America వెళ్లేవారికి ఇకపై ఇది తప్పనిసరి..!
ABN , First Publish Date - 2021-10-29T21:47:56+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 8 నుంచి విదేశీయుల రాకపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. అయితే, వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు మాత్రమే తమ దేశానికి రావాలని స్పష్టం చేసింది. అమెరికా వచ్చే విదేశీయులు...

టీకా ధృవీకరణ పత్రం తప్పనిసరి
ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా కరోనా నేపథ్యంలో విధించిన ప్రయాణ ఆంక్షలను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 8 నుంచి విదేశీయుల రాకపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. అయితే, వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు మాత్రమే తమ దేశానికి రావాలని స్పష్టం చేసింది. అమెరికా వచ్చే విదేశీయులు తప్పనిసరిగా టీకా ధృవీకరణ పత్రం చూపించాలని పేర్కొంది. అలాగే జర్నీకి 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. "దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కరోనా సమయంలో ప్రయాణాలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నాం. టీకా ఆధారిత అంతర్జాతీయ విమాన ప్రయాణాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం" అని ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
అయితే, ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే.. టీకా తీసుకున్న మనోళ్లకు చాలామందికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అందలేదు. కొందరికి ఒకే డోసు తీసుకున్నట్లు ధృవీకరణ పత్రం వస్తే, మరికొందరికైతే అసలు ఆ సమాచారము కూడా అందడం లేదు. తీరా.. ఇప్పుడు అమెరికా టీకా ధృవీకరణ పత్రం తప్పనిసరి చేయడంతో ఆ దేశానికి వెళ్లాలనుకునేవారికి ఇదో తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఇలా జరగడానికి పలు కారణాలు ఉన్నాయి. మొదటిది రెండు డోసులను రెండు వేర్వేరు కేంద్రాల్లో వేయించుకోవడం. ఆ సమయంలో కోవిన్ పోర్టల్‌లో లేదా ఆరోగ్యసేతులో సరిగా సమాచారాన్ని నమోదు చేయకపోవడం. రెండోది కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు భారీఎత్తున టీకాలు అందించే క్రమంలో సొంత వెబ్సైట్లో వివరాలు నమోదు చేశాయి. ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చేసి దాని ఆధారంగా వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది. దీంతో అధికారిక వెబ్సైట్లో వివరాలు సక్రమంగా రిజిస్టర్ చేయలేదు. ఇలాంటి వారికి కేవలం మొదటి డోసు తీసుకున్నట్లు మాత్రమే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ వస్తున్నాయి.

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇలా పొందవచ్చు..
కోవిన్ లేదా ఆరోగ్యసేతు పోర్టల్‌లో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌తో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పొందే వీలు ఉంది. లేదా కోవిన్ సహాయ కేంద్రానికి సంబంధించిన నెంబర్ 9013151515కు వాట్సప్‌లో ‘సర్టిఫికేట్’ అని మెసేజ్ చేస్తే.. ఓ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేయాలి. రెండు మోతాదుల వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారికి పీడీఎఫ్ రూపంలో వాట్సప్‌కు సర్టిఫికేట్ వస్తుంది. లేదంటే ‘యూ ఆర్ నాట్ రిజిస్టర్డ్’ అనే సమాచారం పంపుతుంది. ఇక సర్టిఫికేట్ రానివారు వివరాల కోసం వ్యాక్సిన్ వేయించుకున్న కేంద్రాల్లో సంప్రదించాలి. అక్కడ ఏమైనా సాంకేతిక సమస్యలుంటే గుర్తించి వాటిని సరిచేసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు.