ఇద్దరు తెలుగు ప్రవాసీలకు అత్యున్నత పురస్కారం

ABN , First Publish Date - 2021-01-14T00:46:26+05:30 IST

హైస్పీడ్ రైళ్ల సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచవ్యాప్తంగా జపాన్‌కు పెట్టింది పేరు. అమెరికా, భారత్‌తో సహా అనేక దేశాలు హైస్పీడ్ రైళ్ల సాంకేతిక సహాయం కోసం ఆ దేశం వైపు చూస్తాయి.

ఇద్దరు తెలుగు ప్రవాసీలకు అత్యున్నత పురస్కారం

మిర్యాల మురళీధర్, జొన్నలగడ్డ సుధాకర్‌కు ప్రవాసీ భారత్ సమ్మాన్‌ పురస్కారం  

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: హైస్పీడ్ రైళ్ల సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచవ్యాప్తంగా జపాన్‌కు పెట్టింది పేరు. అమెరికా, భారత్‌తో సహా అనేక దేశాలు హైస్పీడ్ రైళ్ల సాంకేతిక సహాయం కోసం ఆ దేశం వైపు చూస్తాయి. టోక్యోలో భారత్ సహా అనేక దేశాల ఎంబసీలలో హైస్పీడ్ రైల్వే సాంకేతిక సహాయం కొరకు ప్రత్యేక విభాగాలున్నాయి. అలాంటి దేశంలో హైస్పీడ్ రైళ్ల సాంకేతికలో అత్యంత ప్రతిభవంతులైన శాస్త్రవేత్తలలో ఒకరు మిర్యాల మురళీధర్. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత ప్రతిష్ఠను విదేశాలలో ఇనుమడింపచేసినందుకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారత్ సమ్మాన్‌తో సన్మానించింది.  


ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రవాసీయులు, సామాజిక సంస్ధలు 30 మందికి ఇచ్చే ఈ ఆవార్డు గ్రహీతల్లో ఈ సారి ఇద్దరు తెలుగు ప్రవాసీయలు ఉండగా ఒకరు మురళీధర్ కాగా మరోకరు అమెరికాలో వైద్యునిగా పని చేస్తున్న గుంటూరుకు చెందిన డాక్టర్ జొన్నలగడ్డ సుధాకర్. కోవిడ్ కారణంగా ఈసారి ఆన్ లైన్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ ఇద్దరికి ఈ ఆవార్డులు ప్రధానం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం కర్వేన గ్రామానికి చెందిన మురళీధర్ జడ్చర్లలో డిగ్రీ, హైద్రాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీతో పాటు పీహెచ్‌డీ పూర్తి చేశారు. అనంతరం భౌతిక శాస్త్రంలో ఉన్న పట్టు వల్ల జపాన్‌లోని షిబోరా సాంకేతిక విశ్వవిద్యాలయంలో లేక్చర్‌గా చేరారు. అలాగే ప్రస్తుతం విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షునిగా కూడా వ్యవహారిస్తున్నారు.  


హైస్పీడ్ రైళ్లు నడపడంలో అత్యంత కీలకంగా భావించే అధిక ఉష్ణోగ్రతకు తట్టుకోని పనిచేసే హైస్పీడ్ సూపర్ కండక్టర్లు, దాని కేబుళ్లను రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఓ శాస్త్రవేత్తగా మురళీధర్‌కు గుర్తింపు ఉంది. దీంతో ఇప్పటికే జపాన్ ప్రభుత్వ రైల్ పరిశోధన సంస్ధ కూడా ఉత్తమ పరిశోధక శాస్త్రవేత్తగా సన్మానించింది. ఇక అమెరికాలో 60 వేల మంది భారతీయ డాక్టర్లు సభ్యులుగా భారతీయ సంతతి వైద్యుల సంఘం(ఆపి)కు అధ్యక్షునిగా వ్యవహారిస్తున్న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన డా. జొన్నలగడ్డ సుధాకర్ కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల నుండి పట్టా పొందారు. ఇప్పుడు ఆయన అమెరికాలోని జార్జియాలో స్ధిరపడ్డారు. జీర్ణకోశ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో సుధాకర్ గుర్తింపు పొందారు. అలాగే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో వైద్య సేవలకు సంబంధించి తన వంతుగా అనేక చేయూత కార్యక్రమాలను చేపట్టారు. దీంతో ఈ ఇద్దరు తెలుగు ప్రవాసీయులతో పాటుగా గల్ఫ్ దేశాలలోని ముగ్గురు కేరళకు చెందిన ప్రవాసీయులను కూడా కేంద్రం అత్యున్నత పురస్కారం ప్రవాసీ భారత్ సమ్మాన్‌‌తో సన్మానించింది.

Updated Date - 2021-01-14T00:46:26+05:30 IST