సంక్రాంతి సందర్భంగా కర్నూలులో తానా చీరల పంపిణీ

ABN , First Publish Date - 2021-01-13T03:11:37+05:30 IST

సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా కర్నూలులో చీరలు పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో తానా స్త్రీ శక్తి భవనంలో 100 మంది మహిళలకు తానా ప్రధాన కార్యదర్శి

సంక్రాంతి సందర్భంగా కర్నూలులో తానా చీరల పంపిణీ

కర్నూలు: సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా కర్నూలులో చీరలు పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో తానా స్త్రీ శక్తి భవనంలో 100 మంది మహిళలకు తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి సహకారంతో తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ దేవినేని లక్ష్మి, కో ఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ చేతుల మీదగా చీరలు, చేతి సంచులను పంపిణీ చేశారు. 


ఈ సందర్భంగా దేవినేని లక్ష్మి మాట్లాడుతూ.. సరిగ్గా రెండేళ్ల కిందట తానా స్త్రీ శక్తి భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యానని అన్నారు. డీఐజీ ఆకే రవికృష్ణ, తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల కప్పట్రాళ్ల గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తూ రాష్ట్రంలోనే అందరికీ మార్గదర్శకంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని తానా సహాయ సహకారాలు ఎప్పుడూ గ్రామానికి ఉంటాయని తెలిపారు. 


తానా అధ్యక్షుడు జై తాళ్ళూరి, సోషల్ రెస్పాన్సిబిలిటీ చైర్మన్ రామ్ చౌదరి ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల ద్వారా నిరాశ్రయులకు, వృద్దులకు, మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సహాయం అందించినట్లు చెప్పారు. కో - ఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ మాట్లాడుతూ.. తానా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకునే కప్పట్రాళ్ల సంబరాలు ఈ సంవత్సరం కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా జరపడం లేదని అన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే కప్పట్రాళ్లలో రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కప్పట్రాళ్లకు చెందిన షహీన్ అనే విద్యార్థినిని ఇంటర్మీడియట్ వరకు పొట్లూరి రవి చదివించారని, మంచి కాలేజీలో డిగ్రీ పూర్తి చేయడానికి కూడా పొట్లూరి రవి పూర్తి సహకారం అందిస్తారని  తెలిపారు. ఈ కార్యక్రమంలో అమిత్, మధు, నారాయణ, మీనాక్షి ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T03:11:37+05:30 IST