ఆ సమావేశం హిందూ వ్యతిరేకమే.. అమెరికా సెనేటర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-09-02T06:29:07+05:30 IST

అమెరికాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న ‘డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ’ సమావేశంపై తాజాగా ఒక అమెరికా సెనేటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ సమావేశం హిందూ వ్యతిరేకమే.. అమెరికా సెనేటర్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికాలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న ‘డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ’ సమావేశంపై తాజాగా ఒక అమెరికా సెనేటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కచ్చితంగా హిందూ వ్యతిరేక సమావేశమే అంటూ ఆయన తేల్చిచెప్పారు. సెప్టెంబరు 10-12 మధ్య ఈ సమావేశం జరుగుతుందని తెలిసినప్పటి నుంచి అమెరికాలోని పలు హిందూ సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా ఉన్న యూనివర్సిటీలకు మెయిల్స్ పంపి.. తమ స్పాన్సర్‌షిప్‌ను వెనక్కు తీసుకోవాలని ఈ సంఘాలు విన్నవించాయి.


ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన ఒహాయో స్టేట్ సెనేటర్ నీరజ్ అంతానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అమెరికా వ్యాప్తంగా ఉన్న హిందువులపై ఒక నీచమైన దాడిని ఈ సమావేశం ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం జాతివిద్వేషం, మూర్ఖత్వం మాత్రమే. దీన్ని అందరూ ఖండించాలి. హిందుఫోబియాకు వ్యతిరేకంగా నేను ఎల్లప్పుడూ బలంగా నిలబడతాను’’ అని నీరజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. సాధ్యమైనంత బలంగా ఈ డిస్మాంట్లింగ్ గ్లోబల్ హిందుత్వ సమావేశాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికాలోని చరిత్రలో ఎన్నికైన అత్యంత చిన్న హిందూ అధికారి నీరజ్. అలాగే అతను ఒహాయో చరిత్రలో సెనేటర్‌గా గెలిచిన తొలి ఇండియన్ అమెరికన్ కూడా.

Updated Date - 2021-09-02T06:29:07+05:30 IST