విదేశీ విద్యకు టీకా గుబులు.. మనదేశ టీకాలతో ఉపయోగం ఉందా?

ABN , First Publish Date - 2021-05-30T12:59:43+05:30 IST

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు కొవిడ్‌ టీకా షరతులు వర్తిస్తాయా? టీకా వేసుకోని విద్యార్థుల ప్రవేశానికి ఆయా దేశాలు ససేమిరా అంటున్నాయా? ఒకవేళ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వేసుకున్నా ప్రయోజనం లేదా? ఆ దేశాలు ఆమోదించిన టీకాలు వేసుకుంటేనే ప్రవేశాలకు అనుమతిస్తున్నారా?

విదేశీ విద్యకు టీకా గుబులు.. మనదేశ టీకాలతో ఉపయోగం ఉందా?

హైదరాబాద్‌: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు కొవిడ్‌ టీకా షరతులు వర్తిస్తాయా? టీకా వేసుకోని విద్యార్థుల ప్రవేశానికి ఆయా దేశాలు ససేమిరా అంటున్నాయా? ఒకవేళ కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వేసుకున్నా ప్రయోజనం లేదా? ఆ దేశాలు ఆమోదించిన టీకాలు వేసుకుంటేనే ప్రవేశాలకు అనుమతిస్తున్నారా? కొన్ని దేశాలయితే మన విద్యార్థుల ప్రవేశానికి నో చెబుతున్నాయా? పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు గడువు ముంచుకొస్తుండటంతో ఇప్పుడు మన విద్యార్థుల్లో ఇదే ఆందోళన నెలకొంది. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లోని వర్సిటీల్లో ఆగస్టులో ప్రవేశాలు మొదలవుతున్న నేపథ్యంలో టీకాలు, వీసాల అనుమతిపై తీవ్ర గందరగోళం నెలకొంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కొన్ని విశ్వవిద్యాలయాలు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అని చెబుతుండటంతో అలాంటివారికి కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి.


తమ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణను ప్రకటించలేదు. ఉన్నతవిద్య కోసం మన రాష్ట్రం నుంచి ఏటా దాదాపు 10వేల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళుతుంటారు. 18-44 ఏళ్ల మఽధ్య వయసువారికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఊపందుకోకపోవడం.. విదేశీ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాలు మరో రెండు నెలల్లో మొదలుకానున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరహా విద్యార్థుల కోసం కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని కోరుతున్నారు. 


అండగా నిలుస్తున్న విదేశీ వర్సిటీలు

కరోనా పరిస్థితుల్లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతున్నవారికి అక్కడి యంత్రాంగం అండగా నిలుస్తోంది. ఇతర ప్రయాణికులకు టీకా తప్పనిసరి చేసినా, చదువుకునేందుకు వచ్చినవారికి పలు మినహాయింపులు ఇస్తున్నాయి. ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువమంది అమెరికా, బ్రిటన్‌కు ప్రాధాన్యమిస్తారు. అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో టీకా నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం అక్కడి వర్సిటీలకే వదిలేసింది. ఈ మేరకు టీకాలు తీసుకోని విద్యార్థులు కూడా రావొచ్చంటూ పలు వర్సిటీలు వెసులుబాటు కల్పించాయి. అయితే అమెరికాలో దిగాక 10 రోజుల హో  క్వారంటైన్‌ తప్పనిసరి అంటున్నాయి.  


పత్రాలు చూపించిన వారికి టీకా 

విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలకు సంబంధించిన పత్రాలు చూపించిన వారికి మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీలో టీకాలు వేస్తున్నారు. ఈ మేరకు పుణెలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు మేయర్‌ మురళీధర్‌ మోహల్‌ చెప్పారు. వీరి కోసం పుణె వ్యాప్తంగా మూడు కేంద్రాలు ఏర్పాటు చేశామని.. మే 31, జూన్‌ 1, 2 తేదీల్లో అక్కడ టీకాలు వేస్తారని పేర్కొన్నారు. ముంబైలో విద్యార్థులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిచ్చేలా నిర్ణయం తీసుకున్నామని అక్కడి యంత్రాంగం పేర్కొంది. ఇందుకు సంబంధిత పత్రాలను కేంద్రాలకు వారు తీసుకురావాల్సి ఉంటుందని వెల్లడించింది. 


కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌కు వేసుకున్నా  అంతేనా? 

కొన్ని యూనివర్సిటీలు మాత్రం టీకాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అమెరికాలోని ఎఫ్‌డీఏ (ఆహార, ఔషద నియంత్రణ సంస్థ) గుర్తించిన టీకాలు వేసుకున్నవారినే అనుమతిస్తున్నాయి. మన దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు వేస్తుండగా ఈ రెంటినీ ఎఫ్‌డీఏ గుర్తించడం లేదు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫొర్నియా ఎఫ్‌డీఏ గుర్తించిన టీకాను తప్పనిసరి చేసింది. ఆ  టీకాలు వేసుకొని వారిని అనుమతించబోమని స్పష్టం చేసింది. అమెరికాలోని పలు వర్సిటీలు ఇలాంటి నిబంధనలు జారీచేస్తున్నాయి. ఇంకొన్ని దేశాల్లో డబ్ల్యూహెచ్‌వో గుర్తించిన కొవిషీల్డ్‌ టీకాను వేసుకున్న వారినే అనుమతిస్తున్నాయి. దీంతో ఇప్పటికే టీకాలు వేసుకున్న విద్యార్థులు, ఇవేం షరతులంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్రప్రభుత్వం పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది.


టీకాల పరంగా భారతీయ విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలంటూ వివిధ దేశాలతో చర్చలు జరుపుతోంది.  డబ్ల్యూహెచ్‌వో కూడా ఆగస్టు నాటికి కొవాగ్జిన్‌కు కూడా అనుమతులిచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ప్రవేశాలు ఖరారు చేసుకున్న విద్యార్థులు.. జాతీయ ప్రయోజనాల మినహాయింపు (ఎన్‌ఐఈ) కింద అత్యవసర వీసాలకు దరఖాస్తు చేసుకోవాలని ‘ఆటా’ న్యాయసలహాదారు మధురిమ పాటూరి ‘ఆంధ్రజ్యోతి’తో పేర్కొన్నారు. ఇక రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని హైదరాబాద్‌ ఓవర్సీస్‌ కన్సల్టెంట్‌ సంజీవ్‌ రాయ్‌ అభిప్రాయపడ్డారు. 


అక్కడ ప్రవేశం పొందినా ఆన్‌లైన్‌ చదువులే

ఈసారి ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు మాత్రం అక్కడికి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మన దేశంలో కేసుల తీవ్రత దృష్ట్యా ఆస్ట్రేలియా, కెనడా విశ్వ విద్యాలయాలు ఈ ఏడాది భారత విద్యార్థులను అనుమతించడం లేదు. నిరుడు అక్కడ ప్రవేశాలు పొందిన విద్యార్థులు.. కొవిడ్‌ నేపథ్యంలో అప్పట్లోనే భారత్‌కు తిరిగొచ్చారు. ఇప్పుడు వారు తమ చదువులు కొనసాగిస్తామని చెబుతన్నా వచ్చేందుకు ఆ దేశాలు అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా, కెనడాలో ప్రవేశాలు పొంది స్వదేశానికి తిరిగొచ్చిన వారు, కొత్తగా ప్రవేశాలు పొందినవారు ఇక్కడి నుంచే ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడం తప్ప మరో మార్గం లేదు.


ఇది విద్యార్థులకు ఒక రకంగా ఆర్థికంగా పెను భారంగా మారనుంది. అమెరికా, బ్రిటన్‌లో ఎంఎస్‌ లాంటి కోర్సుకు ప్రభుత్వ విశ్వ విద్యాలయాల్లో అయితే ఏడాదికి రూ.10-25 లక్షల వరకు, ఆస్ట్రేలియాలోనైతే రూ.14-18 లక్షల వరకు, కెనడాలో అయితే రూ.8-15 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇదే చదువు ప్రైవేటు వర్సిటీలైతే  ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి వెళ్లే విద్యార్థులకు ఇది తలకుమించిన భారం కాబట్టి అక్కడ వారు చదువుతూనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడాకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆ విద్యార్థులకు ఫీజులు భారం కానున్నాయి. ఇక ఐర్లాండ్‌లోని విశ్వవిద్యాలయాలు కొవిడ్‌ టీకాను తప్పనిసరి చేశాయి. వ్యాక్సిన్‌ లేకుండా దేశంలో ప్రవేశిస్తే ప్రత్యేక కేంద్రాల్లో 12 రోజుల హోం క్వారంటైన్‌ తప్పనిసరి చేశాయి. దీనికోసం రూ. 1.7 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 




అమెరికాలో వ్యాక్సినేషన్‌ తప్పనిసరి కాదు 

విదేశాలకు వెళ్లాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తప్పనిసరి అని, అదికూడా డబ్ల్యూహెచ్‌వో ఆమోదం పొందిన కొవిషీల్ట్‌ అయితేనే అమోదిస్తున్నారన్న వార్తలు విద్యార్థుల్లో ఆందోళనను పెంచుతున్నాయి.  నిజానికి ఇది తప్పనిసరి కాదు. అమెరికా ప్రభుత్వం దీనిపై ఎలాంటి మార్గదర్శకాలు జారీచేయలేదు. తమ మత సిద్ధాంతాలు అనుమతించవన్న కారణాలతో అమెరికాలో చాలా మంది టీకాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం వారి ఇష్టాయిష్టాలకే వదిలేసింది. వ్యాక్సినేషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారం అమెరికాలోని విశ్వవిద్యాలయాలదే తప్ప ప్రభుత్వానికి కాదు. ఏ విశ్వ విద్యాలయం టీకా నిబంధన పెట్టలేదు. ఇక్కడి విమానాశ్రయాల్లో కొవిడ్‌ ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ మాత్రమే తప్పనిసరి. ఈ విషయంలో తెలుగు విద్యార్థులు సంప్రదిస్తే ‘ఆటా’ సహకరిస్తుంది.  


-భువనేశ్‌ బూజల, ‘ఆటా’  అధ్యక్షుడు


బ్రిటన్‌లో 10 రోజుల తర్వాతే అనుమతి 

కరోనా తీవ్రత నేపథ్యంలో భారత్‌ను బ్రిటన్‌ ప్రభుత్వం   రెడ్‌జోన్‌ కంట్రీగా గుర్తించింది. అందుకే భారత్‌ నుంచి   వచ్చేవారు ఇక్కడ 10 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఆ పది రోజుల పాటు ప్రతీరోజు ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తారు. ఇందుకు 1750 పౌండ్లను (రూ. 1.75 లక్షలు) క్వారంటైన్‌ ఫీజుగా చెల్లించాలి. హోం క్వారంటైన్‌ గడువు పూర్తయ్యాక విద్యార్థులు యూనివర్సిటీలకు వెళ్లవచ్చు. ఉన్నతవిద్యకోసం వచ్చిన  విదేశీ విద్యార్థులు తమ తచదువులు పూర్తయ్యాక మరో రెండేళ్లపాటు ఇక్కడే ఉండి ఉపాధిని చూసుకునే వెసులుబాటును బ్రిటన్‌ ప్రభుత్వం కల్పించింది. ఈ నిర్ణయంతో భారత్‌తోపాటు విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. 


-జగన్‌ దొప్పలపుడి, పారిశ్రామికవేత్త, లండన్‌ 

Updated Date - 2021-05-30T12:59:43+05:30 IST