Corona Crisisలో భారత్‌కు సాయపడటం యూఎస్ నైతిక బాధ్యత: ప్రమీలా
ABN , First Publish Date - 2021-05-08T16:42:01+05:30 IST
కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సాయం చేయడం అమెరికా నైతిక బాధ్యత అని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు.

వాషింగ్టన్: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సాయం చేయడం అమెరికా నైతిక బాధ్యత అని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న విషాదకర పరిస్థితులపై ఈ సందర్భంగా ప్రమీలా ఆందోళన వ్యక్తం చేశారు. "ప్రస్తుతం భారత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా ఆస్పత్రుల్లో రోగులకు బెడ్స్ దొరకని దయనీయ పరిస్థితి. దీనికితోడు ప్రాణవాయువు కొరత ఉంది. వైద్యులు వచ్చి చూసేలోపే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంక్షోభ సమయంలో భారత్‌కు మన సాయం కావాలి. భారత్‌కు సాయం అందించడం కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కృషి చేయడం అమెరికా నైతిక బాధ్యత." అని ప్రమీలా అన్నారు.
అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధుతో గురువారం వర్చువల్ సమావేశం సందర్భంగా ఆమె భారత పరిస్థితిపై మాట్లాడారు. అనంతరం భారతీయ అమెరికన్ కమ్యూనిటీకి చెందిన అడ్వొకేట్స్, స్థానిక నేతలు, నివాసితులతో భేటీ అయిన ప్రమీలా.. బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌ను ఈ సమయంలో భారత్‌ను అన్ని విధాల అండగా ఉండాలని కోరినట్లు తెలిపారు. దాంతో భారత్‌కు టీకాల తయారీకి ముడిపదార్థాల పంపిణీ, టీకాల పంపిణీ సహా వ్యాక్సిన్ల పేటేంట్ రద్దుపై బైడెన్ సర్కార్ సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు.
ఇక టీకాలు అందుబాటులో అసమానతలు ఏర్పడుతున్న నేపథ్యంలో యూఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇండియాకు ఎంతో ఉపయోగకరమని ప్రమీలా పేర్కొన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా టీకాల అందుబాటు.. ధనిక దేశాల్లో 80 శాతం ఉండగా, పేద దేశాల్లో కేవలం 0.3 శాతమే ఉందన్నారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె తల్లిదండ్రులను పరామర్శించేందుకు ప్రమీలా భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా ప్రతినిధుల సభలో మొదటి, ఏకైక భారతీయ అమెరికన్ కూడా ప్రమీలా జయపాల్ మాత్రమే.