నీరవ్ మోదీ అప్పగింతపై బ్రిటన్ కోర్టు సంచలన తీర్పు!

ABN , First Publish Date - 2021-02-26T13:08:33+05:30 IST

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును 11, 500 కోట్ల రూపాయల మేర మోసగించి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని ఇక భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌లోని ఓ కోర్టు తీర్పిచ్చింది.

నీరవ్ మోదీ అప్పగింతపై బ్రిటన్ కోర్టు సంచలన తీర్పు!

ఆయన అక్రమాల వ్యాపారే.. భారత్‌లో న్యాయం జరగదన్న వాదనలో పసలేదు

రాజకీయ ఒత్తిళ్లు నిజం కాదు: బ్రిటన్‌ కోర్టు 

కట్జూ వాంగ్మూలం దిగ్ర్భాంతికరం: జడ్జి

అప్పీలుకు వెళ్లనున్న నీరవ్‌ 

కొన్ని నెలల తర్వాతే భారత్‌కు?

తీర్పు అనంతరం రాజకీయ దుమారం

లండన్‌, ఫిబ్రవరి 25: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును 11,500 కోట్ల రూపాయల మేర మోసగించి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీని ఇక భారత్‌కు అప్పగించాలని బ్రిటన్‌లోని ఓ కోర్టు తీర్పిచ్చింది. భారీ స్థాయిలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డట్లు ఆయనపై భారత ప్రభుత్వం తరఫున కేసు వేసిన సీబీఐ మోపిన అభియోగాలను తాము విశ్వసిస్తున్నట్లు వెస్ట్‌ మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు పేర్కొంది. భారత్‌లో తనకు న్యాయం జరగదని, దర్యాప్తు సంస్థలు వేటాడతాయని, తన మానసిక ఆరోగ్యమూ బాగులేదని, ఇలా అనేక రీతుల్లో ఈ అభియోగాల నుంచి బయటపడడానికి నీరవ్‌ ప్రయత్నించారు.


అయితే కోర్టు వీటన్నింటినీ తోసిపుచ్చింది. అప్పగించినంత మాత్రాన అన్యాయం జరగదని, ఆయన భారత ప్రభుత్వానికి సమాధానాలివ్వాల్సిన అంశాలున్నాయని, బ్యాంకు అధికారులతో సహా పలువురితో కుమ్మక్కయినట్లు ఆరోపణలున్నాయని, ఆయన చట్టబద్ధంగా వ్యాపారం చేసినట్లు తాము నమ్మడం లేదని, పీఎన్‌బీ ఒక్కటే కాక.. అనేక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని న్యాయమూర్తి శామ్యూల్‌ గూజీ తన తీర్పులో స్పష్టం చేశారు. ‘మీడియా, సోషల్‌ మీడియాలను భారత ప్రభుత్వం వాడుకుని తమపై ఎదురుదాడి చేస్తోందని, మీడియా సంస్థలే స్వయంగా విచారణ జరిపేస్తున్నాయని నీరవ్‌ తరఫు న్యాయవాద బృందం నాకు సాక్ష్యాధారాల పేరిట పుంఖానుపుంఖాలుగా బండిల్స్‌ పంపింది. అన్నీ చూశాను. భారత ప్రభుత్వం రాజకీయ ఒత్తిళ్లకు దిగిందన్న ఆ వాదనల్లో నిజమేదీ   కనిపించలేదు. ఇక భారత సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మార్కండేయ కట్జూను వీడియో లింక్‌ ద్వారా నిరుడు నా ముందు నిలిపారు. 


నీరవ్‌ తరఫు వాదనకు బలం చేకూర్చేలా ఆయన స్థాయి వ్యక్తి మాట్లాడడం దిగ్ర్భాంతి కలిగించింది. ఆయన మాటలు  నమ్మశక్యంగా లేవు. కోర్టులో తనతో పాటు పనిచేసిన కొందరిపై ఆయనకు కొంత అక్కసు ఉన్నట్లుంది. ఆయన అనుచితమైన, అసంగతమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనది వ్యక్తిగత ఎజెండా. ఆ వ్యాఖ్యలకు నేను ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అలాగే రిటైర్డ్‌ జడ్జి అభయ్‌ థిప్సేను కూడా నా ముందు నీరవ్‌ బృందం హాజరుపరిచింది. పదవీ విరమణ చేశాక ఆయన కాంగ్రెస్‌ పార్టీతో మమేకమయ్యారు. ఆయన వాదనా తీసుకోవడం లేదు’’ అని జడ్జి శామ్యూల్‌ పేర్కొన్నారు. 


భారత సంతతి మంత్రిపై బాధ్యత!

ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశాన్ని కోర్టు నీరవ్‌ మోదీకి కల్పించింది. 2003నాటి భారత్‌- బ్రిటన్‌ నేరగాళ్ల అప్పగింత చట్టం ప్రకారం వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు తన తీర్పు కాపీని బ్రిటిష్‌ ప్రభుత్వానికి పంపుతుంది. దేశ హోంశాఖ మంత్రి, భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్‌ దీనిని పరిశీలించి అప్పగింతకు సంబంధించిన గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారు. ఇదంతా రెండు నెలల్లో జరగాలి.  అసాధారణ పరిస్థితుల్లో తప్ప కోర్టు తీర్పుకు భిన్నంగా ప్రభుత్వం వెళ్లదు. ప్రీతి పటేల్‌ నిర్ణయం ఎలాగ ఉన్నా- రెండు వారాల్లోపు నీరవ్‌ మోదీ.. వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లవచ్చు. లండన్‌లోని హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్‌ డివిజన్‌ ఈ అప్పీలును విచారణకు చేపడుతుంది. అక్కడా నీరవ్‌ ఓడిపోతే సుప్రీంకు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌ మాల్యా తరహాలోనే ఆయన తన కేసును సాగదీసే అవకాశం ఉంది. మరోవైపు నీరవ్‌ వ్యవహారంపై కోర్టు తీర్పు రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్‌, శివసేన, ఆర్జేడీ, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌లు బ్రిటన్‌ కోర్టు తీర్పును స్వాగతిస్తూనే- నీరవ్‌ పారిపోవడానికి సాయపడిందెవరో మోదీ ప్రభుత్వం చెప్పాలని కోరాయి.

Updated Date - 2021-02-26T13:08:33+05:30 IST