విదేశీయుల రాకపై Canada కీలక నిర్ణయం.. భారతీయులకు భారీ ఉపశమనం!

ABN , First Publish Date - 2021-11-21T18:51:37+05:30 IST

ఏడాదిన్నరకు పైగా ప్రపంచదేశాలను గజగజ వణికించిన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కాస్తా తగ్గుముఖం పడుతోంది.

విదేశీయుల రాకపై Canada కీలక నిర్ణయం.. భారతీయులకు భారీ ఉపశమనం!

ఒట్టావా: ఏడాదిన్నరకు పైగా ప్రపంచదేశాలను గజగజ వణికించిన మహమ్మారి కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే కాస్తా తగ్గుముఖం పడుతోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా జోరందుకోవడంతో వివిధ దేశాలు ఒక్కొక్కటిగా ప్రయాణాలపై ఆంక్షలను తొలగిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు స్వదేశంలో ఇరుక్కుపోయిన వారితో పాటు విదేశాల నుంచి స్వదేశాలకు రావాలనుకునే వారికి ఉపశమనం లభిస్తోంది. ఇక ఇటీవలే అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు భారతీయుల ఎంట్రీపై ఉన్న నిషేధాన్ని తొలగించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం పొందిన కోవిడ్-19 టీకాలను రెండు డోసులు తీసుకున్న వారికి తమ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తున్నాయి. ఇటీవల భారత్ బయోటెక్ రూపొందించి కోవాగ్జిన్ సైతం డబ్ల్యూహెచ్ఓ ఆమోదం పొందింది. దాంతో ఈ వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికుల ఎంట్రీపై పలు దేశాలు బ్యాన్ తొలగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కెనడా చేరింది. కోవాగ్జిన్ రెండు మోతాదులు వేసుకున్న భారత ప్రయాణికులు ఈ నెల 30వ తేదీ నుంచి కెనడా వచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 


ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన టీకాలు తీసుకున్న ప్రయాణికులను ఈ నెలాఖరు నుంచి తమ దేశంలోకి అనుమతించనున్నట్లు కెనడా వెళ్లడించింది. కోవాగ్జిన్‌తో పాటు సినోఫార్మ్‌, సినోవాక్‌ టీకాలను సైతం కెనడా ఆమోదించింది. ఇప్పటికే ఫైజర్, మొడెర్నా, అస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు వేసుకున్న విదేశీ ప్రయాణికులను కెనడా తమ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే మిశ్రమ డోసులు వేసుకున్న వారిని సైతం తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇస్తామని కెనడా ప్రభుత్వం పేర్కొంది. అయితే, కెనడాకు వచ్చే 14 రోజుల ముందు వ్యాక్సినేషన్ పూర్తయ్యి ఉండాలని అధికారులు తెలియజేశారు. ఇక కోవాగ్జిన్‌ను గుర్తిస్తూ కెనడా తీసుకున్న తాజా నిర్ణయంతో భారత ప్రయాణికులకు భారీ ఉమశమనం లభించింది. ఇదిలాఉంటే.. కెనడాలో ఇప్పటివరకు 17.62లక్షల మందికి కరోనా సోకగా.. ఇందులో 29,481 మంది మరణించారు.    


Updated Date - 2021-11-21T18:51:37+05:30 IST