కువైట్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి.. ఇద్దరి అరెస్ట్ !

ABN , First Publish Date - 2021-02-05T14:04:50+05:30 IST

స్వదేశీయుడి అనుమానాస్పద మృతికి సంబంధించి కువైట్ పోలీసులు ఇద్దరు భారతీయ ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు.

కువైట్‌లో భారతీయుడి అనుమానాస్పద మృతి.. ఇద్దరి అరెస్ట్ !

కువైట్ సిటీ: స్వదేశీయుడి అనుమానాస్పద మృతికి సంబంధించి కువైట్ పోలీసులు ఇద్దరు భారతీయ ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కువైట్‌లోని అల్ అహ్మదీ ప్రాంతంలో ఇటీవల ఓ భారత వ్యక్తి తాను నివాసం ఉండే భవనం ఏడో అంతస్తు నుంచి కిందపడి మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు భారతీయుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, అనుమానస్పదమైన ఈ ఘటన వెనుక ఏదైనా నేరపూరిత చర్య ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు భారత ప్రవాసులు నివాసముండే అపార్ట్‌మెంట్ నుంచే వ్యక్తి కిందపడి చనిపోయినట్లు ఆ భవనం సెక్యూరిటీ గార్డులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు అనుమానంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం అసలు ఏం జరిగిందో తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.  

Updated Date - 2021-02-05T14:04:50+05:30 IST