అమెరికా నుంచి భారత్‌కు.. ఇప్పటివరకు అందిన సాయం ఎంతంటే..
ABN , First Publish Date - 2021-05-20T16:45:41+05:30 IST
కరోనాతో పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు తమవంతు సహాయం చేస్తూ ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక అగ్రరాజ్యం అమెరికా కరోనాతో అతలాకుతలం అవుతున్న భారత్‌కు ఇప్పటివరకు భారీ సాయం చేసింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటివరకు భారత్‌కు తాము 500 మిలియన్ డాలర్ల సాయం అందించామని వైట్‌హౌస్ బుధవారం వెల్లడించింది.

భారత్‌కు యూఎస్ 500 మిలియన్ డాలర్ల సాయం
వాషింగ్టన్: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు ప్రపంచ దేశాలు తమవంతు సహాయం చేస్తూ ఆపత్కాలంలో ఆపన్నహస్తం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక అగ్రరాజ్యం అమెరికా కరోనాతో అతలాకుతలం అవుతున్న భారత్‌కు ఇప్పటివరకు భారీ సాయం చేసింది. మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటివరకు భారత్‌కు తాము 500 మిలియన్ డాలర్లు(రూ.36,56,00,25,000) సాయం అందించామని వైట్‌హౌస్ బుధవారం వెల్లడించింది. అంతేగాక త్వరలోనే వివిధ దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి పేర్కొన్నారు.
"భారత్‌కు అమెరికా ఇప్పటివరకు 500 మిలియన్ డాలర్ల కొవిడ్ సాయాన్ని అందించింది. దీనిలో యూఎస్ ఫెడరల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, అమెరికన్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు అందించిన సాయం కూడా ఉంది. మేము ఏడు విమానాల ద్వారా కీలకమైన వైద్య సామాగ్రిని భారత్‌కు చేరవేశాం. ప్రధానంగా ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలు, ఎన్-95 మాస్కులు, ర్యాపిడ్ డయోగ్నస్టిక్స్ టెస్టు కిట్లు, ఔషధాలు వంటి కరోనా సాయాన్ని భారత్‌కు పంపించాం. ప్రస్తుతం బైడెన్ సర్కార్ కరోనాతో ప్రభావితమైన ఇతర ఆసియా దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది." అని సాకి చెప్పారు.

అలాగే త్వరలోనే ప్రపంచ దేశాలకు 8కోట్ల కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్లు అధ్యక్షుడు బైడెన్ ఇటీవల ప్రకటించారు. ఇందులో 6కోట్ల ఆస్ట్రాజెనెకా టీకా డోసులు ఉంటే.. మిగతా 2కోట్ల టీకా డోసులు ఎఫ్‌డీఏ అనుమతి పొందిన మూడు ఇతర సంస్థలకు చెందినవని సాకి తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ల పంపిణీ చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ టీకా డోసులను యూఎస్ ప్రపంచ దేశాలకు ఎలా పంపిణీ చేయాలనే విషయాన్ని నిర్ణయించడానికి జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్, విదేశాంగ శాఖ సంయుక్తంగా చర్చిస్తున్నట్లు సాకి తెలియజేశారు.

ఇదిలా ఉంటే.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత్‌కు.. బైడెన్ ప్రభుత్వం చేదోడుగా నిలవాలని యూఎస్ మానవ హక్కుల కార్యకర్త రీవ్ జెస్సీ జాక్సన్ కోరారు. ప్రపంచ దేశాలకు పంపిణీ చేస్తామన్న 8కోట్ల టీకా డోసుల్లో భారత్‌కు 6కోట్ల టీకా డోసులు కేటాయించాలని అధ్యక్షుడు బైడెన్‌ను జాక్సన్ కోరారు. ఆయనకు ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మద్దతు తెలిపారు.