భారత్లో భయంకర పరిస్థితి.. సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం: అమెరికా
ABN , First Publish Date - 2021-04-25T04:34:02+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ స్థితిని తట్టుకునేందుకు భారత్కు చేతనైనంత సాయం ఛేయడానికి ప్రయత్నిస్తున్నామని అమెరికా చెప్పింది.
వాషింగ్టన్: కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారతదేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ స్థితిని తట్టుకునేందుకు భారత్కు చేతనైనంత సాయం ఛేయడానికి ప్రయత్నిస్తున్నామని అమెరికా చెప్పింది. శనివారం మీడియాతో మాట్లాడిన యూఎస్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ డాక్టర్ ఆంథనీ ఫాసీ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకుల ఎగుమతిపై అమెరికాలో విధించిన నిషేధం ఎత్తేయాలని, ఆ సరుకులను భారత్కు అందేలా చూడాలని కొన్ని రోజులుగా అగ్రరాజ్యాన్ని భారతదేశం కోరుతోంది. అయితే వీటిపై అమెరికా వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
ఈ క్రమంలో ఆంథనీ ఫాసీ మాట్లాడుతూ.. ‘‘భారత్లో పరిస్థితి భయంకరంగా ఉంది. మేం చేయగలిగిన సాయం ఛేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ పరిస్థితిని తట్టుకోవాలంటే అక్కడి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ చేయక తప్పదు. అలాగైతేనే ఆ పరిస్థితి నుంచి బయటపడగలిగేది’’ అని ఫాసీ పేర్కొన్నారు.