తానా ప్రపంచ సాహిత్య వేదిక తారలు – రాతలు
ABN , First Publish Date - 2021-02-01T16:18:57+05:30 IST
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన తొమ్మిదవ అంతర్జాతీయ ఆన్‌లైన్ సాహిత్య కార్యక్రమం ఆదివారం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది.

వాషింగ్టన్: తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన తొమ్మిదవ అంతర్జాతీయ ఆన్‌లైన్ సాహిత్య కార్యక్రమం ఆదివారం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈ సమావేశంలో “తారలు – రాతలు” అనే అంశంపై సినీ తారలుగా వెలుగొందుతూ మంచి సాహిత్యాన్ని సృష్టించిన నటులు తనికెళ్ళ భరణి, డా. అక్కినేని నాగేశ్వర రావు, డా. పి. భానుమతి, డా. కొంగర జగ్గయ్య, డా. గొల్లపూడి మారుతి రావు రచనలను తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో విశిష్ట అతిధులు ఎన్నో విషయాలను పంచుకున్నారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన ప్రారంభోపన్యాసంలో ఇది ఒక వినూత్న, విశిష్ట కార్యక్రమమని చెప్పారు. సినిమా నటులుగా అందరికి పరిచయమైన వారి రచనలను సాహిత్య సమాలోచన జరపడం సముచితంగా ఉందన్నారు.
వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ అగ్రశ్రేణి తారలైన వారిలో కొంతమంది నటులుగా రాణిస్తూనే తమ రచన వ్యాసాంగాన్ని కొనసాగించడం, ఇప్పుడు దాన్ని చర్చించడం హర్షనీయమన్నారు. ప్రముఖ నాటక, కథ, సంభాషణల రచయిత, సినీ నటుడు, దర్శకుడైన తనికెళ్ళ భరణి తాను విద్యార్ధి దశలో రాసిన “అద్దె కొంప”, ఆ తర్వాతి కాలంలో రాసిన “గోగ్రహణం”, “కోక్కరోకో”, “గార్ధ భాండం”, “చల్‌చల్ గుర్రం”, “జంబు ద్వీపం”, “గొయ్యి” మొదలైన నాటికలు రాసిన నేపథ్యాన్ని కొనియాడారు. అలాగే ‘నక్షత్ర దర్శనం’, ‘పరికిణి’,‘ఎందరో మహానుభావులు’ మొదలైన రచనలు ‘శభాష్ రా శంకరా’, ‘ఆటగదరా శివ’ లాంటి రచనల్లోంచి కొన్ని పద్యాలు పాడి అందరినీ పరవశింప చేశారు.
పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు రాసిన ‘అక్కినేని ఆలోచనలు’, ‘మనసులో మాట’ మొదలైన రచనల గురించి దాశరథి, సినారె లాంటి సాహితివేత్తలతో ఆయనకున్న సాహిత్యానుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, ఆయన సాహితీ ప్రస్థానాన్ని, అక్కినేని గారి ఆత్మీయ సోదరిగా అభిమానం సంపాదించుకున్న డా. కె.వి కృష్ణ కుమారి సోదాహరణంగా వివరించారు. డా. పి. భానుమతి రాసిన ‘అత్తగారి కథలు’, ‘భానుమతి కథలు’, ‘నాలో నేను’ అనే తన ఆత్మ కథలోని విశేషాలు, చక్రపాణితో ఆమెకున్న సాహిత్యానుబంధం, సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం లాంటి ఎన్నో విశేషాలను డా. భానుమతితో పాతికేళ్ళ అనుబంధం ఉన్న ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శారదా అశోకవర్ధన్ ఎన్నో విశేషాలను ఆసక్తికరంగా పంచుకున్నారు.
కళావాచస్పతి డా. కొంగర జగ్గయ్య విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కొన్ని రచనలను ‘రవీంద్రగీత’ గా రాసిన తీరు, ‘మనస్విని’ అనే సాహితీ సంస్థ ద్వారా ఆచార్య ఆత్రేయ రచించిన సినీ గీతాలను ఏడు సంపుటాలుగా ప్రచురించడం, ఎన్నో సాహిత్య సమావేశాలను నిర్వహించడం, డా. జగయ్యతో తనకున్న ఎన్నో ఏళ్ల సాహిత్యనుబంధాన్నిప్రఖ్యాత కవి, రచయిత శ్రీ రసరాజు ఎంతో ఆత్మీయంగా, రసరమ్యంగా పంచుకున్నారు.
డా. గొల్లపూడి మారుతీ రావు ఎంతో విస్తారంగా సృష్టించిన నాటికలు, నాటకాలు, నవలలు, కథా సంపుటాలు, రచనలపై ప్రముఖ కవి, కౌముది అంతర్జాల మాస పత్రిక వ్యవస్థాపకులు కిరణ్ ప్రభ లోతైన సమగ్ర సాహిత్య విశ్లేషణ చేశారు. ముఖ్యంగా డా. గొల్లపూడి రాసిన “సాయంకాలం అయింది” నవల, ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా”, “జీవన కాలమ్స్”, ఆయన విశిష్ట రచనా శైలి, కౌముది మాస పత్రికతో డా. గొల్లపూడికి ఉన్న సుదీర్ఘ సాహిత్యనుబంధాన్ని చక్కగా వివరించారు. డా. అక్కినేని నాగేశ్వరరావు, తనికెళ్ళ భరణి, డా. గొల్లపూడి గార్లతో తనకున్న ప్రత్యేక ఆత్మీయ అనుభందం, ఎన్నోసార్లు కలిసి గడిపిన మధుర సంఘటనలను డా. ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకుని అది ఒక అరుదైన సువర్ణ అవకాశం అని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.