ఒకప్పుడు ఎడారి దిబ్బ.. ఇప్పుడు ధగ ధగల దుబాయ్.. ఏమీ దొరకని ఎడారి దేశం స్వర్గసీమలా మారింది!
ABN , First Publish Date - 2021-11-28T15:17:07+05:30 IST
నిప్పులు కక్కే ఎండలు.. వెతికినా దొరకని నీటి జాడలు... ఒంటెల బారులు మినహా ఏమీ కానరాని ఎడారులు... ఇదీ ఒకప్పటి దుబాయ్.. ఇంతటి నిరాశాపూరిత పరిస్థితులనూ తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆయిల్ నిల్వలను సద్వినియోగం చేసుకుని అద్భుతాలు ఆవిష్కరించారు. నిర్జీవమైన దేశానికి ఇంధనంతో ప్రాణవాయువులు ఊది.. ధగ ధగల దుబాయిని తీర్చిదిద్దారు.

నిప్పులు కక్కే ఎండలు.. వెతికినా దొరకని నీటి జాడలు... ఒంటెల బారులు మినహా ఏమీ కానరాని ఎడారులు... ఇదీ ఒకప్పటి దుబాయ్.. ఇంతటి నిరాశాపూరిత పరిస్థితులనూ తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆయిల్ నిల్వలను సద్వినియోగం చేసుకుని అద్భుతాలు ఆవిష్కరించారు. నిర్జీవమైన దేశానికి ఇంధనంతో ప్రాణవాయువులు ఊది.. ధగ ధగల దుబాయిని తీర్చిదిద్దారు. ఏమీ దొరకని ఎడారి దేశాన్ని స్వర్గసీమలా మార్చారు. పర్యాటకానికి గమ్యస్థానంగా మార్చారు. వ్యాపార, వినోద, పర్యాటక రంగాల్లో తిరుగు లేని శక్తిగా తీర్చిదిద్దారు. తమ సంప్రదాయ ఆచార వ్యవహారాలకు అగ్రతాంబూలం ఇస్తూనే విదేశీ సంస్కృతులను అక్కున చేర్చుకున్నారు. తమ దేశాన్ని ఉపాధి కల్పతరువుగా ఆవిష్కరించారు...
అటువంటి దుబాయ్‌కి వెళ్లి అక్కడ పరిస్థితులను ప్రత్యక్షంగా తిలకించే అవకాశం దక్కింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి ప్రయాణ సమయం 3 గంటల 40 నిమిషాలు. దుబాయ్ గురించి విన్న రిచ్‌నెస్ అక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలోనే కనిపించింది. కరోనా సమయం కావడంతో ఎయిర్‌పోర్టులోనే కొవిడ్ టెస్టు చేయించుకోవాలి. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కావాలి. ఈ తతంగమంతా కేవలం 10 నిమిషాల్లో ముగిసిందంటే.. అక్కడి ఏర్పాట్ల గురించి ఊహించుకోవచ్చు. విమానాశ్రయంలోని ఏ కౌంటర్ వద్దా ఇద్దరు నిలబడే అవసరం రానంత వేగంగా సిబ్బంది పని చేస్తున్నారు. కరోనా పరీక్ష చేయడం కూడా పది నిమిషాల్లో ముగిసింది. అక్కడి నుంచి నా ప్రయాణం అల్‌సీఫ్‌లోని హిల్టన్ గ్రూప్‌కి చెందిన గ్రాండ్ కెనపీ హోటల్‌కి సాగింది. మధ్యలో క్యాబ్ డ్రైవర్ జావేద్‌తో మాట కలపగా కడప జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి వచ్చిన వ్యక్తి అని తెలిసింది. 20 నిమిషాల ప్రయాణంలో మక్తూం బ్రిడ్జి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ గురించి జావేద్ వివరించాడు. దుబాయ్ వస్తే కరెన్సీని డాలర్లలో తెచ్చుకుంటే ఎక్కువ ఉపయోగమని చెప్పాడు. 10 నెలలు దుబాయ్‌లో పనిచేసి 2 నెలలు ఇండియాకు వస్తానని చెప్పాడు. ఎయిర్‌పోర్టులో చేసిన కరోనా పరీక్ష రిపోర్టు వచ్చే వరకూ హోటల్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో రిపోర్టు నెగటివ్ రావడంతో బయటకు వెళ్లేందుకు అనుమతి లభించింది.
కొత్తగా పాత వీధులు
హోటల్ నుంచి బగ్గీలో దుబాయ్ క్రీక్‌ని చుట్టి వచ్చాం. అక్కడ అన్నీ కొత్తగానే నిర్మించినప్పటికీ పురాతనంగా కనిపించేలా తీర్చిదిద్దారు. బస చేసేందుకున్న హోటల్స్ కూడా అలాగే ఉన్నాయి. పాతకాలం నాటి స్విచ్‌బోర్డులు, లాంతర్లతో ఉన్న ఆ గదులను చూస్తుంటే మనం కూడా పాత కాలానికి వెళ్లిపోతాం. అబ్రార్ బోట్ రైడ్ ఒక అద్భుతమైన ఆనందాన్నిచ్చింది. రాత్రివేళ నదిలో బోట్ రైడ్ చేస్తూ విద్యుత్ కాంతులీనుతున్న దుబాయ్‌ని చూడడం అనిర్వచనీయ అనుభూతి. ప్రసిద్ధి చెందిన గోల్డ్ సూక్ (సూక్ అంటే మార్కెట్), స్పైస్ సూక్‌కి వెళ్లాం. ముఖ్యంగా అక్కడ అమ్మే స్పైస్ (సుగంధ ద్రవ్యాల్లో)లో అత్యధికం ఇండియా నుంచి వచ్చినవే కావడం విశేషం. ఇండియా నుంచి వెళ్లిన వారు గోల్డ్ సూక్‌ను సందర్శించ కుండా రారంటే అతిశయోక్తి కాదేమో. బంగారు దుకాణాల మధ్యగా నడక సాగింది. అక్కడి నుంచి డిన్నర్ కోసం షుక్‌మీ రెస్టారెంట్‌కి వెళ్లాం. సీఫుడ్‌కి పెట్టింది పేరైన ఆ హోటల్‌లో ప్రధాన చెఫ్ దాకర సారథి, మన తెలుగు వాడే. పశ్చిమగోదావరి జిల్లా పెరవలికి చెందిన ఆయన మాతోపాటే కూర్చొని అక్కడి వంటకాలు.. వాటి విశిష్టతను వివరించారు. వాళ్లు వండే రొయ్యలు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తాయని చెప్పారు. నాన్‌వెజ్ ప్రియులకు మాత్రం అక్కడ భోజనం పండగే.
అట్లాంటిస్.. మరో ప్రపంచం
దుబాయ్‌లో మరో అద్భుతం.. అట్లాంటిస్ రిసార్ట్. పామ్ జుమెరాలోని ఈ రిసార్ట్ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్క్‌లలో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న అతి పెద్ద ఆక్వేరియంలో దాదాపు 65 వేల జలచరాలు ఉన్నాయని చెబితే అద్భుతమనిపించింది. వాటర్‌పార్క్‌లోని వాటర్ గేమ్స్ చూస్తే పెద్ద వాళ్లు కూడా చిన్నపిల్లలై పోవాల్సిందే. ఒక రోజు మొత్తం అక్కడే గడిపేయొచ్చు. డాల్ఫిన్ బేలో దిగి వాటితో ఆటలాడుతుంటే అవి మనుషులతో ఎంత స్నేహపూరితంగా ఉంటాయో అర్థమయింది.
ఠీవిగా నిలబడిన దుబాయ్ ఫ్రేం
దుబాయ్ అనగానే అందరికీ బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ గుర్తుకొస్తాయి. కానీ, దుబాయ్‌లో నన్ను బాగా ఆకట్టుకున్నది దుబాయ్ ఫ్రేం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేంగా గుర్తింపు పొందిన దీనిని చూస్తే దుబాయ్ వైవిధ్యం అర్థమైపోతుంది. దీనిని ఎలా నిర్మించారంటే... దీనిపై నుంచి ఒకవైపు చూస్తే సంప్రదాయ భవంతులతో పాత దుబాయ్ కనిపిస్తే.. మరోవైపు.. ఆకాశాన్ని తాకే భారీ భవంతులు, ఫ్లై ఓవర్లతో న్యూ దుబాయ్ కళ్లముందు కనిపిస్తుంది. దాదాపు 150 మీటర్ల ఎత్తున్న ఈ ఫ్రేం పైభాగం నుంచి మొత్తం దుబాయ్ కనిపిస్తుంది. 150 మీటర్ల ఎత్తులో అద్దం మీద నడుస్తుంటే గాలిలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఎడారిలో అద్భుతం గ్రీన్ ప్లానెట్
అసలే ఎడారి ప్రాంతం.. చెమటలు కక్కించే వేడి.. ఏసీ లేకపోతే క్షణం కూడా ఉండలేని పరిస్థితి. అటువంటి ప్రదేశంలో పక్షుల కిలకిలా రావాలు.. ఆకుపచ్చని మొక్కలు కనిపిస్తే.. నిజంగా అద్భుతమే. అటువంటి అద్భుతమే గ్రీన్‌ప్లానెట్. ఒక భారీ వృక్షాన్ని పెంచి దాని చుట్టూ మూడంతస్థుల భవంతి నిర్మించారు. ప్రతి ఫ్లోర్‌లోనూ నీటి సదుపాయం కల్పించి పలు రకాల పక్షి జాతులను సంరక్షిస్తున్నారు. దానిని చూస్తే ఎమరాటీల (దుబాయ్ ప్రజలను ఎమరాటీలు అంటారు) పట్టుదల ఏమిటో అర్థమవుతుంది.
లాజవాబ్.. లాపెరెల్లే
లాపెరెల్లెలో ఒక థీమ్ షో ఉంటుంది. దానిని చూడడానికి వెళ్లాలి అంటే.. ఽథీమ్ షో ఏం చూస్తాం అని పెదవి విరిచేశా. కానీ అందరూ పట్టుబట్టడంతో అయిష్టంగానే వెళ్లా. ఆ షో చూసిన తర్వాత అక్కడికి వెళ్లకుంటే ఒక అద్భుతాన్ని మిస్ అయిపోయేవాడిని. ఇద్దరు లవర్స్, ఒక చిన్నారి కాన్సెప్ట్ తీసుకుని నీటిలోనూ, గాలిలోనూ, నేల మీద సుమారు 50మంది చేసిన విన్యాసాలు చూస్తే అద్భుతం అనకుండా ఉండలేం. ఈ షో నిడివి 90 నిమిషాలు. వారు చేసే విన్యాసాలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచింది. గంటన్నర సమయం ఒక క్షణంలా గడిచిపోయింది. దుబాయ్ వెళ్లిన వారెవరైనా సరే ఈ షో చూసి రావాల్సిందే. ఈ దేశంలో మరో అద్భుతం దుబాయ్ మాల్.. అందులోని అన్ని షాపులనూ చూసి రావాలంటే ఒక రోజు కూడా సరిపోదు.

దుబాయ్‌కే తలమానికంగా ఎక్స్‌పో
దుబాయ్ ఎక్స్‌పో... అదొక ప్రపంచం. దాదాపు 192 దేశాల కలయిక ఈ మెగా ఈవెంట్. అందుకే దుబాయ్ ప్రభుత్వం అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని భారీ ఏర్పాట్లు చేసింది. ఆపర్చునిటీ, మొబిలిటీ, సస్టెయిన్‌బిలిటీ థీమ్‌తో పలు దేశాలు ఏర్పాటు చేసిన పెవిలియన్లను మాత్రమే సందర్శిస్తుంటే ఆయా దేశాల విజన్ ఎలా ఉందో అర్థమైంది. ఒక రోజు మొత్తం తిరిగితే ఏడెనిమిది దేశాల పెవిలియన్లను చూడొచ్చు. మాకున్న తక్కువ సమయంలో ఇండియా, జర్మనీ, సౌదీ దేశాల పెవిలియన్లను మాత్రమే చూసే అవకాశం కలిగింది. ఇండియా పెవిలియన్‌లో మేకిన్ ఇండియా, మన కల్చర్, యోగా, వంటి వాటిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఎక్స్‌పో పూర్తయినా ఇండియా పెవిలియన్‌ని అలాగే కొనసాగి స్తారని అక్కడి అధికారులు చెప్పారు.ఎక్స్‌పోలో ఉన్న మరో ప్రత్యేక ఆకర్షణ రూఫ్ గార్డెన్. మనం నిలబడిన ప్రదేశం మొత్తం పైకి వెళ్తుంటే మనతోపాటు భూమి కూడా ఆకాశం లోకి వచ్చేస్తోందా అన్న అనుభూతి కలిగింది.
టూరిజంపై ప్రత్యేక దృష్టి
అరబ్ దేశాలు సంపన్నంగా మారడానికి ప్రధాన కారణం పెట్రోల్ బావులు. అయితే, అవి ఉన్నాయనే భరోసాతో దుబాయ్ అక్కడే ఆగిపోలేదు. పెట్రోలియం నిల్వలు తరిగిపోతే ఏమిటనే ఆలోచన చేసి పర్యాటకంపై దృష్టి పెట్టారు. ప్రపంచంలోనే నంబర్ వన్ టూరిస్టు ప్లేస్‌గా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నారు, మరోవైపు కార్పొరేట్ రంగాన్ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా రాయితీలను కల్పించడంతో ఎన్నో కార్పొరేట్ కంపెనీలు దుబాయ్ కేంద్రంగా తమ కార్య కలాపాలను సాగిస్తున్నాయి. ఈ ఎడారి దేశంలో తాగునీటిని పొదుపుగా వాడాల్సిందే. హోటళ్లలోనూ ఉచితంగా ఇవ్వరు. బాటిళ్లను కొనుక్కోవాల్సిందే. మౌలిక సదుపాయాల కల్పనలో దుబాయ్ ముందుంది. ముఖ్యంగా రోడ్లపై ఎక్కడా ఒక్క చిన్న గుంత కూడా కనిపించదు. మనం వెళ్లే వేగానికి తగ్గట్లు లేన్లు మారాల్సి ఉంటుంది. దుబాయ్‌లో అందరూ అక్కడి ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు. భారీ జరిమానాలు గుర్తుకొస్తే రూల్స్ బ్రేక్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికీ రాదు.
మెగా ఈవెంట్లకు వేదిక
ఇండియా నుంచి కూతవేటు దూరంలోనే దుబాయ్ ఉండడంతో మన సెలబ్రిటీలకు అదొక విడిది కేంద్రంగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రముఖులు పార్టీలను దుబాయ్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. అంతెందుకు తెలుగు సినిమాకు సంబంధించి పలు అవార్డు ఫంక్షన్లకు కూడా దుబాయ్ వేదికైంది. ఇక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉండడం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. చుట్టుపక్కల దేశాలతోపాటు ఐరోపా దేశాలకు కూడా ఇదొక ఆటవిడుపు కేంద్రంగా మారింది.
ప్రకృతి సవాళ్లను దాటుకుంటూ 50 ఏళ్ల స్వల్పకాలంలోనే దుబాయ్ అద్భుతంగా ఎదిగింది. అసాధ్యమనే పదాన్ని కలలో కూడా వినడానికి ఇష్టపడని ఎమరాటీల పట్టుదల, సంకల్పం కారణంగా ప్రపంచదేశాల సరసన ఠీవీగా నిలబడింది.. ఎన్నో వింతలు విశేషాలకు నెలవుగా మారింది. అలాంటి దేశానికి వెళ్లి వాళ్ల అభివృద్ధిని ఒక్కసారైనా కళ్లారా చూసి రావాల్సిందే. -నాగేంద్ర సురేశ్ పెండ్యాల
భయం అనేదే ఉండదు
నేను దుబాయ్ వచ్చి 15 ఏళ్లవుతోంది. ఇక్కడి ప్రజలు చాలా కలివిడిగా ఉంటారు. బయటకు ఎక్కడకు వెళ్లినా భయం అనేదే ఉండదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, మిగిలిన ప్రాంతాల్లోనూ పోలీసులు కనిపించరు. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. మోసాలు చేయడం.. దొంగతనాలు వంటివి ఉండవు. తప్పు చేస్తే మాత్రం శిక్షలు కఠినంగానే ఉంటాయి. ఎవరైనా దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే వారికి ఇక్కడి ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తుంది. లంచాలు, అవినీతి కనిపించవు. దీంతో చాలా మంది విదేశీయులు ఇక్కడ వ్యాపారరంగంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నారు. -దాకర సారథి, చెఫ్
అందరినీ అక్కున చేర్చుకుంటారు
దుబాయ్‌లో లోకల్ ఫీలింగ్ తక్కువ. నైపుణ్యం ఉన్నవారిని వారు అక్కున చేర్చుకుంటారు. ఇక్కడ అన్ని దేశాల నుంచి ఉపాధి కోసం చాలామంది వస్తుంటారు. ముఖ్యంగా ఇండియా, ఆఫ్రికా, పాకిస్థాన్ తదితర దేశాల నుంచి వచ్చిన వారు అధికంగా ఉంటారు. మాది కడప జిల్లా రైల్వేకోడూరు. దుబాయ్ వచ్చి 12ఏళ్లవుతోంది. వచ్చిన నాటినుంచి ఏ ఇబ్బందీ పడలేదు. ఏడాదికి 10 నెలలు ఇక్కడ పనిచేసి రెండు నెలలు సెలవు తీసుకొంని ఇండియా వస్తాను. కుటుంబంతో గడిపి తిరిగి దుబాయ్ వస్తాను. కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి రాలేదు. వీడియో కాల్స్ ఉండడంతో కొంతవరకు బెంగ తీరుతోంది. -జావేద్, క్యాబ్ డ్రైవర్
