భార‌త్‌కు సాయం ఆగ‌దు: వైట్‌హౌస్

ABN , First Publish Date - 2021-05-18T17:29:40+05:30 IST

మ‌హ‌మ్మారి క‌రోనాతో పోరాడుతున్న భార‌త్‌కు తాము అందిస్తున్న‌ సాయం ఆగ‌ద‌ని అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రోసారి వెల్ల‌డించింది.

భార‌త్‌కు సాయం ఆగ‌దు: వైట్‌హౌస్

వాషింగ్ట‌న్‌: మ‌హ‌మ్మారి క‌రోనాతో పోరాడుతున్న భార‌త్‌కు తాము అందిస్తున్న‌ సాయం ఆగ‌ద‌ని అగ్ర‌రాజ్యం అమెరికా మ‌రోసారి వెల్ల‌డించింది. కొవిడ్‌-19తో స‌త‌మ‌త‌మ‌వుతున్న మా కీల‌క భాగస్వామి భార‌త్‌కు సహాయం కొనసాగుతుంద‌ని సోమ‌వారం వైట్‌హౌస్ స్ప‌ష్టం చేసింది. క‌రోనా సెకండ్ వేవ్‌తో అత‌లాకుత‌లం అవుతున్న భార‌త్‌కు అధ్య‌క్షుడు జో బైడెన్ ప్ర‌క‌టించిన 100 మిలియ‌న్ డాల‌ర్ల‌ అత్య‌వ‌స‌ర స‌హాయాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అందించే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్ర‌ట‌రీ జెన్ సాకీ సోమ‌వారం మీడియా స‌మావేశంలో తెలిపారు. సాకీ మాట్లాడుతూ.. "మ‌హ‌మ్మారి వ‌ల్ల ప్ర‌పంచ దేశాలు సంక్షోభ పరిస్థితుల‌ను ఎదుర్కొంటున్నాయి. వాటిలో మా కీల‌క భాగ‌స్వామి భార‌త్ కూడా ఉంది. ఇక క‌రోనాతో పోరాడుతున్న దేశాల‌కు అగ్ర‌రాజ్యం ఆప‌న్న హ‌స్తం అందిస్తోంది. అధ్య‌క్షుడు జో బైడెన్ ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. భార‌త్‌కు స‌హాయం అందించే విష‌యంలో అమెరికా క‌ట్టుబ‌డి ఉంది. ఎట్టిప‌రిస్థితుల్లో భార‌త్‌కు సాయం ఆగ‌దు. ఆ దేశానికి కావాల్సిన అత్య‌వ‌స‌ర స‌హాయాన్ని అందిస్తున్నాం." అని అన్నారు. 


ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా వ‌ల్ల నెల‌కొన్న ప‌రిస్థితులు, అమెరికా స‌హాయంపై త‌లెత్తిన ప్ర‌శ్న‌కు సాకీ పైవిధంగా స‌మాధానం ఇచ్చారు. భార‌త్‌కు అత్య‌వ‌స‌రంగా 100 మిలియ‌న్ డాల‌ర్ల స‌హాయం అందించాల‌ని బైడెన్ నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు ఏడు విమానాల్లో భార‌త్‌కు కీల‌క వైద్య సామాగ్రిని చేర‌వేయ‌డం జ‌రిగింద‌ని సాకీ తెలియ‌జేశారు. మునుముందు కూడా భార‌త్‌కు ఈ స‌హాయం ఇలాగే కొన‌సాగుతుంద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. దీనికోసం భార‌త అధికారుల‌తో దేశ‌ ప్ర‌జ‌ల‌కు కావాల్సిన స‌హాయం విష‌య‌మై ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. భార‌త్‌లో త్వ‌ర‌లోనే సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని సాకీ ఆశాభావం వ్య‌క్తం చేశారు.    

Updated Date - 2021-05-18T17:29:40+05:30 IST