అమెరికన్ల కోసం పోరాడుతూనే ఉంటా: ట్రంప్
ABN , First Publish Date - 2021-01-21T02:55:20+05:30 IST
అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి ట్రంప్ దాదాపు తప్పుకున్నారు. కొద్ది గంటల క్రితమే ఆయన తన కుటుంబంతో

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి బాధ్యతల నుంచి ట్రంప్ దాదాపు తప్పుకున్నారు. కొద్ది గంటల క్రితమే ఆయన తన కుటుంబంతో కలిసి వైట్‌హౌస్‌ను వీడారు. మాజీ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌ను వీడేందుకు ఆయన విముఖత చూపారు. ఈ కారణంగా ట్రంప్ అధ్యక్షుడి హోదాలోనే వైట్‌హౌస్‌ను వీడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరారు. విమానం ఎక్కే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ‘అమెరికాకు 45వ అధ్యక్షుడిగా పనిచేయడం జీవితకాల గౌరవంగా భావిస్తున్నాను. నేను ఎప్పుటికి మీ కోసం పోరాడుతూనే ఉంటాను. నేను ఎక్కడున్నా అంతా చూస్తూనే, వింటూనే ఉంటాను. గతంలో ఎన్నడూ లేని విధంగా మంచి పరిపాలను నేను అందించానని చెప్పగలను. కొత్త ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు. కొత్త ప్రభుత్వం అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు.
అధ్యక్షుడి హోదాలో చివరిగా ప్రసంగించిన ట్రంప్ జో బైడెన్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. గత శతాబ్ద కాలంగా చూస్తే ఏ ఒక్క అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి కూడా మాజీ అధ్యక్షుడు గైర్హాజరు కాలేదు. కానీ.. ట్రంప్ మాత్రం కనీసం జో బైడెన్ పేరును ప్రస్తావించకుండా, ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరుకాకుండా ఫ్లోరిడాకు వెళ్లిపోయారు. అయితే ఆయన జో బైడెన్ కోసం వైట్‌హౌస్‌లో ఓ లేఖను ఉంచినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.