST

డొనాల్డ్ ట్రంప్.. అమెరికా చరిత్రలో ఇంత వివాదాస్పద అధ్యక్షుడు మరొకరు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. సరిహద్దు పాలసీల నుంచి ప్రత్యర్థులపై నోరుజారడం వరకూ దేనిలోనైనా ట్రంప్‌కు ట్రంపే సాటి.

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. అన్నంత పనీ చేయబోతున్నారా..?

డొనాల్డ్ ట్రంప్.. అమెరికా చరిత్రలో ఇంత వివాదాస్పద అధ్యక్షుడు మరొకరు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. సరిహద్దు పాలసీల నుంచి ప్రత్యర్థులపై నోరుజారడం వరకూ దేనిలోనైనా ట్రంప్‌కు ట్రంపే సాటి. బరాక్ ఒబామా వంటి నేత తర్వాత వైట్‌హౌస్ తన కైవశం చేసుకున్న ట్రంప్.. అమెరికా ఫస్ట్ అనే నినాదానికి కొత్త అర్థం చెప్పారు. ట్రంప్ హయాంలో చాలా మందిపై జాతివిద్వేష దాడులు విపరీతంగా జరిగాయి. మరి అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి జోబైడెన్ చేతిలో ఘోర పరాజయం తర్వాత ట్రంప్ ఏం చేశారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అనే విషయాలపై ఒక లుక్కేస్తే.. ట్రంప్ ప్రెసిడెన్సీ చివర్లో కరోనా మహమ్మారి విజృంభించింది. ప్రజలు ఎండుటాకుల్లా రాలిపోవడం మొదలుపెట్టారు. ప్రతిరోజూ లక్షల్లో కరోనా కేసులు, వేలల్లో మరణాలు నమోదయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం భారత్‌లో కనిపిస్తున్న పరిస్థితులకు మించిన దయనీయ స్థితి అమెరికాలో కనిపించింది. ఇంత జరుగుతున్నా సరే ట్రంప్ మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. తన పద్ధతిలో తను పనిచేసుకుంటూ పోయారు. కరోనా విషయంలో చైనాను తిట్టిపోస్తూ వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు. తన ఓటమి స్పష్టంగా కనిపిస్తున్నా సరే ట్రంప్ మాత్రం దాన్ని అంగీకరించలేదు. తానే గెలిచానని ఓట్ల లెక్కింపులో లోపాలున్నాయని, కొన్ని చోట్ల దొంగ ఓట్లున్నాయని ఆరోపణలు చేశారు. ఆయన ఈ విషయంలో ఎంతలా గొడవ చేశారంటే.. చివరకు ట్రంప్ కుటుంబసభ్యులు కూడా దాన్ని భరించలేక, ‘ఇక వదిలేయండి’ అని చెప్పారట. ఈ విషయంపై అప్పట్లో చాలా పత్రికలు రకరకాల కథనాలు రాశాయి కూడా.
తాను ఓడిపోయిన ఎన్నికల ఫలితాలను మార్చడానికి ట్రంప్ నానా ప్రయత్నాలూ చేశారు. మార్చి నెలలో కూడా ఒక ఫోన్ కాల్ సంభాషణలో ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. ఈయన నేతృత్వంలోని ఒక బృందం ఆరు రాష్ట్రాల్లో ఓటింగ్ మోసం, తప్పుడు లెక్కింపు జరిగిందంటూ కోర్టుకెక్కింది. అయితే అన్ని చోట్లా ఈ బృందానికి నిరాశే లభించింది. చివరకు సుప్రీంకోర్టు కూడా వీరి వాదనలను తోసిపుచ్చింది. కొత్త అధ్యక్షుల ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షులు రావడం అనేది అమెరికాలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. దీన్ని కూడా ట్రంప్ బ్రేక్ చేశారు. బైడెన్ ప్రమాణానికి తాను రానంటూ ట్వీట్ చేసి, రాలేదు కూడా.


ఈ ఏడాది జనవరిలో యూఎస్ కాపిటల్‌పై దుండగుల దాడి సమయంలో.. దాడి చేసిన వారిని ‘ప్యాట్రియాట్స్’(దేశభక్తులు) అంటూ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత దేశంలో హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రకటించాయి. దీన్ని కూడా తనకు ఎదురైన సవాల్‌గానే తీసుకున్నాడీ మాజీ అధ్యక్షుడు. తన హయాంలో చేసిన అభివృద్ధిని వివరించే విధంగా 45Office.com అనే వెబ్‌సైట్ సృష్టించారు. త్వరలోనే సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తీసుకొస్తానని ప్రకటించారు. దీనిలోని కంటెట్‌ను బట్టి దీన్ని తమ యాప్‌స్టోర్‌లో ఉంచాలో వద్దో నిర్ణయిస్తామని యాపిల్ కంపెనీ స్పష్టంగా చెప్పేసింది.


కరోనాతో అతలాకుతలం అవుతున్న ప్రపంచాన్ని ఆదుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అనేది ఎంతోమంది వైద్యనిపుణుల మాట. అందుకే వ్యాక్సినేషన్‌కు ప్రచారం కల్పించేందుకు అమెరికా మాజీ అధ్యక్షులంతా వ్యాక్సిన్ తీసుకుంటున్న చిత్రాలతో వీడియో ప్రచారం చేశారు. ఆ వీడియోలో కూడా ట్రంప్, ఆయన భార్య మెలానియా లేరు. ఈ వీడియోలో మిస్సయిన ఏకైక మాజీ అధ్యక్షుడు ట్రంపే. కానీ వ్యాక్సిన్ అభివృద్ధిలో తన పాత్ర చాలా ఉందని మాత్రం ట్రంప్ వాదిస్తున్నారు. కాబట్టి ఈ వ్యాక్సిన్‌కు ‘ట్రంప్‌సైన్’ అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారట. అయితే వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయేటప్పుడే ట్రంప్, మెలానియా వ్యాక్సిన్ తీసుకున్నారని సమాచారం.
అమెరికా చరిత్రలో రెండు సార్లు అభిశంసనను ఎదుర్కొన్న ఏకైక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎన్నికల్లో ఘోరపరాజయం, సొంత పార్టీలో కూడా ఆయనపై కొంత వ్యతిరేకత ఉండటంతో ట్రంప్ రాజకీయ భవితవ్యంపై కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే రిపబ్లికన్ పార్టీపై ట్రంప్‌కు చాలా పట్టుంది. ఎంతలా అంటే 2022లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఎండార్స్‌మెంట్ కోసం చాలామంది రిపబ్లికన్ అభ్యర్థులు ట్రంప్‌కు లేఖలు రాశారట. అదే సమయంలో ట్రంప్ కూడా పార్టీలో తన స్థానాన్ని మెరుగుపరుచుకునే పనిలోనే ఉన్నారు. సీనియర్ నేతలైన మైక్ పెన్స్, మిచ్ మెక్‌కొన్నెల్ వంటి వారిపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు. ఫ్లోరిడాలో తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఇలాంటి స్ట్రాటజీలు ఉపయోగించి పార్టీలో తానే కింగ్‌మేకర్ అవ్వాలనేది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది.


అదే కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ‘‘2022లో హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌ను మనం వెనక్కు తీసుకుంటాం. ఆ తర్వాత సెనేట్‌ను కూడా లాక్కుంటాం. ఆపై 2024లో వైట్‌హౌస్‌ను కూడా మళ్లీ రిపబ్లికన్ అభ్యర్థే గెలుచుకుంటాడు’’ అని ప్రకటించారు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తారో లేదో మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఇవన్నీ లేకపోతే గతంలో ఒకసారి ట్రంప్ ప్రకటించినట్లు ఆయన కొత్త పార్టీ పెట్టి రంగంలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గతంలో తాను ‘ప్యాట్రియాట్ పార్టీ’ అనే కొత్త పార్టీ పెడతానని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే.

Updated Date - 2021-05-05T11:01:45+05:30 IST