ఇకపై Kuwait బీచుల్లో అలా చేస్తే రూ. 25లక్షల జరిమానా!

ABN , First Publish Date - 2021-10-21T14:02:01+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ పర్యావరణ, సముద్ర, తీర, అందులోని జీవుల పరిరక్షణతో పాటు దేశ సౌందర్యాన్ని కాపాడటానికి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇకపై Kuwait బీచుల్లో అలా చేస్తే రూ. 25లక్షల జరిమానా!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ పర్యావరణ, సముద్ర, తీర, అందులోని జీవుల పరిరక్షణతో పాటు దేశ సౌందర్యాన్ని కాపాడటానికి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సందర్శకులతో పాటు చుట్టు పక్కల ఉండేవారు ఇష్టానుసారంగా చెత్తచెదారాలను బీచుల్లో పడేస్తుండడంతో సముద్ర జలాల కాలుష్యం, పర్యావరణ సమతుల్యతకు భంగం వాటిల్లుతున్న నేపథ్యంలో ఈ చర్యపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఇకపై బీచుల్లో చెత్త లేదా వ్యర్థాలను వేసే వారికి 10వేల కువైటీ దీనార్ల(సుమారు రూ.25లక్షలు) భారీ జరిమానా విధించనున్నట్టు పర్యావరణ పరిరక్షణపై ఏర్పాటైన ప్రత్యేక బృందం వెల్లడించింది. ఈ బృందం ప్రత్యేకంగా పర్యావరణ ఉల్లంఘనలను పర్యవేక్షిస్తుంది. అలాగే ఉల్లంఘించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది. 


చట్ట ప్రకారం పబ్లిక్ బీచ్‌లు లేదా కువైత్ దీవులలో చెత్త లేదా వ్యర్థాలను వేసే ఎవరికైనా పది వేల దీనార్ల కంటే ఎక్కువ జరిమానా విధించబడుతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. డ్రిల్లింగ్ లేదా ఇతర పనుల నుండి ఏదైనా వ్యర్థాలను సముద్రం లేదా తీర ప్రాంతంలో వేయడం కూడా నిషేధించబడిందని వారు తెలియజేశారు. పర్యావరణ పోలీసులు ప్రాతినిధ్యం వహిస్తున్న పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ 2014 నాటి పర్యావరణ పరిరక్షణ చట్టం నెం. 42, 2015లోని చట్టం నెం.99 ద్వారా దాని నిబంధనలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాన్ని పాటించాలని, కువైత్ బీచ్‌లు లేదా ద్వీపాలలో లేదా సముద్రంలోకి ఎలాంటి వ్యర్థాలను వేయవద్దని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-10-21T14:02:01+05:30 IST