9ఏళ్లుగా Saudi లో ఉంటున్న తెలుగు వ్యక్తి.. రెసిడెన్సీ రూల్ ఉల్లంఘనతో బహిష్కరణ కేంద్రానికి.. చివరికి విషాదాంతం!

ABN , First Publish Date - 2021-12-08T15:31:38+05:30 IST

సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్లుగా సౌదీలో ఉంటున్న ఓ తెలుగు వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.

9ఏళ్లుగా Saudi లో ఉంటున్న తెలుగు వ్యక్తి.. రెసిడెన్సీ రూల్ ఉల్లంఘనతో బహిష్కరణ కేంద్రానికి.. చివరికి విషాదాంతం!

దమ్మామ్: సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్లుగా సౌదీలో ఉంటున్న ఓ తెలుగు వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఇటీవల రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించిన సౌదీ పోలీసులు అతడ్ని దమ్మామ్‌లోని బహిష్కరణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి భారత్‌కు పంపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బహిష్కరణ కేంద్రంలోనే డిసెంబర్ 4న గుండెపోటు రావడంతో అతడు చనిపోయాడు. మృతుడిని తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన బండపల్లి మల్లేశం(51)గా పోలీసులు గుర్తించారు. 


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత వారం సౌదీ పోలీసులు నిర్వహించిన సాధారణ తనిఖీల్లో మల్లేశం రెసిడెన్సీ అనుమతులను ఉల్లంఘించినట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. మల్లేశం తన యజమాని నుంచి పారిపోయి బయట చిన్నచిన్న పనులు చేస్తూ సౌదీలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేగాక అతని వీసా గడువు కూడా ముగిసింది. దాంతో మల్లేశంను అరెస్ట్ చేసిన పోలీసులు దమ్మామ్‌లోని బహిష్కరణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి భారత్‌కు పంపించాలని సౌదీ పోలీసులు నిర్ణయించారు. కానీ, డిసెంబర్ 4న గుండెపోటుకు గురైన మల్లేశం ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 


కాగా, మల్లేశం గత తొమ్మిదేళ్లుగా సౌదీలో ఉపాధి పొందుతున్నాడు. అలా వచ్చిన సంపాదనతో స్వస్థలం జగిత్యాలలో కొంత పోలం కొన్నాడు. అలాగే కూతురిని ఓ ఎన్నారైకి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించాడు. చివరకు రెసిడెన్సీ ఉల్లంఘనల నేపథ్యంలో పట్టుబడిన మల్లేశం జీవితం  బహిష్కరణ కేంద్రంలో విషాదాంతంగా ముగిసింది. మల్లేశం మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సామాజిక కార్యకర్త నాస్ వక్కం సౌకత్ అలీ భారత ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మల్లేశం మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  

  

Updated Date - 2021-12-08T15:31:38+05:30 IST