జూలో పులిని కాల్చి చంపిన అధికారులు..! కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-01T02:23:34+05:30 IST

: జూలో బోనులు శుభ్రం చేసే వ్యక్తిపై దాడి చేసిన పులిని జూ సిబ్బంది కాల్చి చంపేశారు.

జూలో పులిని కాల్చి చంపిన అధికారులు..! కారణం ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: జూలో బోనులు శుభ్రం చేసే వ్యక్తిపై దాడి చేసిన పులిని జూ సిబ్బంది కాల్చి చంపేశారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల నేపల్స్ జూపార్క్‌లో ఈ ఘటన జరిగింది. బుధవారం నాడు బాధితుడు రివర్ రోసెన్‌క్వెస్ట్‌ పులి బోను వద్ద శుభ్రం చేస్తుండగా..లోపల ఉన్న పులి అతడి చేయి నోట కరిచింది. చేయిని ఎంతకీ వదలకపోవడంతో అతడు కంగారు పడిపోయి ఎమర్జెన్సీ అధికారులకు ఫోన్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు అతడిని కాపాడే ప్రయత్నంలో భాగంగా పులిని కాల్చి చంపేశారు. అయితే.. పులి బోను సమీపంలోకి అతడు ఎందుకు వెళ్లాడనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అతడు పులిని తాకే ప్రయత్నం చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. బాధితుడు మాత్రం తాను అటువంటి చర్యలేవీ చేయలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రివర్ క్రమంగా కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ ఘటన తరువాత అధికారులు ఒక రోజు పాటు జూపార్క్‌ను మూసేశారు. 

Updated Date - 2022-01-01T02:23:34+05:30 IST