130 దేశాలకు ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా చేరలేదు: ఐక్యరాజ్యసమితి

ABN , First Publish Date - 2021-02-18T19:01:06+05:30 IST

కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ న్యాయంగా జరగడం లేదంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జెనరల్ ఆంటోనియో గెటెర్రెస్

130 దేశాలకు ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా చేరలేదు: ఐక్యరాజ్యసమితి

న్యూయార్క్: కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ న్యాయంగా జరగడం లేదంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జెనరల్ ఆంటోనియో గెటెర్రెస్ విమర్శించారు. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ హైలెవల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. 130 దేశాలకు ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ డోస్ కూడా చేరలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తయారైన మొత్తం వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్లు కేవలం పది దేశాలే ఉపయోగించుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ విషయంలో సమాన పంపిణీ అన్నది ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచ సమాజం ముందు ఉన్న నైతిక పరీక్ష అని ఆయన అన్నారు. 


ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ జరిగేలా ‘గ్లోబల్ వ్యాక్సినేషన్ ప్లాన్’ను తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మరోపక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సైతం ఇప్పటికే అనేక సార్లు వ్యాక్సిన్ పంపిణీపై ఆవేదన వ్యక్తం చేసింది. ధనిక దేశాలు ‘వ్యాక్సిన్ ముందుగా మా దేశానికే’ అన్న ధోరణిలో వెళ్తున్నాయని అన్నారు. ధనిక దేశాలు వ్యాక్సిన్ డోస్‌లను అన్ని దేశాలకు సమానంగా పంచాలని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ కోరారు.

Updated Date - 2021-02-18T19:01:06+05:30 IST